నాడు స్వర్ణయుగం.. నేడు శిథిలమయం

ABN , First Publish Date - 2022-05-27T05:03:57+05:30 IST

ఒకనాడు కడప జిల్లా కేంద్రంగా, అంతకుముందు 18 తరాల రాజవంశీయుల పాలనలో స్వర్ణయుగంగా భాసిల్లి రాయలసీమ నడిబొడ్డున నెల్లూరు, ప్రకాశం జిల్లాల సరిహద్దున రాష్ట్రానికే తలమానికంగా శోభిల్లిన సిద్దవటం కోట నేడు శిథిలాల బాటగా మారిపోయింది.

నాడు స్వర్ణయుగం.. నేడు శిథిలమయం
సిద్దవటం కోట ముఖద్వారం

రాయలసీమకే తలమానికం.. రారాజులకే అంకితం    

కాలగర్భంలో కలిసిపోతున్న సిద్దవటం కోట 

గుప్త నిధుల కోసం తవ్వకాలు


రాజంపేట, మే 26: ఒకనాడు కడప జిల్లా కేంద్రంగా, అంతకుముందు 18 తరాల రాజవంశీయుల పాలనలో స్వర్ణయుగంగా భాసిల్లి రాయలసీమ నడిబొడ్డున నెల్లూరు, ప్రకాశం జిల్లాల సరిహద్దున రాష్ట్రానికే తలమానికంగా శోభిల్లిన సిద్దవటం కోట నేడు శిథిలాల బాటగా మారిపోయింది. రాజంపేట నియోజకవర్గ పరిధిలోని నేడు మండల కేంద్రమైన సిద్దవటంలో క్రీస్తుపూర్వం 30-40 సంవత్సరాల మధ్యకాలంలో రూపుదిద్దుకున్న ఈ కోట అలనాటి సంస్కృతీ సంప్రదాయాలు, శిల్పకళా సంపద, నాటి రాజుల రాజవైభోగానికి ప్రతిబింబంగా నిలుస్తోంది. ఈ కోటను పురావస్తు శాఖ ఆధీనంలో ఉంచుకున్నా సరైన భద్రత లేక రోజురోజుకు కోట పడిపోతున్నా పట్టించుకునే నాథుడే లేడు. సిద్దవటం కోటను ఒకసారి పరిశీలిస్తే.. ఎన్నో ఆసక్తికరమైన విషయాలు, అలనాటి సంస్కృతీ సంప్రదాయాలు నేడు సజీవ సాక్ష్యాలుగా నిలిచి ఉన్నాయి. కడప నుంచి భాకరాపేట మీదుగా నెల్లూరుకు వెళ్లే రహదారిలో పెన్నానది ఒడ్డున సిద్దవటం కోట ఉంది. 36 ఎకరాల పైబడి విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ కోటను 18 రాజవంశీయులు పాలించారు. ఈ కోటకు ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఈ కోటను మౌర్యులు, శాతవాహనులు, పూర్వపల్లవులు, గుప్తులు, తెలుగు చాణక్యులు, కంచిపల్లవులు, బాదామాచాణుక్యులు, రాష్ట్రకూటులు, రేణాతి చోళులు, బైదంబులు, విజయనగర చక్రవర్తులు, మట్లిరాజులు, గోల్కొండ నవాబులు, హైదర్‌అలీ, టిప్పుసుల్తాన్‌, మాయానా నవాబు, మొగళులు, మహారాష్ర్టులు, పాలేగాండ్లు పరిపాలించారు. అయితే వారి పరిపాలనకు సజీవ సాక్ష్యాలుగా శిల్పకళా సంపద, ఢంకానగర్‌, మొదటి మండపం, రెండవ మండపం, రాణిమహల్‌, కోనేరు, నిజాంనవాబు నిర్మించిన మసీదు, హైదర్‌ అలీ నిర్మించిన దర్గా, సొరంగమార్గాలు, కామాక్షీ గుడి, నంది విగ్రహం, రాణీస్నానపు తొట్టి వంటివి ఉన్నాయి. 


పాలనకు కేంద్రం సిద్దవటం కోట

18 తరాల రాజవంశీయులు ఈ కోటను ఆధారంగా చేసుకుని పరిపాలన చేసినట్లు చరిత్ర చెబుతోంది. మౌర్యుల నుంచి తూర్పు ఇండియా వర్తక సంఘం వరకు ఈ కోటను పాలించారు. 1543 నుంచి 1579 వరకు సాగిన పాలనను స్వర్ణయుగంగా పరిగణిస్తారు. 1605 వరకు ఉన్న మట్టి కోట కాస్త రాతి కట్టడంగా మారింది. 1792 సంవత్సరంలో టిప్పు సుల్తాన్‌ నుంచి నైజాం నవాబుల పాలనలోకి, అనంతరం 1880లో తూర్పు ఇండియా వర్తకసంఘం ఆధీనంలో ఈ కోట పాలింపబడింది. బ్రిటీషు కాలంలో 1808 నుంచి 1812 వరకు కడప జిల్లా పరిపాలనా కేంద్రంగా భాసిల్లింది. దక్షిణం వైపు పెన్నానది, మిగిలిన మూడు వైపులా లోతైన అగడ్తలతో శత్రువులు ప్రవేశించడానికి వీలు కాని రీతిలో ఈ కోటను నిర్మించారు. మట్లిరాజులు ఈ కోటను పరిపాలించే నాటికి ఇది మట్టి కోట. అనంతరం శ్రీకృష్ణదేవరాయల అల్లుడు వరద రాజులు మొదట ఈ కోటను పాలించాడు. అంతకుముందు ఈ కోట ఉదయగిరి రాజ్యంలో ఉండేది. అనంతరం మట్లిరాజుల పరిపాలనలోకి వచ్చింది. మట్లి రాజైన అనంతరాజు మట్లి కోటను శత్రు దుర్భేద్యమైన రాతికోటగా నిర్మించాడు. మట్లిరాజుల పతనం తరువాత ఔరంగజేబు సేనాని మీర్‌జుమ్లా సిద్దవటంను ఆక్రమించి పాలించాడు. ఆ తరువాత ఆర్కాటు నవాబులు సిద్దవటం కోటను స్వాధీనం చేసుకున్నారు. కడపను పాలిస్తున్న అబ్దుల్‌నభీఖాన్‌ 1714లో సిద్దవటంను తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు. 1799లో సిద్దవటం కోట ఈస్ట్‌ ఇండియా కంపెనీ వశమైంది. కోటకు పడమర, తూర్పున రెండు ముఖద్వారాలున్నాయి. ముఖద్వారానికి ఇరువైపులా ఆంజనేయుడు, గరుత్మంతుడు శిల్పాలు ఉన్నాయి. పశ్చిమ ద్వారం ఇరువైపులా నాట్యభంగిమలో అందమైన శిల్పాలు ఉన్నాయి. 

పశ్చిమ ద్వారం లోపల పైభాగాన రాహుగ్రహం, పట్టువిడుపులు ఉన్నాయి. కోట మధ్య భాగంలోని అంతఃపురం శిథిలమై ఉంది. రాణీదర్బార్‌, ఈద్గామసీదు, సమీపంలోని నగారా ఖానా, వెనుక కోట గోడకు మధ్య తాగునీటి కోనేరు ఉంది. కోటలో సిద్దేశ్వరస్వామి ఆలయం, ఎదురుగా నంది విగ్రహం, కామాక్షి ఆలయం ఉన్నాయి.  టిప్పు సుల్తాన్‌ కాలంలో దర్గాను నిర్మించారు. దీని పక్కనే మసీదు ఉంది. మసీదుకు తూర్పుగా కోట గోడలో సొరంగ మార్గాన్ని ఏటిలోకి నిర్మించారు. చక్రయంత్రం ద్వారా ఏటిలో నీటిని మసీదు తొట్టిలోకి తోడేవారు. మట్లిరాజులు అంతకు పూర్వం పరిపాలించిన రాజుల కాలంలో రత్నాలను రాసులుగా పోసి వజ్రవైడూర్యాలు, బంగారు నాణాలతో వ్యాపార లావాదేవీలు కొనసాగించే వారని చరిత్ర చెబుతోంది. అప్పట్లో రాజులకు శిస్తురూపంలో ప్రజల నుంచి కూడా కొంత నగదును వజ్ర వైడూర్యాలు, బంగారు రూపంలో సేకరించి ఖజానాలను నింపుకునే వారు. ఎందరో రాజులు పాలించిన కోటలో కేంద్ర ఖజానా కారాగారంలో వజ్ర వైడూర్యాలు ఉంటాయన్న ప్రచారం ఊపందుకోవడంతో కొందరు వీటిపై కన్నేసి సందర్శకుల రూపంలో తరచూ కోటలోని అంతర్భాగంలో తిరుగుతూ అన్వేషణలు చేస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. ఈ దశలో కోట రక్షణపై సర్వత్రా నీలినీడలు కమ్ముకున్నాయి. పురాతన కట్టడాలను, ఆస్తులను దక్కించుకునేందుకు కేంద్ర పురావస్తు, పర్యాటక శాఖలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నా స్థానికంగా కోటలో ఇప్పటికే కొన్ని అమూల్యమైన పురాతన కట్టడాలు కూలిపోయి కాలగర్భంలో కలిసిపోయాయి. వీటిని పునరుద్ధరించే విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుతం ఉన్న కట్టడాలను పరిరక్షించి భావితరాలకు అందించే కార్యక్రమాలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. లేదంటే ఉన్న కట్టడాలు కూడా కూలిపోయే పరిస్థితి నెలకొంటుంది.



Updated Date - 2022-05-27T05:03:57+05:30 IST