నేడు భారత్‌ బంద్‌

ABN , First Publish Date - 2021-02-26T09:04:19+05:30 IST

పెరిగిన పెట్రో ధరలు, జీఎస్టీ నియమాల్లో మార్పులు, ఈ-వే బిల్లుంగ్‌లకు నిరసనగా అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య (సీఏఐటీ) శుక్రవారం దేశవ్యాప్తంగా బంద్‌కు

నేడు భారత్‌ బంద్‌

పిలుపునిచ్చిన అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య

పెరిగిన పెట్రో ధరలు, జీఎస్టీ సమస్యలకు నిరసనగానే 

బంద్‌కు 2 ప్రధాన సంఘాలు దూరం

ఏపీ లారీ ఓనర్స్‌ సంఘం మద్దతు


న్యూఢిల్లీ, విజయవాడ, ఫిబ్రవరి 25: పెరిగిన పెట్రో ధరలు, జీఎస్టీ నియమాల్లో మార్పులు, ఈ-వే బిల్లుంగ్‌లకు నిరసనగా అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య (సీఏఐటీ) శుక్రవారం దేశవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చాయి. దేశవ్యాప్తంగా 8 కోట్ల మందికి ప్రాతినిథ్యం వహిస్తున్న 40,000 సంఘాలు ఈ బంద్‌లో పాల్గొంటాయని సీఏఐటీ సెక్రటరీ జనరల్‌ ప్రవీణ్‌ ఖండేల్వాల్‌ ప్రకటించారు. దాదాపు కోటి మంది దాకా ఉన్న లారీ యజమానుల సంఘం, అఖిల భారత రవాణా సంక్షేమ సంఘం కూడా ఈ బంద్‌కు మద్దతిస్తున్నాయని ఆయన తెలిపారు. అయితే ఆయన వ్యాఖ్యలతో రెండు కీలక వ్యాపార సంఘాలు విభేదించాయి. బంద్‌లో తాము పాల్గొనబోవడం లేదని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా వ్యాపార్‌ మండల్‌, భారతీయ ఉద్యోగ్‌ వ్యాపార్‌ మండల్‌ స్పష్టం చేశాయి. ఈ రెండు సంఘాల కింద కూడా వందల సంఖ్యలో యూనియన్లున్నాయి.


‘మొదట చెప్పిన లక్ష్యాల నుంచి జీఎస్టీ పక్కకు మరలింది. అనేక రాక్షస నిబంధనలు చేర్చింది.  ఇన్‌పుట్‌ టాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ) వ్యాపారులకు లభించడం కష్టమవుతోంది. అది ఇవ్వకపోవడం వల్ల వారిపై అదనపు ఆర్థికభారం పడుతోంది. ఈ విషయాన్ని దేశంలోని అనేక వ్యాపార సంఘాలు 200 జిల్లాల కలెక్టర్ల ద్వారా ఫిబ్రవరి 22న ప్రధాని మోదీకి మెమొరాండం పంపాయి. ఒకవేళ దాన్ని పట్టించుకోకపోతే 500 జిల్లాల నుంచి మరోసారి గుర్తుచేస్తాం. అప్పటికీ నిర్ణయం మారకపోతే కార్యాచరణ మొదలుపెడతాం. జీఎస్టీ నియమాల్ని తిరగరాయాల్సిందే’’ అని ఫెడరేషన్‌ ఆఫ్‌ వ్యాపార్‌ మండల్‌ నేత వీకే బన్సాల్‌ చెప్పారు. అయితే తాము పాల్గొనడం లేదని రెండు వ్యాపార సంఘాలు స్పష్టం చేయడంతో బంద్‌కు ఏ మేరకు స్పందన లభిస్తుందన్నది వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశమైంది. కాగా సీఏఐటీ ఇచ్చిన బంద్‌ పిలుపునకు ఏపీ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ సంఘీభావం ప్రకటించింది. పెట్రో ధరలు తగ్గించకపోతే త్వరలో నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించింది. రాష్ట్ర వ్యాప్తంగా లారీ యజమానులు లారీలను బయటకు తీయవద్దని అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైవీ ఈశ్వరరావు గురువారం పిలుపునిచ్చారు. 

Updated Date - 2021-02-26T09:04:19+05:30 IST