ఎ‘వరి’కి చెప్పుకోవాలి?

ABN , First Publish Date - 2022-04-09T06:47:50+05:30 IST

ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఇంకా పీటముడి వీడటంలేదు.

ఎ‘వరి’కి చెప్పుకోవాలి?

  • ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత లేక రైతుల్లో కలవరం
  • మిల్లరు నిర్ణయించిన ధరకు 
  • ధాన్యం అమ్ముకుంటున్న అన్నదాత
  • కనీస మద్దతు ధర కూడా దక్కని వైనం
  • ఇప్పటివరకు 3 లక్షల టన్నులు కొన్న రైస్‌మిల్లర్లు
  • క్వింటాకు రూ. 1,450 నుంచి రూ. 1,500 ధర
  • తక్కువ ధరకు కొని రా రైస్‌ అమ్ముతున్న మిల్లర్లు


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఇంకా పీటముడి వీడటం లేదు. ధాన్యాన్ని సేకరిస్తారా? లేదా ? అనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తేల్చడం లేదు. ఢిల్లీ ధర్నా తర్వాత, క్యాబినేట్‌ సమావేశం నిర్వహించి ధాన్యం కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సంకేతాలైతే వెలువడుతున్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రావడం లేదు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులు తక్కువ ధరకు ధాన్యాన్ని తెగనమ్ముకుంటున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు అందుబాటులో లేకపోవడంతో రైస్‌ మిల్లర్లు నిర్ణయించిన ధరకు ధాన్యాన్ని విక్రయించి నష్టపోతున్నారు.


ఎమ్మెస్పీ క్వింటాలుకు రూ.1,940 నుంచి రూ. 1,960 ఉండగా... మిల్లర్లు రూ.1,450 నుంచి రూ.1,500 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3 లక్షల టన్నుల ధాన్యాన్ని రైస్‌ మిల్లర్లు కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. అంతేకాకుండా తేమ ఎక్కువుందని, నూకలు ఎక్కువవుతాయని క్వింటాకు 5 కిలోల వరకు తరుగు తీస్తున్నారు. ప్రభుత్వం ఎలాంటి అభయం ఇవ్వకపోవడంతోనే గత్యంతరం లేని రైతులు ఇలా నష్టపోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, బాయిల్డ్‌ రైస్‌ తీసుకునేది లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతూనే ఉంది. ఏ రాష్ట్రానికి అదనపు కోటా అవకాశం ఇవ్వకపోగా... ఒక్క తెలంగాణ వరకే నిరుడు 20 లక్షల టన్నులకు అదనంగా అలాట్మెంట్‌ ఇచ్చింది.


ఈ యాసంగి సీజన్‌లో మాత్రం ఎలాంటి వెసులుబాటు కల్పించలేదు. ముడి బియ్యం ఇస్తే తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. కానీ ముడి బియ్యం ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం సుముఖంగా లేదు. అంతేకాక ఇంతవరకు ఎఫ్‌సీఐకి ఎలాంటి ప్రతిపాదనలు పంపించకపోగా చర్చలు జరిపే ప్రయత్నం కూడా చెయ్యలేదు. రాష్ట్రంలో ఎంత ధాన్యం ఉత్పత్తి అవుతుంది? రా రైస్‌ ఎంత ఇస్తారు? ఎన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తారు? గన్నీ బ్యాగులు ఎన్ని అవసరం? ఇలాంటి ప్రశ్నలతో కూడిన ఐదు పేజీల ప్రొఫార్మాను ఎఫ్‌సీఐ... గత ఫిబ్రవరి నెలలోనే రాష్ట్రానికి పంపించింది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఆ ప్రొఫార్మాను నింపలేదు. దానికితోడు ముడి బియ్యం తీసుకునేందుకు ఎఫ్‌సీఐ సిద్ధంగా ఉన్నప్పటికీ... ఎంత వీలైతే అంత ఇవ్వాలనే ఆలోచన కూడా రాష్ట్ర సర్కారు చేయకపోవడం గమనార్హం.


మరోపక్క, ఎఫ్‌సీఐ హైదరాబాద్‌ ప్రాంతీయ కార్యాలయం అధికారులు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమైనా ప్రతిపాదనలు వస్తే... కేంద్ర కార్యాలయానికి పంపించి క్లియరెన్స్‌ తీసుకుందామని ఎదురుచూస్తున్నారు. ఇక ధాన్యం ప్రొక్యూర్మెంట్‌కు నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరించే తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ప్రేక్షక పాత్ర పోషిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి క్లియరెన్స్‌ లేకపోవడమే ఇందుకు కారణం. కొనుగోళ్లపై స్పష్టత లేకపోవడంతో అగ్రిమెంట్‌ చేసుకున్నా గన్నీ బ్యాగులు ప్రొక్యూర్మెంట్‌ చేయకుండా పెండింగ్‌ పెట్టారు. ప్యాడీ క్లీనర్లు, తేమ యంత్రాలు(మాయిశ్చర్‌ మీటర్లు), కాంటాలు... పాతవి ఉన్నప్పటికీ కొన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ పనులన్నీ పెండింగ్‌లో ఉన్నాయి. మరోవైపు ప్రభుత్వం ప్రొక్యూర్మెంట్‌ చేయడం లేదనే కారణంతో ధరల అంశాన్ని అధికారులెవరూ పట్టించుకోవడంలేదు. 



రా రైస్‌ ఉత్పత్తి చేస్తున్న మిల్లర్లు

ఎఫ్‌సీఐకి ముడి బియ్యం ఇవ్వాలంటే ..గింజలు విరిగిపోతాయని, సగానికి సగం నూకలు అవుతాయని, 67 శాతం బియ్యమూ ఇవ్వలేమని చేతులెత్తేస్తున్న రైస్‌ మిల్లర్లు... ఇప్పుడు రారైస్‌ ఉత్పత్తి చేస్తున్నారు. సన్నరకాల వరి తొందరగా కోతకు వస్తుంది. పంటకాలమూ తక్కువ. ప్రస్తుతం కోతలు జరుగుతున్న ఐదు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల్లోపే నమోదవుతున్నాయి. దీంతో ధాన్యాన్ని బాయిల్డ్‌ చేసి మిల్లింగ్‌ చేయాల్సిన అవసరం రావడం లేదు. అందుకే రా రైస్‌ ఉత్పత్తి చేస్తున్నారు. తెలంగాణతోపాటు ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటకల్లో డిమాండ్‌ ఉండడంతో మిల్లర్లు రా రైస్‌ వ్యాపారం చేస్తున్నారు. ధర్మాబాద్‌ (మహారాష్ట్ర), తుమకూరు (కర్ణాటక) ప్రాంతాల వ్యాపారులు నిజామాబాద్‌ జిల్లాలో 20వేల టన్నుల ధాన్యం కొన్నారని మిల్లర్లు తెలిపారు.




అభయమిస్తే రైతులు ఆగేవారే!

ధాన్యం కొనుగోలు అంశంలో రైతులకు ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అభయం లేదు. ఏదైనా స్పష్టమైన ప్రకటన వెలువడితే... కొద్ది రోజులు ఆలస్యమైనా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేవరకు ఎదురుచూసేవారు. ప్రభుత్వ సెంటర్లలో అమ్మితే రైతులకు ఎమ్మెస్పీ దక్కేది. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత లేకపోవటంతో... రైతులు తక్కువ ధరకైనా ధాన్యం అమ్మేస్తున్నారు. ఢిల్లీఽలో ధర్నాచేసి, ఆ తర్వాత కేబినేట్‌ మీటింగ్‌ ఏర్పాటుచేసి... నిర్ణయాన్ని ప్రకటించే వరకు మరో వారం రోజులు పడుతుంది. దాంతో ఏప్రిల్‌లో తొలి పక్షం పూర్తవుతుంది. అప్పటికి మరో 2 లక్షల టన్నుల ధాన్యాన్ని మిల్లర్లు కొనేస్తారు. ఇప్పటికే కొన్న 3 లక్షల టన్నులతో కలిపితే 5 లక్షల టన్నులు అవుతుంది. ఎమ్మెస్పీతో పోలిస్తే క్వింటాలుకు రూ.460 చొప్పున రైతులు నష్టపోతున్నారు. ఈ లెక్కన రైతులు ఇప్పటికే రూ.230 కోట్లు నష్టపోయారంటే అతిశయోక్తికాదు.


Updated Date - 2022-04-09T06:47:50+05:30 IST