నేడు గులాబీ పండుగ!

ABN , First Publish Date - 2022-04-27T06:51:27+05:30 IST

రాష్ట్రంలోని అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ యుక్త వయసులోకి ప్రవేశిస్తోంది. నేటి

నేడు గులాబీ పండుగ!

  • టీఆర్‌ఎస్‌ 21వ వార్షికోత్సవం..
  • హైటెక్స్‌లో ప్లీనరీకి భారీ ఏర్పాట్లు
  • 11 తీర్మానాలపై చర్చ, ఆమోదం
  • పార్టీ ‘జాతీయ’ పాత్రపై స్పష్టత
  • ఎనిమిదేళ్ల రాష్ట్ర పాలనపై సమీక్ష
  • భవిష్యత్తుపై పార్టీ శ్రేణులకు భరోసా
  • జాతీయ మీడియాకు ఆహ్వానం


 హైదరాబాద్‌, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ యుక్త వయసులోకి ప్రవేశిస్తోంది. నేటి (ఏప్రిల్‌ 27)తో 21 ఏళ్లు పూర్తి చేసుకొని, 22వ యేట అడుగు పెట్టబోతోంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌ మాదాపూర్‌ హైటెక్స్‌లో ప్రతినిధుల సభ (ప్లీనరీ) నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు మంగళవారం రాత్రి వరకు పూర్తయ్యాయి. బుధవారం నాటి ప్లీనరీ వేదికగా పార్టీ కేడర్‌కు టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు.. రాజకీయ, ప్రభుత్వపరమైన అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు.


జాతీయ రాజకీయాల్లో టీఆర్‌ఎస్‌ పాత్రపై మరింత స్పష్టత ఇవ్వనున్నారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, సర్కారుపై విపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునివ్వనున్నారు. మతతత్వ రాజకీయాలను దరిచేరనీయవద్దని, ఈ విషయంలో ప్రజలు జాగరూకతతో ఉండేలా చూడాలని సూచించనున్నారు. భవిష్యత్తుపై శ్రేణులకు భరోసా కల్పించడంతో పాటు రాష్ట్ర, జాతీయ స్థాయిలోనూ సుదీర్ఘకాలం పార్టీ రాణించటానికి కార్యకర్తలు నడుచుకోవాల్సిన మార్గాన్ని నిర్దేశించనున్నారు. ముందుగా ప్రకటించినట్లుగా ప్లీనరీలో 11 తీర్మానాలపై చర్చ, ఆమోదం ఉంటాయని టీఆర్‌ఎస్‌ ముఖ్యులు చెబుతున్నారు.


ఈ క్రమంలోనే దేశం, రాష్ట్రానికి సంబంధించిన అంశాల ప్రస్తావనతోపాటు, పార్టీ వైఖరిని స్పష్టం చేయనున్నారు. అలాగే 13 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర సాధన పోరాట ప్రస్థానాన్ని మరోసారి గుర్తు చేసుకుంటూ.. ఎనిమిదేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనా తీరును సమీక్షించనున్నారు. పార్టీ ఆవిర్భావం తర్వాత ఆరు నెలల వ్యవధిలో రెండోసారి ప్లీనరీ ఏర్పాటు చేయటం ఇదే తొలిసారి. 


జాతీయ మీడియాకు ఆహ్వానం

ఈ ప్లీనరీకి మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర కీలక ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు వెరసి మూడు వేల మందిని మాత్రమే పిలిచారు. తెలంగాణపై కేంద్ర సర్కారు వివక్ష చూపుతున్నదనే వాదన వినిపిస్తుండటం, జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని భావిస్తున్న నేపథ్యంలో ఈసారి ప్లీనరీకి పార్టీ వ్యూహకర్తలు జాతీయ మీడియాను ఆహ్వానించారు. ప్రతినిధుల సభను ఉదయం 11 గంటలకు ప్రారంభించాలని నిర్ణయించారు.  




తెలంగాణ భవన్‌లో 40 అడుగుల ఎత్తులో జెండా   

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో భారీ ఎత్తులో పార్టీ జెండాను ఏర్పాటు చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో 40 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన ఈ జెండాను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కే తారక రామారావు బుధవారం ఎగురవేయనున్నారు. 




ప్లీనరీ.. పింక్‌ సిటీ..!  

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): టీఆర్‌ఎస్‌ వార్షికోత్సవం నేపథ్యంలో హైదరాబాద్‌ ప్రధాన, అంతర్గత రహదారులు తోరణాలు, జెండాలు, ఫ్లెక్సీలు, నేతల కటౌట్లతో గులాబీమయంగా మారాయి. నెక్లెస్‌ రోడ్‌లోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద, ఖైరతాబాద్‌ జంక్షన్‌, జూబ్లీ చౌరస్తా, సికింద్రాబాద్‌, ఉప్పల్‌ తదితర ప్రాంతాల్లో గులాబీ తోరణాలతో అలంకరించారు. అగ్రనేతల ఆదేశాలతో నగరంలోని ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు గతానికి భిన్నంగా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. బేగంపేటలోని ప్రగతిభవన్‌ నుంచి ప్లీనరీ జరిగే హెచ్‌ఐసీసీకి వెళ్లే మార్గాలన్నీ గులాబీ వనాన్ని తలపించాయి. 




తెలంగాణ దశ, దిశను మార్చిన నేత కేసీఆర్‌: ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 26(ఆంధ్రజ్యోతి): తెలంగాణ దశ, దిశను మార్చిన నేత కేసీఆర్‌ అని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినం సందర్భంగా మంగళవారం ఆమె తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫొటోలు కొన్ని ట్విటర్‌లో షేర్‌ చేశారు. ‘ఒక్కడిగా మొదలై, యావత్తు తెలంగాణను కదిలించి, తెలంగాణ దశ, దిశను మార్చిన మన ప్రియతమ నేత కేసీఆర్‌ గారి ప్రయాణంలో కొన్ని చిత్రాలు’.. అంటూ కవిత ఫొటోలను పోస్టు చేశారు. 


Updated Date - 2022-04-27T06:51:27+05:30 IST