నేడు భోగి సంబరాలు

ABN , First Publish Date - 2022-01-14T05:29:13+05:30 IST

తెలుగింట సంతోషంగా జరుపుకునే సంక్రాంతి మానవ సంబంధాలను పెనవేస్తుంది. శుక్రవారం భోగి, శనివారం సంక్రాంతి, ఆదివారం కనుమ వేడుకగా నిర్వహించనున్నారు. పల్లెసీమల్లో పంట దిగుబడులు ఇల్లు చేరి.. కొంగొత్త ఆశలతో రాబోయే వ్యవసాయ కాలానికి ఆహ్వానం పలుకుతూ.. ఎక్కడున్న వారంతా జన్మస్థలానికి చేరుకొని సందడిగా జరుపుకునే పండుగ సంక్రాంతి.

నేడు భోగి సంబరాలు
పోలీసు పరేడ్‌ మైదానంలో గురువారం రాత్రి బోగి మంట వేస్తున్న ఎస్పీ

పాత వాటికి స్వస్తి.. కొత్తదనానికి ఆహ్వానం

కడప, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): తెలుగింట సంతోషంగా జరుపుకునే సంక్రాంతి మానవ సంబంధాలను పెనవేస్తుంది. శుక్రవారం భోగి, శనివారం సంక్రాంతి, ఆదివారం కనుమ వేడుకగా నిర్వహించనున్నారు. పల్లెసీమల్లో పంట దిగుబడులు ఇల్లు చేరి.. కొంగొత్త ఆశలతో రాబోయే వ్యవసాయ కాలానికి ఆహ్వానం పలుకుతూ.. ఎక్కడున్న వారంతా జన్మస్థలానికి చేరుకొని సందడిగా జరుపుకునే పండుగ సంక్రాంతి. అతివృష్టితో కడప గడపన గ్రామీణులు ఆర్థికంగా చితికిపోయారు. నిత్యావసర సరుకుల ధరలు చుక్కలు తాకాయి. అయినా.. ఉన్నదాంట్లో పండుగను ఆనందంగా జరుపుకోవడానికి పల్లెజనం సన్నద్ధమయ్యారు.

సంక్రాంతి వేడుకల్లో తొలి వేడుక భోగి. ఇళ్లలో పనికిరాని వస్తువులు, పాత వ్యవసాయ పనిముట్లు భోగి మంటల్లో వేసి కాలుస్తారు. ఆ మంటలు చల్లారాక బూడిదను చిన్నపిల్లల నుదుట రాసి దిష్టితీసి స్నానాలు చేయిస్తారు. ఏడాదిలో ఉత్తరాయణం, దక్షిణాయణం కాలాలు ఉంటాయి. దక్షిణాయణ కాలంలో పడిన కష్టాలు, బాధలు భోగి మంటల రూపంలో అగ్నిదేవునికి సమర్పించి.. రాబోయే ఉత్తరాయణంలో సంతోషాలు, ఆనందాలను ప్రసాదించాలని కోరుకోవడమే ఈ పండుగ పరమార్థం. దక్షిణాయణ కాలం చివరి రోజున భోగి నిర్వహిస్తారు. సూర్యోదయానికి ముందే నిద్రలేచి భోగి మంటలు వేస్తారు. ఇంట్లో పాత సామాగ్రిని, పాత ఆలోచనలను మంటల్లో వేసి కొత్తదనానికి ఆహ్వానం పలకాలనేది భోగి పరమార్థమని పండితులు పేర్కొంటున్నారు. దక్షిణాయనం నుంచి ఉత్త ్తరాయణం ప్రారంభం అవుతుండటంతో కాలానుగుణంగా వచ్చే మార్పులను సిద్ధం అవ్వాలని కూడా భోగి ద్వారా తెలియజేస్తారు.

భోగి పళ్లు : భోగి వేడకల్లో పిల్లల తలపై భోగి పళ్లు (రేగిపళ్లు) పోసి దిష్టితీయడం సంప్రదాయంగా భావిస్తారు. పిల్లలకు కొత్త బట్టలువేసి, తలపై రేగు పండ్లు, శనగలు, పూలు, చెరకుగడలు కలిపి పోస్తారు. వారికి సూర్య భగవానుడి అనుగ్రహం కలగాలని భోగిపళ్ల వేడుక నిర్వహిస్తారు.

Updated Date - 2022-01-14T05:29:13+05:30 IST