నేడు టీటీడీ మహా దీపోత్సవం

ABN , First Publish Date - 2020-11-30T06:55:51+05:30 IST

టీటీడీ పరిపాలన భవనం వెనుక ఉన్న మైదానంలో 800 దీపాలు వెలిగించనున్నారు.

నేడు టీటీడీ మహా దీపోత్సవం

తిరుపతి, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): దీపపు ప్రమిదలు పెట్టుకోవడానికి ఐదు ఇటుకలతో చిన్న దిమ్మె. ప్రతి దిమ్మెకు ఆవు పేడ పూసి.. ముగ్గులేశారు. ఇలా ప్రతి దీపపు దిమ్మెను ఓ యజ్ఞగుండంలా తీర్చిదిద్దారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం వెనుక మైదానంలో మొత్తం 800 దిమ్మెలను సిద్ధం చేశారు. వీటిపై సోమవారం సాయంత్రం ఆరు గంటలకు దీపాలు వెలిగించనున్నారు. ఒక్కో దిమ్మె వద్ద ఒక్కో మహిళ సంప్రదాయ దుస్తులతో కూర్చోవాలి. కొవిడ్‌ నేపథ్యంలో మాస్కు లు తప్పనిసరి. భౌతిక దూరం పాటించేలా టీటీడీ చర్యలు తీసుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే మహిళలకు పసుపు, కుంకుమ, రవిక, పసుపుదారం ఇవ్వనున్నారు. 720 వత్తులున్న పెద్దవత్తిని, ప్రమిద, నెయ్యి టీటీడీనే సిద్ధం చేసేస్తుంది.  ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి పాసులు తప్పనిసరి. వి.వి.ఐ.పి, వి.ఐ.పి, ఉద్యోగులు, ఇతరులు అనే నాలుగు రకాల పాసుల ను టీటీడీ విజిలెన్స్‌ అందిస్తోంది. పాసులున్న వారినే లోపలకు అనుమతిస్తారు. ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది.  టీటీడీ పరిపాలన భవనంతో పాటు, కార్తీక మహా దీపోత్సవం జరిగే ప్రాంగణం మొత్తం ఇప్పటికే అరటిమాన్లతో అలకరించారు. విద్యుత్‌ దీపాకాంతులను సిద్ధం చేశారు. శ్రీవారి సేవకులు దీపోత్సవంలో కీలకంగా పని చేస్తున్నారు. ఈ దీపోత్సవం లో కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామి అనుగ్రహ భాషణం చేయనున్నారు.  

Updated Date - 2020-11-30T06:55:51+05:30 IST