నేడు ఎమ్మెల్సీ ఫలితం

ABN , First Publish Date - 2021-12-14T05:22:30+05:30 IST

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితం ఈనెల 14న తేలనుంది. వ్యూహం ప్రకారం వ్యవహరించి పకడ్బందీగా పోలింగ్‌ పూర్తిచేయించడంతో ఘనవిజయం ఖాయమని మంత్రి జగదీ్‌షరెడ్డి ధీమాతో ఉన్నారు.

నేడు ఎమ్మెల్సీ ఫలితం
నల్లగొండలో మాక్‌ కౌంటింగ్‌ను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్‌ పీజే.పాటిల్‌

10 గంటలకే తేలనున్న సరళి

12గంటలకు తుది ఫలితం

నాలుగు టేబుళ్లపై లెక్కింపు

తొలి ప్రాధాన్యంతోనే టీఆర్‌ఎస్‌ గెలిచే అవకాశం?

ఘన విజయంపై ఆ పార్టీ నేతల అంచనాలు



(ఆంధ్రజ్యోతి ప్రతినిధి,నల్లగొండ):  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితం ఈనెల 14న తేలనుంది. వ్యూహం ప్రకారం వ్యవహరించి పకడ్బందీగా పోలింగ్‌ పూర్తిచేయించడంతో ఘనవిజయం ఖాయమని మంత్రి జగదీ్‌షరెడ్డి ధీమాతో ఉన్నారు. కనీస మాత్రమైనా క్రాస్‌ ఓటింగ్‌ జరుగుతుందా? కాంగ్రె్‌సతో పాటు విపక్ష పార్టీ ల ఓట్లు స్వతంత్ర అభ్యర్థుల్లో ఒక్కరికే పోల్‌ అవుతాయా? లేదా అనేది 14 మధ్యాహ్నం 12గంటలకల్లా తేలనుంది. ప్రాధాన్య క్రమంలో ఓట్ల లెక్కింపు కావడంతో ఆ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. లెక్కింపు ప్రక్రియలో కొవిడ్‌ నిబంధనలు పాటించాలని సిబ్బందితో పాటు అభ్యర్థు లు, ఏజెంట్లకు ఎన్నికల అధికారి,కలెక్టర్‌ పీజే.పాటిల్‌ ఆదేశాలు జారీ చేశారు.


స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో మొత్తం 1271 ఓట్లకు 1233 ఓట్లు పోల్‌ అయ్యాయి. 97.01శాతం పోలింగ్‌ నమోదైంది. 14న ఉదయం 8 గంటలకు నల్లగొండ జిల్లా కేంద్రంలో కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. మొత్తం 1233 ఓట్లు పోల్‌ కాగా లెక్కింపునకు నాలుగు టేబుళ్లు కేటాయించారు. మొత్తం ఎనిమిది పోలింగ్‌ కేంద్రాలు కాగా, తొలుత నాలుగు పోలింగ్‌ కేంద్రాలకు చెందిన బ్యా లెట్‌ బాక్సులను టేబుళ్లపైకి చేరుస్తారు. ప్రతీ టేబుల్‌ కు ఒక సూపర్‌వైజర్‌, ఇద్దరు అసిస్టెంట్లు, ఒక మైక్రోఅబ్జర్వర్‌ ఉంటారు. బ్యాలెట్‌ బాక్సులను తెరచి 25 చొప్పున కట్టలుగా కడతారు. ఇక్కడ పూర్తిగా బ్యాలెట్‌ పేపర్లను ఓపెన్‌ చేయకుండానే కట్టలు కడతారు. రెండో రౌండులో ఐదు నుంచి ఎనిమిది పోలింగ్‌ కేంద్రాలకు చెందిన బ్యాలెట్లను కట్టలుగా కడతారు. ఈ ప్రక్రియకు సుమారు గంటన్నర సమయం తీసుకునే అవకాశం ఉం ది. ఉదయం 9.30గంటలకు కట్టలు కట్ట డం పూర్తవుతుంది. ఆ తర్వాత కట్టలు కట్టిన బ్యాలెట్‌ పేపర్లన్నింటినీ ఒక డ్రమ్‌లో పోసి కలియబెడుతారు. ఏ పోలింగ్‌ కేంద్రానికి సంబంధించిన బ్యాలెట్‌ పేపర్లో తెలియకుండా జాగ్రత్త తీసుకుంటారు. ఆ తర్వాత బ్యాలెట్‌ కట్టలను ఓపెన్‌ చేసి అందులో చెల్లుబా టు కానీ బ్యాలెట్లను పక్కనపెడతారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక విజయానికి కావాల్సిన కోటాను నిర్ధారిస్థారు. చెల్లిన ఓట్లల్లో సగానికి అదనంగా ఒక ఓటు సాధించిన వారిని విజేతగా ప్రకటిస్తారు. 1233 ఓట్లు పోల్‌ కాగా, ఉదాహరణకు అందులో 33 ఓట్లు చెల్లనివి ఉంటే, 1200 చెల్లినవిగా గుర్తించి అందులో సగానికి అదనంగా ఒకటిని అంటే 601 ఓట్లను విజయానికి కావాల్సిన కోటాగా నిర్ధారిస్తారు. మొదటి రౌండులో తొలి ప్రాధాన్యంలో ఎవరైన అభ్యర్థి 601 ఓట్లు సాధిస్తే విజేతగా ప్రకటిస్తారు. లేదంటే ఎలిమినేషన్‌ ప్రక్రియ ప్రా రంభం అవుతుంది. ఈ ఎన్నిక లో అధికార టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తొలి ప్రాధాన్య ఓటుతోనే గెలుపొందుతారనే ధీమాలో ఆ పార్టీ నేతలు ఉన్నారు. తొలి ప్రాధాన్యంలోనే విజేతగా ఖరారైతే ఉదయం 12గంటలకు లెక్కింపు ప్రక్రియ మొత్తం పూర్తయ్యే అవకాశం ఉంది. అయితే ఉదయం 10గంటలకే ఓట్లు ఎవరికి అత్యధికంగా వచ్చా యో సరళి తెలిసే అవకాశం ఉంది. కరోనా నేపథ్యంలో ఎన్నికల సిబ్బంది, అభ్యర్థులు, ఏజెంట్లు, మీడియా సిబ్బంది అంతా రెండు డోస్‌ల వ్యాక్సిన్‌ పూర్తయినట్లు సర్టిఫికెట్‌ చూపించాలి. లేనిపక్షంలో కౌంటింగ్‌కు ముందే అక్కడే ఏర్పాటు చేసిన టెస్టింగ్‌ సెంటర్‌లో పరీక్ష చేయించుకొని నెగటివ్‌ సర్టిఫికెట్‌ పొందాల్సి ఉంటుందని కలెక్టర్‌ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.


ఘన విజయంపై టీఆర్‌ఎస్‌ ధీమా

ప్రత్యర్థి పార్టీలు అధికారికంగా అభ్యర్థిని బరిలో నిలపకపోవడం, సొంత పార్టీ నుంచి ఓటింగ్‌ క్రాస్‌ కాకుండా జాగ్రత్తలు, చివరి దశలో విపక్ష ఓటర్లను ఆకర్షించే ప్రయత్నంలో అధికార పార్టీ విజయం సాధించడంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎంసీ.కోటిరెడ్డి ఘన విజయం సాధిస్తారనే అంచనాలో ఆ పార్టీ నేతలు ఉన్నారు. తొలి ప్రాధాన్య కోటాతోనే విజయం సాధిస్తారని అధికార పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. పార్టీ అభ్యర్థి ఎవరూ లేకపోవడం, స్వతంత్రులుగా పోటీ చేసిన ఆరుగురిలో ఐదుగురు కాంగ్రెస్‌ నేతలే కావడంతో ఆ పార్టీ ఓటర్లు ఎవరికి ఓటు వేయాలో అర్థంకాని పరిస్థితి. పార్టీ నాయకత్వం తెరవెనుక ఉన్నా కనీసం ఓటర్లకు ఫోన్లు చేసి రప్పించుకోవడం చేయలేదు. ఓటింగ్‌కు గైర్హాజరైన ఓటర్లలో అత్యధికులు కాంగ్రె్‌సకు చెందిన వారే ఉన్నారు. కాగా, ఈ విజయంతో ఉమ్మడి జిల్లాలో పార్టీకి మంచి నైతికబలం చేకూరుతుందనే విశ్వాసంలో అధికార పార్టీ నేతలు ఉన్నారు. ఎక్స్‌అఫీషియోతో కలిపి టీఆర్‌ఎస్‌ బలం 820 కాగా, కాంగ్రె్‌సకు 384, బీజేపీ 35, సీపీఎం 18, సీపీఐ ఐదు ఓట్లు ఉండగా, స్వతంత్రులు 9 మంది ఉన్నారు. ఏడు స్థానాలు ఖాళీ ఉన్నాయి. 1259 ఓట్లు కాగా, వీటికి 19 ఎక్స్‌అఫీషియో ఓట్లు జతయ్యాయి.


 కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి

రిటర్నింగ్‌ అధికారి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కౌంటింగ్‌ కు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ పీజే.పాటిల్‌ తెలిపారు. జిల్లా మహి ళా సమాఖ్య భవనంలో ఎన్నిక ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను ఎస్పీ ఏవీ.రంగనాథ్‌తో కలిసి ఆయన సోమవారం పరిశీలించారు. అనంతరం మాక్‌ కౌంటింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను అనుసరించి కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ కౌంటింగ్‌ నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కొవిడ్‌ డబుల్‌ డోస్‌ వ్యాక్సిన్‌ సర్టిఫికెట్‌ లేనివారు కౌంటింగ్‌ కేంద్రం వద్ద ఉన్న కొవిడ్‌ పరీక్ష కేంద్రంలో పరీక్ష చేయించుకొని, నెగటివ్‌ రిపోర్ట్‌ వస్తేనే అనుమతిస్తామన్నారు. 14న ఉదయం 8గంటలకు కౌం టింగ్‌ ప్రారంభవుతుందని, కౌంటింగ్‌ సిబ్బంది ఉదయం 6.30 గంటలకు కౌంటింగ్‌ కేంద్రంలో రిపోర్టు చేయాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాధాన్య క్రమం ప్రకారం ఓటర్లు ఓటు వేస్తారు కాబట్టి కౌంటింగ్‌లో భాగంగా కోటా నిర్ధారించి లెక్కింపు చేపడతామన్నారు. ఎవరైనా అభ్యర్థి కోటాకు సరిపడా ఓట్లు సాధిస్తే విజేతగా ప్రకటిస్తామన్నారు. ఏ అభ్యర్థికి కోటాకు రావాల్సిన ఓట్లు రాకుంటే ఎలిమినేషన్‌ ప్రక్రియ చేపట్టి ఏదైనా అభ్యర్థి కోటా సాధించే వరకు లెక్కింపు ప్రక్రియ కొనసాగిస్తామన్నారు. ఏ అభ్యర్థికి కోటా రాకుంటే ఎలిమినేషన్‌ ప్రక్రియలో చివరకు మిగిలిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తామన్నారు. ఆయన వెంట ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి, నల్లగొండ తహసీల్దార్‌ నాగార్జునరెడ్డి, మాస్టర్‌ ట్రైనర్‌ తరాల పరమేష్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-12-14T05:22:30+05:30 IST