నేడు రాఖీ పౌర్ణమి

ABN , First Publish Date - 2020-08-03T10:48:41+05:30 IST

ఓ అన్నా నీ అనురాగం.. ఎన్నో జన్మల పుణ్యఫలం.. అంటూ ఓ సినీ కవి చెప్పినట్లుగా సోదర, సోదరీమణుల మధ్య ఆత్మీయ అనుబంధానికి

నేడు రాఖీ పౌర్ణమి

 కానరాని సందడి

 పండుగపై కరోనా ప్రభావం

 వెలవెలపోయిన రాఖీ దుకాణాలు

 బహుమతులుగా మాస్క్‌లు, శానిటైజర్లు


వరంగల్‌ కల్చరల్‌, ఆగస్టు 2: ఓ అన్నా నీ అనురాగం.. ఎన్నో జన్మల పుణ్యఫలం.. అంటూ ఓ సినీ కవి చెప్పినట్లుగా సోదర, సోదరీమణుల మధ్య ఆత్మీయ అనుబంధానికి ప్రతీకగా నిర్వహించుకునే రక్షా బంధన్‌.. రాఖీ ఫౌర్ణమి పర్వాన్ని సోమవారం జిల్లా వ్యాప్తంగా ప్రజలు జరుపుకోనున్నారు. కరోనా మహమ్మారి ప్రభావం  ఈ సారి రాఖీ పర్వదినంపై స్పష్టంగా కనిపిస్తోంది. రాఖీ పర్వానికి రెండు వారాల ముందు నుంచే నగరంలోనే కాక గ్రామీణ ప్రాంతాలలోనూ ప్రత్యక్షమయ్యే రాఖీల దుకాణాలు నామ మాత్రంగానే వెలిశాయి. రాఖీ కొనుగోలుల సందడి నగరంలోని ప్రధాన వ్యాపార కూడళ్ళయిన చౌరస్తాలలో మాత్రమే ఆదివారం సాయంత్రం నుండి రాత్రి పొద్దుపోయే వరకు కనిపించింది.


దీనితోపాటు స్వీటు షాపులు కూడా కిటకిటలాడాయి. ఈ సారి రాఖీ పేరిట కొందరు తమ సోదరుని రక్షణ కోరుతూ మాస్క్‌లను బహూకరించనున్నారు. తిరిగివారి చెల్లెలి రక్షణ కోరుతూ శానిటైజర్లను బహుమతిగా అందించనున్నారు. ఈ సారి రాఖీలు కట్టేందుకు మహిళలు సుదూర ప్రాంతాలకు సైతం లెక్క చేయకుండా వెళ్ళే ప్రయాణాలను రద్దు చేసుకోవడం విశేషం. ముందస్తుగానే కొరియర్‌, పోస్టల్‌ శాఖ ద్వారా రాఖీలను పంపించుకున్నారు. రోజు రోజుకు తీవ్రమౌతూ వాడవాడలకు విస్తరించిన కరోనా భయం గుప్పిట ప్రాణాలను బిగపట్టకొని నామ మాత్రంగా రాఖీ పౌర్ణమి వేడుకలు జరుగనున్నాయి.


పవిత్రోత్సవం:

నగరంలోని ప్రసిద్ధ భద్రకాళీ ఆలయంలో ప్రతీ ఏటా శ్రావణ శుద్ధ పౌర్ణమి, రాఖీ పౌర్ణమి వేళ నిర్వహించే అమ్మవారి పవిత్రోత్సవాన్ని సోమవారం జరుపుకోనున్నారు. కోవిడ్‌ నిబంధనలననుసరించి భక్తులు లేకుండానే ఈ వేడుకలను అర్చకులు నిర్వహించనున్నారు. అమ్మవారికి విత్రలు (జంధ్యాలు)తో అలంకరించి పూజాదికాలు నిర్వహిస్తారు.

Updated Date - 2020-08-03T10:48:41+05:30 IST