నొప్పి తెలియదు

ABN , First Publish Date - 2020-10-16T10:51:46+05:30 IST

ఆధునిక వైద్య శాస్త్ర పురోగతిలో శస్త్రచికిత్స పద్ధతి కీలకం. అనస్థీషియా లేకుండా ఆపరేషన్లను ఊహించలేం. ఒకప్పుడు కొన్ని

నొప్పి తెలియదు

వైద్య శాస్త్ర పురోగమనంలో అనస్థీషియా 

నేడు అంతర్జాతీయ అనస్థీషియా డే


కర్నూలు(హాస్పిటల్‌), అక్టోబరు 15: ఆధునిక వైద్య శాస్త్ర పురోగతిలో శస్త్రచికిత్స పద్ధతి కీలకం. అనస్థీషియా లేకుండా ఆపరేషన్లను ఊహించలేం. ఒకప్పుడు కొన్ని ఆపరేషన్లు మాత్రమే జరిగేవి. ఇప్పుడు అలా కాదు. అనేక రకాల ప్రాణాంతక వ్యాధుల్లో, ప్రమాదాల్లో ఆపరేషన్‌ ద్వారా ప్రాణాలను కాపా డుతున్నారు. శస్త్ర చికిత్సల్లో రోగికి నొప్పి తెలియకుండా అనస్థీషియన్‌ల పాత్ర ఉన్నది. శుక్రవారం అంతర్జాతీయ అనస్థీషియన్స్‌ డే సందర్భంగా కథనం.. 1886లో అమెరికాలోని మిసాసూ జనరల్‌ ఆసుపత్రిలో డబ్లూ.జే.మోర్తాన్‌ అనే దంత వైద్యుడు తొలిసారిగా ఈదర్‌తో మత్తు ఇచ్చి శస్త్రచికిత్స విజయ వంతంగా నిర్వహించారు. ఇది వైద్య రంగంలో మైలురాయి. 1996 నుంచి అంతర్జాతీయ అనస్థీషియా డే నిర్వహించడం మొదలు పెట్టారు.  


అనస్థీషియా అంటే..?: అలోపతి వైద్యంలో అంతర్భాగంగా ఆపరేషన్‌లు ఉంటున్నాయి. ఆ సమయంలో రోగికి నొప్పితెలియకుండా ఉండేందుకు తాత్కాలికంగా అచేతన స్థితిలో తీసుకువెళ్లడాన్నే అనస్థీషియా అంటారు. ఆపరేషన్‌లో సర్జన్‌తో పాటు మత్తు వైద్యుల పాత్ర కూడా కీలకం. 

 

మత్తు మూడు రకాలు: లోకల్‌ అనస్థీషియా అంటే శరీరంలో ఏ భాగంలో శస్త్రచికిత్స చేస్తున్నారో అక్కడ మాత్రమే మందు ఇచ్చి నొప్పి లేకుండా చేయడం. రీజియనల్‌ అంటే కొంత ప్రాంతం శరీరాన్ని స్థంభింపజేయడం, జనరల్‌ అంటే శరీరం మొత్తానికి మత్తు ఇవ్వడం. మత్తు మందు ఇవ్వడానికి ప్రత్యేకంగా ఇప్పుడు లొమినాయర్‌ థియేటర్లు వచ్చాయి. దీనిలో రోగికి గంటకు సుమారు రూ.40 వేలు చొప్పున చార్జ్‌ వేశారు. సాధారణ పరిస్థితుల్లో గంటకు రూ.500 చొప్పున చార్జ్‌ వేశారు. 


ఏటా 35 వేల రోగులకు మత్తు మందు: కర్నూలు జీజీహెచ్‌లో రోజూ 50 నుంచి 60 మందికి ఆపరేషన్‌లు జరుగుతుంటాయి. ఇక ప్రతిరోజు 20 నుంచి 30 మందికి కాన్పులు నిర్వహిస్తుంటారు. వీటన్నంటిలోనూ అనస్థీషియా వైద్యులు మత్తు మందు ఇస్తుంటారు. 2016లో గుండె శస్త్రచికిత్సలు నిర్వహిస్తుండటం, అందులో కీహోల్‌, బైపాస్‌ సర్జరీలు చేయడంలో మత్తు వైద్యులు కీలకపాత్ర పోషిస్తున్నారు. రోగుల ఆపరేషన్‌కు వైద్యులు మత్తుమందు అందిస్తున్నారు. కర్నూలు జీజీహెచ్‌ అనస్థీషియా విభాగంలో డా.రఘురాం హెచ్‌వోడీగా, ప్రొఫెసర్లుగా డా. సూర్యనారాయణ, డా.పుల్లారెడ్డి, అసోసియేట్‌ ప్రొఫెసర్లుగా రామశివనాయక్‌, సుధీర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు 16 మంది, పీజీలు 34 మంది ఉన్నారు. 


నామమాత్రంగా వైద్యుల సంఖ్య: అనస్థీషియా విభాగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. అనేక ఆసుపత్రులు పెరిగాయి. జిల్లాలో కర్నూలు మెడికల్‌ కాలేజ్‌, శాంతిరాం మెడికల్‌ కాలేజ్‌, విశ్వభారతి మెడికల్‌ కాలేజ్‌లతో పాటు దాదాపు 150 ప్రైవేటు ఆసుపత్రులు ఉన్నాయి. ప్రతిరోజు లెక్కకు మించి శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం లక్ష మందికి ఐదుగురు అనస్థీషియన్లు కావాలి. కాని మన దేశంలో పది లక్షల మందికి ముగ్గురు మత్తు మందు వైద్యులు మాత్రమే ఉన్నాయి. జిల్లాలో దాదాపు 100 మంది అనస్థీషియన్లు పని చేస్తున్నారు.

Updated Date - 2020-10-16T10:51:46+05:30 IST