నేడు సద్దుల బతుకమ్మ

ABN , First Publish Date - 2020-10-24T11:36:04+05:30 IST

తెలంగా ణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకైన బతుకమ్మ సంబురాల్లో భాగంగా శనివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుక జరగనుంది

నేడు సద్దుల బతుకమ్మ

నల్లగొండ కల్చరల్‌, సూర్యాపేటటౌన్‌, అక్టోబరు 23: తెలంగా ణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకైన బతుకమ్మ సంబురాల్లో భాగంగా శనివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుక జరగనుంది. కరోనా నేపథ్యంలో సందడి తగ్గినా సద్దుల బ తుకమ్మ వేడుకలకు మహిళలు సిద్ధమవుతున్నారు. శుక్రవారం ప లు పట్టణాల్లో మహిళలు రంగురంగుల పూలు కొనుగోలు చేయడంతో సందడి నెలకొంది. సాధారణ రోజుల్లో కిలో బంతి, చామంతిపూలు రూ.80 నుంచి రూ.100 వరకు ధర పలకగా, శుక్రవారం రూ.130నుంచి రూ.200 వరకు వ్యాపారులు ధర పెంచి విక్రయించారు. నల్లగొండలో క్లాక్‌టవర్‌ సెంటర్‌, శివాజీనగర్‌, ప్రకాశంబజార్‌, హైదరాబాద్‌ రోడ్‌, పాతబస్తీ, దేవరకొండ రోడ్‌, సూర్యాపేటలో పాతబస్టాండ్‌, వాణిజ్యభవన్‌ సెంటర్‌, పూల సెంటర్‌, కొత్తబస్టాండ్‌ ప్రాంతాల్లో పూల విక్రయాలతో సందడి ఏర్పడింది.


రేపే దసరా

రాష్ట్ర విద్వత్‌ సభ నిర్ణయించిన ప్రకారంగా దసరా పండుగను ఈనెల 25వ తేదీనే నిర్వహించాలని ధూపదీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దౌలతాబాద్‌ వాసుదేవశర్మ, జిల్లా అధ్యక్షుడు పోతులపాటి రామలింగేశ్వరశర్మ, సూర్యాపేట శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ ప్రధాన అర్చకుడు నల్లాన్‌ చక్రవర్తుల వేణుగోపాలచార్యులు వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. ధర్మసింధుశాస్త్రం, నిర్ణయసింధుశాస్త్రం ప్రకారం 25నే విజయదశమి అని, 26న పండుగ అనే వదంతులను నమ్మవద్దన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఉద్యోగుల కోరిక మేరకే 26న సెలవు ప్రకటించిందన్నారు.


పండుగను ఇళ్లవద్దే చేసుకోవాలి మంత్రి జగదీ్‌షరెడ్డి

సూర్యాపేట(కలెక్టరేట్‌), నల్లగొండ రూరల్‌: సద్దుల బతుకమ్మ, విజయదశమి సంబరాలను కరోనా నేపథ్యంలో ఇళ్లవద్దనే చేసుకోవాలని మంత్రి జగదీ్‌షరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. సామూహిక బతుకమ్మ ఆట, జమ్మిపూజ, సంబరాలతో కరోనా ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు సహకరించాలన్నారు. కేరళ రాష్ట్రంలో సామూహికంగా నిర్వహించిన ఓనం పండుగ కారణంగా కరోనా విజృభించిందన్నారు. ఆ పరిస్థితి రాష్ట్రంలో రాకూడదని కోరారు. అంతా మాస్క్‌లు ధరిస్తూ, భౌతికదూరం పాటిస్తూ ఆరోగ్యంగా పండుగలు నిర్వహించాలని కోరుతూ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - 2020-10-24T11:36:04+05:30 IST