Abn logo
Sep 27 2021 @ 00:47AM

నేటి బంద్‌కు అన్ని పార్టీలు, వర్గాల మద్దతు

బంద్‌ విజయంతానికి తిరుపతిలో నిర్వహిస్తున్న బైకు ర్యాలీ

మధ్యాహ్నం ఒంటి గంట తర్వాతే రోడ్లపైకి బస్సులు 


సెలవు ప్రకటించిన ప్రైవేటు విద్యా సంస్థలు


యథావిధిగా ప్రభుత్వ కార్యాలయాలు


చిత్తూరు, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందంటూ సోమవారం తలపెట్టిన భారత్‌ బంద్‌కు జిల్లాలోని అన్ని ప్రధాన రాజకీయ, కమ్యూనిస్టు పార్టీలు, ప్రజా, కార్మిక సంఘాల నాయకులు మద్దతు ప్రకటించారు. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీలు బంద్‌కు సంపూర్ణ మద్దతిస్తున్నట్లు ప్రకటించగా.. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచీ ఆయా స్థానిక సంఘాలూ మద్దతుకు పిలుపునిచ్చాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కవని, ఆ తర్వాత యథావిధిగా తిరుగుతాయని బస్సులు తిరుగుతాయని ఇప్పటికే ఆ శాఖ మంత్రి పేర్ని నాని ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలలు పని చేస్తాయా.. లేదా.. అనే అంశంపై ప్రభుత్వం ప్రకటన ఇవ్వకపోయినా.. ప్రైవేటు విద్యాసంస్థలను మాత్రం బంద్‌కు మద్దతుగా మూసేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా పనిచేయనున్నాయి. సోమవారం కలెక్టరేట్‌లో జరిగే స్పందన కార్యక్రమం రద్దు కాకుండా నిర్వహిస్తున్నట్లు డీఆర్వో మురళి తెలిపారు. సోమవారం బీసీ కమిషన్‌ తిరుపతిలో పర్యటించనున్న నేపథ్యంలో వారితో పాటు కలెక్టర్‌ ఉంటారు. మిగిలిన అధికారులు చిత్తూరులో స్పందన నిర్వహిస్తారు. సోమవారంనాటి బంద్‌కు మద్దతు ఇస్తున్నట్లు, విజయవంతం చేయాలని జిల్లావ్యాప్తంగా ఆయా వర్గాల నేతలు ఆదివారమే సమావేశాన్ని నిర్వహించుకున్నారు. జిల్లా చాంబర్‌ ఆఫ్‌ జాగిరి, గ్రానైట్‌, జ్యూస్‌ తదితర.. లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ వారు చిత్తూరులో.. ఆటో యూనియన్‌ నాయకులు తిరుపతిలో బంద్‌కు మద్దతు ప్రకటించారు. బంద్‌ విజయవంతానికి పలుచోట్ల ఆయా పార్టీలు, ప్రజాసంఘాల నేతలు ఆదివారం బైకు ర్యాలీలు నిర్వహించారు. 

తిరుమలకు మినహాయింపు


తిరుపతి(కొర్లగుంట), సెప్టెంబరు 26: భారత్‌బంద్‌ నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు ఆర్టీసీ సర్వీసులు డిపోలకే పరిమితం కానున్నాయి. ఒంటి గంట తర్వాత రోడ్లపైకి రానున్నాయి. ప్రయాణికులు సైతం బంద్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రయాణాన్ని వాయిదావేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. బస్టాండు, గ్యారేజీల భద్రత దృష్ట్యా అదనపు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా.. తిరుమలకు మాత్రం మినహాయింపు ఇచ్చినట్లు తిరుపతి సెంట్రల్‌ బస్‌స్టేషన్‌ అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ విశ్వనాథ్‌ తెలిపారు. తిరుమల, అలిపిరి, తిరుపతి, మంగళం డిపోల నుంచి 120 బస్సులు ఘాట్లలో యథావిధిగా రాకపోకలు సాగిస్తాయి. తిరుపతికి వచ్చిన భక్తులు కొండకు వెళ్లడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. తిరుమల నుంచి తిరుపతి బస్టాండు వరకు బస్సుల రాకపోకలు ఉంటాయి. ఒకవేళ ఆందోళకారులు అడ్డుకుంటే అలిపిరి బస్టాండు వరకే బస్సుల రాకపోకలను పరిమితం చేయనున్నారు. 

ఏపీపీజీఈ సెట్‌ వాయిదా


తిరుపతి (విశ్వవిద్యాలయాలు), సెప్టెంబరు 26: బంద్‌ కారణంగా ఏపీపీజీఈ సెట్‌-2021 వాయిదా పడింది. సోమవారం చేపట్టాల్సిన ఇంజనీరింగ్‌, ఫార్మసీ, కంప్యూటర్‌ సైన్స్‌ పరీక్షలు వాయిదా వేసినట్టు కన్వీనర్‌ సత్యనారాయణ తెలిపారు. ఈ పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది త్వరలో తెలియజేస్తామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.