యాసంగికి రూ. 575 కోట్లు

ABN , First Publish Date - 2020-11-28T05:11:19+05:30 IST

జిల్లాలోని జలవనరులన్నీ సమృద్ధిగా ఉండడంతో రైతులు యాసంగి సాగుకు ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. ఇందుకోస యాసంగిలో లక్ష్యం మేరకు రైతులకు రుణాలు ఇవ్వాలని కలెక్టర్‌ శశాంక బ్యాంకర్లకు సూచించారు.

యాసంగికి రూ. 575 కోట్లు

 రైతు రుణ లక్ష్యం సాధించాలి

 బ్యాంకర్లను ఆదేశించిన కలెక్టర్‌ 

 60,345 మందికి అందనున్న రుణాలు 

 ఇప్పటికే పంట రుణం పొందిన 9,101 మంది రైతులు 

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

జిల్లాలోని జలవనరులన్నీ సమృద్ధిగా ఉండడంతో రైతులు యాసంగి సాగుకు ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. ఇందుకోస యాసంగిలో లక్ష్యం మేరకు రైతులకు రుణాలు ఇవ్వాలని కలెక్టర్‌ శశాంక బ్యాంకర్లకు సూచించారు. వివిధ పంటలకు ఎకరాకు ఎంత రుణం అవసరమవుతుందో అంచనా వేసిన బ్యాంకర్ల కమిటీ రుణ పరిమితులను ఇప్పటికే నిర్దేశించింది. ఒక్కో పంటకు రుణ పరిమితి మేరకు పంట రుణాలు ఇస్తారు. వానాకాలం, యాసంగి కోసం జిల్లా రుణ ప్రణాళికలో 1,438 కోట్ల 54 లక్షల రూపాయల పంట రుణాలు అందించాలని లక్ష్యంగా నిర్దేఽశించుకున్నారు. ఇందులో 90,517 మంది రైతులకు వానాకాలంలో 863 కోట్ల 12 లక్షలు, యాసంగిలో 60,345 మంది రైతులకు 575 కోట్ల 42 లక్షల రూపాయలు పంట రుణాలు సమకూర్చాలని నిర్ణయించారు. వానాకాలంలో సుమారు 96శాతం లక్ష్యాన్ని సాధించారు. ఈ సీజన్‌లో 90 లక్షల 5వేల 015 మందికి రుణమందించే లక్ష్యానికిగాను 71,605 మందికి 827 కోట్ల 70 లక్షల పంట రుణాలను అందించారు. యాసంగిలో 575 కోట్ల 42 లక్షల రూపాయల పంట రుణాలను అందించాలని భావించి ఇందుకోసం బ్యాంకుల వారీగా ప్రణాళిక సిద్ధం చేశారు. 11 పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకుల ద్వారా 27,171 మంది రైతులకు 242 కోట్ల 51 లక్షలు, 12 ప్రైవేట్‌ సెక్టార్‌ బ్యాంకుల ద్వారా 10,020 మంది రైతులకు 101 కోట్ల 80 లక్షలు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ద్వారా 12వేల 375 మంది రైతులకు 114 కోట్ల 73 లక్షలు, తెలంగాణ గ్రామీణ బ్యాంకు ద్వారా 10,779 మంది రైతులకు 116 కోట్ల 38 లక్షలు పంట రుణాలుగా ఇవ్వాలని జిల్లా రుణ ప్రణాళికలో లక్ష్యంగా పెట్టుకున్నారు. వర్షాకాలం పంట కోతలు ఇప్పటికే 70శాతం వరకు పూర్తికాగా నార్లు పోస్తున్నారు. వరి కోతలు పూర్తయిన తర్వాత డిసెంబర్‌ రెండవ వారంలో రైతులందరూ నారు మళ్లు పోసుకొని జనవరి నాటి కల్లా యాసంగి నాట్లకు సిద్ధమవుతారు. ఆలోగానే పంట రుణాలు పొంది ఎరువులు, క్రిమి సంహారక మందులను కొనుగోలు చేసి అందుబాటులో ఉంచుకుంటారు. అలాగే అవసరమైన విత్తనాలను కూడా సమకూర్చుకుంటారు. ఇందుకోసం రైతులు ఒక వైపు పంట రుణాల కోసం ప్రయత్నాలు చేస్తూ మరోవైపు వానాకాలం పంటను అమ్ముకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా వివిధ బ్యాంకులు 9,101 మంది రైతులకు 28 కోట్ల 58 లక్షల రూపాయల పంట రుణాలను అందించాయి. జిల్లా రబీ రుణ లక్ష్యంలో 5శాతం పూర్తికాగా వచ్చే జనవరి చివరి వరకు యాసంగి పంట రుణం పొందేందుకు అవకాశమున్నది. గత సంవత్సరం రుణ ప్రణాళికలో నిర్దేశించుకున్న లక్ష్యంలో కేవలం 65శాతం రుణాలు మాత్రమే రైతులకు అందాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని 1,04,043 మంది రైతులకు 15,048 కోట్ల 88 లక్షల రూపాయలను పంట రుణాలుగా అందించాలని ప్రణాళిక రూపొందించారు. అయితే రైతులకు కేవలం 1,010 కోట్ల 43 లక్షల రూపాయలను మాత్రమే రుణాలుగా అందించారు. గత వర్షాకాలం కేవలం 65.31శాతం పంట రుణాలను మాత్రమే ఇవ్వగా యాసంగిలో ఆ పరిస్థితి కొంత మెరుగుపడి 82శాతం మందికి రుణాలు అందాయి. ఈ సంవత్సరం అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూసేందుకు జిల్లా కలెక్టర్‌ శశాంక ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తుండడంతో వర్షాకాలం 96శాతం రుణ లక్ష్యం సాధించగలిగారు. 863 కోట్ల 12లక్షల పంట రుణాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకోగా 827 కోట్ల 70 లక్షల రూపాయలను రైతులకు రుణంగా ఇచ్చారు. యాసంగిలో కూడా అదే విధంగా లక్ష్యాన్ని సాధించాలని, నిర్దేశించుకున్న మేరకు రైతులందరికీ రుణాలు అందించాలని బ్యాంకర్ల సమావేశంలో కలెక్టర్‌ సూచించారు.  

పెరుగనునున్న యాసంగి సాగు

జిల్లా వ్యవసాయశాఖ 2 లక్షల 89 వేల 279 ఎకరాల్లో యాసంగి పంటలను సాగు చేస్తారని అంచనా వేసి సాగు ప్రణాళిక సిద్ధం చేసినా అది 3 లక్షలకుపైగా పెరుగనున్నదని భావిస్తున్నారు. ఒక్క వరిసాగే 3 లక్షల పైచిలుకు ఉంటుందని అంచనా వేస్తున్న నేపథ్యంలో ఇతర పంటలు, మరో 12 వేల ఎకరాల్లో  సాగయ్యే అవకాశమున్నది. జిల్లా వ్యవసాయశాఖ రూపొందించిన యాసంగి సాగు ప్రణాళిక మేరకు జిల్లాలో 2, 81,896 ఎకరాల్లో వరి, 3వేల ఎకరాల్లో వేరుశనగ, 2,454 ఎకరాల్లో కూరగాయలు, 1046 ఎకరాల్లో పప్పుధాన్యాలు సాగు చేస్తారు. అలాగే 300 ఎకరాల్లో పొద్దు తిరుగుడు, 120 ఎకరాల్లో పండ్ల తోటలు, 230 ఎకరాల్లో పొగాకు, 182 ఎకరాల్లో నువ్వులు, 50 ఎకరాల్లో అలసంద సాగు చేస్తారని వ్యవసాయశాఖ అంచనా వే సింది.         

Updated Date - 2020-11-28T05:11:19+05:30 IST