రెండు కేంద్రాల్లో నిలిచిన వేలం

ABN , First Publish Date - 2021-04-21T06:27:57+05:30 IST

దక్షిణాది పొగాకు మార్కెట్లో రైతుల ఆందోళనలు ప్రారంభమయ్యాయి.

రెండు కేంద్రాల్లో నిలిచిన వేలం
ఒంగోలు ఆర్‌ఎం ఆఫీసులో ఇరువురు ఆర్‌ఎంలతో సమావేశమైన రైతు ప్రతినిధులు

ధరలు దిగజారడంపై పొగాకు రైతుల ఆగ్రహం

ఇరువురు ఆర్‌ఎంల తో రైతు ప్రతినిధుల భేటీ

నిరవధికంగా వేలం నిలిపివేతకు డిమాండ్‌ 

భారీగానే బేళ్ల తిరస్కరణలు

ఒంగోలు, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి) : దక్షిణాది పొగాకు మార్కెట్లో రైతుల ఆందోళనలు ప్రారంభమయ్యాయి. రోజువారీ దిగజారుతున్న ధరలు, వ్యాపారుల వైఖరి, పొగాకు బోర్డుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న రైతులు గత పదిరోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఏకంగా ఒంగోలు-2, డీసీపల్లి కేంద్రాల్లో వేలాన్ని నిలిపివేశారు. సాయంత్రం అందుబాటులో ఉన్న ఆయా  కేంద్రాల రైతు ప్రతినిధులంతా ఒంగోలు చేరుకొని ఇక్కడి పొగాకు బోర్డు ప్రాంతీయ కార్యాలయంలో రెండు రీజియన్ల ఆర్‌ఎంలతో భేటీ అయ్యారు.  వివరాల్లోకి వెళితే.. గతనెల 15న దక్షిణాదిలోని 11 కేంద్రాల్లో పొగాకు వేలం ప్రారంభమైంది. తొలుత రెండు వారాలు బాగానే సాగిన అనంతరం మార్కెట్‌ మందగించింది. విదేశీ ఆర్డర్లు ఖరారు కాలేదంటూ ఎక్స్‌పోర్టు కంపెనీలు కొనుగోళ్లను తగ్గించివేయగా, ప్రధాన కంపెనీ అయిన ఐటీసీ అధికశాతం కొంటున్నా సరైన ధరలు ఇవ్వడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. వారం, పదిరోజులుగా ఎక్కువ బేళ్ల ధర కిలో రూ.150 కూడా ఉండటం లేదు. దాంతో సగటు ధర తగ్గిపోతోంది. దక్షిణాదిలో ఇప్పటి వరకు 12.75 మిలియన్‌ కిలోల వరకూ కొనుగోళ్లు చేపట్టగా సగటున కిలోకు రూ.165 వరకు ధర లభించింది. అది గతనెలాఖరులో రూ.175 ఉంది. ఈ 20 రోజుల్లో రూ.10 వరకూ తగ్గింది. మీడియం గ్రేడ్ల ధరలు మరింత తక్కువగా ఉన్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. 


వేలం నిలిపివేత

ఈక్రమంలో మంగళవారం ఒంగోలు-2, డీసీపల్లిలో రైతులు వేలాన్ని నిలిపేశారు. ఒంగోలు-2లో కరవది క్లస్టర్‌కు చెందిన 460 బేళ్లు వేలానికి ఉంచగా 149 బేళ్ల వేలం అనంతరం 83 మాత్రమే వ్యాపారులు కొనుగోలు చేశారు. దీంతో ఆగ్రహించిన రైతులు కొనుగోళ్లను నిలిపేశారు. అలాగే డీసీపల్లిలో 265 బేళ్ల కొనుగోలు అనంతరం వ్యాపారులు ఇచ్చిన ధరలు సరిపోవంటూ రైతులు బేళ్లు ఇచ్చేందుకు నిరాకరించారు. అక్కడ వేలం ఆగింది. ఇతర పలు కేంద్రాల్లో కూడా మంగళవారం తిరస్కరణ బేళ్ల సంఖ్య అధికంగానే ఉంది. ఎస్‌బీఎస్‌ రీజియన్‌లో 21.32శాతం తిరస్కరణలు ఉండగా ఎస్‌ఎల్‌ఎస్‌ రీజియన్‌లో 27.32శాతం జరిగాయి. సాయంత్రానికి వివిధ వేలంకేంద్రాలకు చెందిన రైతు ప్రతినిధులంతా ఒంగోలులో బోర్డు ప్రాంతీయ కార్యాలయానికి చేరారు. ఎస్‌బీఎస్‌ ఆర్‌ఎం శ్రీనివాసులునాయుడు, ఎస్‌ఎల్‌ఎస్‌ ఆర్‌ఎం వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. వేలం జరుగుతున్న తీరు, బోర్డు ఉదాసీనతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 


 నిరవధిక వాయిదా వేయండి

విదేశీ ఆర్డర్లు ఖరారు కాకపోవడమే మార్కెట్లో ఈ పరిస్థితికి కారణమైతే ఆర్డర్లు వచ్చేంతవరకు వేలాన్ని నిరవధికంగా వాయిదా వేయాలని రైతుప్రతినిధులు డిమాండ్‌ చేశారు. లేకపోతే తీవ్రంగా నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై రైతుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్న అధికారుల సూచనపై స్పందిస్తూ శనివారం అన్ని వేలం కేంద్రాల్లో రైతులతో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. అనంతరం వచ్చే సోమవారం నుంచి వేలం నిలిపేస్తామని స్పష్టం చేశారు. రైతు ప్రతినిధుల డిమాండ్‌ను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఈ సందర్భంగా ఆర్‌ఎంలు హామీ  ఇచ్చారు. రైతు ప్రతినిధులు బద్రిరెడ్డి, వడ్డెళ్ళ ప్రసాద్‌, మారెడ్డి సుబ్బారెడ్డి, మన్నె శ్రీనివాసరావు, ఆళ్ళ సుబ్బారావు, నాగినేని భాస్కరరావు, కొత్తపల్లి వెంకటేశ్వర్లు, చెంచురామయ్య తదితరులు ఉన్నారు. 

Updated Date - 2021-04-21T06:27:57+05:30 IST