కత్తిసాముతో ఒలింపిక్స్‌కు..

ABN , First Publish Date - 2021-07-24T08:51:40+05:30 IST

ఒలింపిక్స్‌లో కత్తిసాము విభాగంలో భారతదేశం ఎట్టకేలకు అర్హత సాధించింది.

కత్తిసాముతో ఒలింపిక్స్‌కు..

ఒలింపిక్స్‌లో కత్తిసాము విభాగంలో భారతదేశం ఎట్టకేలకు అర్హత సాధించింది. చెన్నైకి చెందిన చదలవాడ ఆనంద సుందరరామన్‌ భవానీ దేవి టోక్యోలో జరిగే ఒలింపిక్స్‌ ఫెన్సింగ్‌ మహిళల విభాగంలో పోటీ పడనుంది. ఆమె 17 ఏళ్ల సేబర్‌ ఫెన్సింగ్‌ క్రీడా ప్రయాణం సాగిందిలా...


సంవత్సరం 2004. ప్రదేశం... చెన్నైలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియం. 11 ఏళ్ల పాప తల్లి చేయి పట్టుకుని భయం భయంగా ఆ స్టేడియంలోకి అడుగుపెట్టింది. తొండియర్‌పేటలోని మురుగ ధనుష్కోడి గర్ల్స్‌ హయ్యర్‌ సెకండరీ స్కూల్‌లో కొత్తగా చేరిన ఆ పాపకు, స్కూల్‌ గేమ్స్‌లో భాగంగా అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత ప్రవేశపెట్టిన ‘ఫెన్సింగ్‌’ అనే ఆట పరిచయమైంది. బళ్లో ఆ ఆటను నేర్చుకుంటున్న 40 మంది ఆడపిల్లల బృందంలో తానూ ఒకతి. అయితే ఐదేళ్లలోపే ఆ బృందంలోని అమ్మాయిలందరూ ఒక్కొక్కరుగా క్రీడ నుంచి తప్పుకున్నా, ఆ 11 ఏళ్ల పాప మాత్రం క్రీడలో కొనసాగి, పోటీల్లో పాల్గొనే స్థాయికి ఎదిగింది. సరిగ్గా 17 ఏళ్ల తర్వాత అదే అమ్మాయి టోక్యోలో జరగబోయే 2021 ఒలింపిక్స్‌ ఫెన్సింగ్‌ మహిళల విభాగంలో పోటీకి అర్హత సాధించి చరిత్ర సృష్టించింది. ఫెన్సింగ్‌ క్రీడలో ప్రపంచవ్యాప్తంగా 36వ ర్యాంకునూ, భారతదేశంలో మొదటి ర్యాంకునూ కలిగి ఉన్న ఆ అమ్మాయే 27 ఏళ్ల సి.ఎ. భవానీ దేవి. ఆసియా ఓషియానియా జోన్‌ నుంచి ఒలింపిక్స్‌ ఫెన్సింగ్‌ క్రీడాంశంలో కేటాయించిన రెండు బెర్తుల్లో ఒకదాన్ని జపాన్‌కు చెందిన ఫెన్సర్‌ దక్కించుకుంటే, మరొకదాన్ని భవానీ సాధించింది. 


కర్రసాముతో సాధన చేసి...

ఎలక్ట్రిక్‌ సూట్‌, మాస్క్‌ ధరించి, ప్రత్యర్థి ఆయుధం శరీరాన్ని తాకేలోపే, మెరుపులా కదులుతూ, ఒడుపుగా కత్తి విసిరే క్రీడ సేబర్‌ ఫెన్సింగ్‌. మానసిక ఏకాగ్రత, శారీరక నేర్పరితనం ఈ క్రీడకు అవసరం. పొరపాటు జరగడానికి ఏమాత్రం వీలు లేని ఈ క్రీడలో అమ్మాయిలు రాణించడం అరుదు. భవానీ రాణించిన ఈ క్రీడకు ప్రారంభంలో గుర్తింపు కూడా తక్కువే! అప్పటి రోజుల గురించి చెబుతూ... ‘‘ఈ క్రీడలో మన దేశం సాధించింది తక్కువే కాబట్టి, ఫెన్సింగ్‌ క్రీడ తగిన గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. ప్రారంభంలో వెదురు కర్రలతో సాధన చేసేదాన్ని. ఫెన్సింగ్‌ కోసం ఉపయోగించే ఆయుధాన్ని పోటీల కోసం దాచుకునేదాన్ని. దానికి బదులుగా ఏ వస్తువు వీలుగా ఉంటే, దాంతో ప్రాక్టీస్‌ కొనసాగించేదాన్ని. ఉదయాన్నే ఐదున్నరకు లేచి, మొదట స్టేడియంకు వెళ్లి, ఆ తర్వాత బడికి వెళ్లేదాన్ని. సాయంత్రం కూడా స్టేడియంలో సాధన చేసి, ఆ తర్వాతే ఇంటికి చేరుకునేదాన్ని. ఇలా కొన్నేళ్ల పాటు సాగింది. సమయానికి స్టేడియం చేరుకోవడం కోసం సిటీ బస్‌ వెనక పరుగులు పెట్టడం నాకిప్పటికీ గుర్తే!’’ అంటూ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంది భవానీ. 


అమ్మ ప్రోత్సాహంతో...

సాహసక్రీడలు పురుషులకే పరిమితం అనే భావన సర్వత్రా ఉంటుంది. అలాంటిదే ఫెన్సింగ్‌ క్రీడ కూడా! భవానీ విషయంలో కూడా ఇలాంటి అభిప్రాయాలే వెలువడ్డాయి. భవానీ ఫెన్సింగ్‌లో రాణిస్తున్న రోజుల్లో కొందరు వెలిబుచ్చిన అభిప్రాయాల గురించి చెబుతూ.... ‘‘కొందరు చదువు మీద దృష్టి పెట్టమన్నారు. కొందరు ఫెన్సింగ్‌ క్రీడకు పనికిరానన్నారు. అథ్లెటిక్స్‌, వాలీబాల్‌ క్రీడల్లా ఫెన్సింగ్‌లో రాణిస్తే ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశాలూ లేవు. దాంతో ఈ క్రీడ ఎక్కువ మందికి ఆసక్తి కలిగించలేకపోయింది. కానీ ఎవరు మెచ్చినా, మెచ్చకపోయినా ఫెన్సింగ్‌ పట్ల నా ఆసక్తి తగ్గలేదు. అమ్మ ప్రోత్సాహం నాకు బలాన్నిచ్చింది. ఎవరైనా ఆడపిల్లకు ఈ క్రీడ నేర్పించడం అవసరమా? అంటే చాలు. ‘దీన్లో నీకేం ఇబ్బంది? అమ్మాయి ఇష్టపడింది. నేర్చుకుంటుంది’ అంటూ నోరు మూయుంచేది. భవానీ తల్లిగా నా వల్ల అమ్మ గర్వపడడం కాదు. ఆమెకు పుట్టిన కూతురిగా నేను గర్వపడుతూ ఉంటాను’’ అని చెప్పుకొచ్చింది భవానీ.


ఫెన్సింగ్‌ ప్రయాణం 

బడిలో ఫెన్సింగ్‌ క్రీడాకారిణిగా పేరు తెచ్చుకున్న భవానీ ప్రతిభను గుర్తించిన స్పోర్ట్స్‌ అధారిటీ ఆఫ్‌ ఇండియా కోచ్‌, సాగర్‌ లాలూ, కేరళలోని తలస్సేరిలో ఉన్న అకాడమీలో సాధనకు ఆహ్వానించారు. పదో తరగతి పరీక్షలు రాసిన భవానీ బ్యాగ్‌ సర్దుకుని, తలస్సేరి చేరుకుని ఫెన్సింగ్‌ సాధనతో పాటు అక్కడే చదువుకూ కొనసాగించి ఇంజనీరింగ్‌ పూర్తి చేసింది. ఆ అనుభవంతో 2017లో ఐస్‌ల్యాండ్‌లో జరిగిన ఫెన్సింగ్‌ ప్రపంచ కప్‌ పోటీలో తలపడి, ఈ క్రీడలో మొట్టమొదటి అంతర్జాతీయ స్వర్ణ పతకాన్ని భారతదేశానికి తెచ్చి పెట్టింది. ‘‘ప్రారంభంలో నేను అంతర్జాతీయ పతకాలు సాధించినప్పుడు అంత సంబరపడవలసిన విషయం ఏముంది దీన్లో అనుకునే వారు. ఫెన్సింగ్‌ క్రీడ గురించిన అవగాహనా లోపమే అందుకు కారణం. కానీ ఇప్పుడు ఈ క్రీడ పట్ల అవగాహన పెరిగింది. ఇది ప్రమాదాలతో కూడిన క్రీడ కాబట్టి నేర్చుకోవడానికి భయపడుతూ ఉంటారు. కానీ నాకెప్పుడూ భయం కలగలేదు. ప్రమాదాలు ప్రతి క్రీడలోనూ ఉంటాయి. వాటి బారిన పడకుండా క్రీడాకారులు అప్రమత్తంగా నడుచుకోవడం ముఖ్యం. ఒలింపిక్స్‌లో భారతదేశం గర్వపడేలా విజయం సాధిస్తాననే నమ్మకం ఉంది’’ అంటూ ధీమా వ్యక్తం చేస్తోంది భవానీ దేవి.


విజయాల వెల్లువ

ఇటలీకి చెందిన కోచ్‌ నికొలా జనోటీ దగ్గర శిక్షణ పొందుతున్న భవానీ ఫెన్సింగ్‌ విజయాలు బోలెడు. 

2009లో మలేషియాలో జరిగిన కామన్‌వెల్త్‌ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించింది.

2010లో ఫిలిప్పైన్స్‌లో జరిగిన ఏషియన్‌ ఫెన్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం గెలుచుకుంది.

2012లో జెర్సీలో జరిగిన కామన్‌వెల్త్‌ ఛాంపియన్‌షిప్‌లో బృందంతో కలిసి రజత పతకం, వ్యక్తిగతంగా కాంస్య పతకం పొందింది.

2014, 2015ల్లో ఏషియన్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో ఒక రజతం, ఒక కాంస్య పతకం దక్కించుకుంది.

2018 టోర్నోయి శాటిలైట్‌ ఫెన్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో రజత పతకం పొందింది.


10 నిమిషాల నిడివి కలిగి ఉండే ఆధునిక ఫెన్సింగ్‌ క్రీడలో ఎపీ, సేబర్‌, ఫాయిల్‌ అనే మూడు రకాలు ఉంటాయి. ఎపీలో పూర్తి శరీరం లక్ష్యంగా ఉంటే, సేబర్‌లో పై శరీర భాగం, ఫాయిల్‌లో కింది శరీర భాగం లక్ష్యంగా పోరాటం సాగుతుంది. ఈ మూడు రకాల ఫెన్సింగ్స్‌లో ఉపయోగించే ఆయుధాలు కూడా వేర్వేరు. భవానీ దేవి సేబర్‌ ఫెన్సింగ్‌లో ప్రవీణురాలు. రోజుకు రెండు నుంచి మూడు గంటల పాటు సాగే రెండు ఫెన్సింగ్‌ సెషన్స్‌లో పాల్గొనడం, వారానికి నాలుగు సార్లు ఫిట్‌నెస్‌, ఫిజియోథెరపీ సెషన్లు అనుసరించడం భవానీ దైనందిన చర్యలో భాగం.

Updated Date - 2021-07-24T08:51:40+05:30 IST