నేడు గణేశ్‌ నిమజ్జనోత్సవం

ABN , First Publish Date - 2021-09-18T05:58:12+05:30 IST

నగరంలో వినాయక నిమజ్జనోత్సవం శనివారం జరగనుంది. అధికారులు, గణేశ్‌ మహోత్సవ కేంద్ర సమితి ప్రతినిధులు ఏర్పాట్లు చేశారు.

నేడు గణేశ్‌ నిమజ్జనోత్సవం

  1. కేసీ కెనాల్‌ ఘాట్‌ వద్ద ఏర్పాట్లు 


కర్నూలు(కల్చరల్‌), సెప్టెంబరు 17: నగరంలో వినాయక నిమజ్జనోత్సవం శనివారం జరగనుంది. అధికారులు, గణేశ్‌ మహోత్సవ కేంద్ర సమితి ప్రతినిధులు ఏర్పాట్లు చేశారు. కేసీ కెనాల్‌ వినాయక ఘాట్‌ వద్ద నిమజ్జనం జరగనుంది. ఈ ఏడాది ఉదయం 9 గంటలకే ఊరేగింపు, మధ్యాహ్నం 11 గంటలకు నిమజ్జనం ప్రారంభమవుతుంది. శనివారం ఉదయం 9 గంటలకు పాతనగరంలోని రాంభొట్ల దేవాలయం వద్ద తొలి పూజలతో నిమజ్జనోత్సవం ఆరంభిస్తారు. భాగ్యనగర్‌ గణేశ్‌ మహోత్సవ సమితి గౌరవాధ్యక్షుడు జి. రాఘవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారు. మేయర్‌ బీవై రామయ్య, ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ ఊరేగింపును ప్రారంభిస్తారు. పాత నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి గణనాథుడి ప్రతిమలు పాత బస్టాండు మీదుగా కోట్ల సర్కిల్‌, కిడ్స్‌ వరల్డ్‌, రాజ్‌ విహార్‌, కలెక్టరేట్‌ మీదుగా కేసీ కెనాల్‌ వినాయక ఘాట్‌కు చేరుకుంటాయి. జిల్లా యంత్రాంగం వినాయక ఘాట్‌ వద్ద గణేశ్‌ ప్రతిమల నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. నగర పాలక సంస్థ అధికారులు మూడు క్రేన్లు ఏర్పాటు చేశారు. నిమజ్జనం కోసం ఘాట్‌ వద్ద ఆరు ప్రాంతాలను గుర్తించారు. రద్దీ పెరిగితే చేతుల మీదుగా విగ్రహాలను నిమజ్జనం చేసేలా ఏర్పాట్లు చేశామని గణేశ్‌ మహోత్సవ కేంద్ర సమితి ప్రతినిధులు కె.క్రిష్టన్న, సందడి సుధాకర్‌, రంగస్వామి, కాళింగి నరసింహ వర్మ తెలిపారు.

Updated Date - 2021-09-18T05:58:12+05:30 IST