బోర్‌ మోటార్‌కు.. ఇంటి మీటరుకు లంకె

ABN , First Publish Date - 2022-01-09T06:12:35+05:30 IST

వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్‌కు ఇంటి మీటరు నెంబరుతో అనుసంధానం ప్రక్రియ మొదలైంది. ఇకపై రెండు బిల్లులు కలిపి రైతులు చెల్లించాల్సి ఉంటుంది.

బోర్‌ మోటార్‌కు.. ఇంటి మీటరుకు లంకె

చౌటుప్పల్‌, జనవరి 8 : వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్‌కు ఇంటి మీటరు నెంబరుతో అనుసంధానం ప్రక్రియ మొదలైంది. ఇకపై రెండు బిల్లులు కలిపి రైతులు చెల్లించాల్సి ఉంటుంది. వ్యవసాయ కనెక్షన్‌ లేని వారు కేవలం ఇంటి బిల్లు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 13,54,983 గృహ కనెక్షన్లు ఉన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో గృహ సర్వీసు 4,01,994, సూర్యాపేట జిల్లాలో 4,94,857 , నల్లగొండ జిల్లాలో 4,58,132 కనెక్షన్లు ఉన్నాయి. 

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు 15,51,937 ఉన్నాయి. అందులో యాదాద్రి జిల్లాలో 4,71,256, సూర్యాపేట జిల్లాలో 3,77,421, నల్లగొండ జిల్లాలో 7,0,3,260 కనెక్షన్లు ఉన్నాయి. వ్యవసాయ కనెక్షన్లకు సంబంధించి ప్రతి నెలా కస్టమర్‌ సర్వీస్‌ చార్జీ కింద రైతులు రూ.30 చొప్పున ఏటా రూ.360 చెల్లించాల్సి ఉంటుంది. కానీ ; చాలా గ్రామాల్లో రైతులు చెల్లించడం లేదు. ఒక్కో రైతు నుంచి వ్యవసాయ విద్యుత్‌ బిల్లులు నాలుగేళ్లుగా బకాయిలు ఉన్నాయి. విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయిన సమయంలో అధికారులు ఒత్తిడి చేస్తే రైతులు ఒక ఏడాది బిల్లు చెల్లిస్తున్నారు తప్ప రైతులు స్వయంగా వ్యవసాయ బిల్లును చెల్లించడం లేదు. కొన్ని సందర్భాల్లో కొన్నేళ్లుగా బకాయిలు ఉన్న రైతుల ట్రాన్స్‌ఫార్మర్‌ పరిధిలో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తామని అధికారులు రైతులపై ఒత్తిడి పెంచుతున్నారు. అయినా ఆశించిన ఫలితం దక్కడం లేదు. దీనికి ప్రత్యామ్నాయంగా గృహ విద్యుత్‌ బిల్లులతో కలిపి వ్యవసాయ బిల్లులు వసూలు చేయడమే ఉత్తమమైన మార్గమని విద్యుత్‌ శాఖ భావిస్తోంది. అందులో భాగంగా ఇంటి మీటర్‌ నెంబర్‌తో వ్యవసాయ బిల్లులను అనుసంధానం చేస్తుంది. 

కాస్త ఉపశమనం

వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్ల సర్వీసు బిల్లుల వసూలు ప్రక్రియ సిబ్బందికి తలకు మించిన భారంగా మారింది. ఈ క్రమంలో రోజుకు రూపాయి చొప్పున గృహమీటర్‌ బిల్లులో కలిపి నెలకు రూ.30 చొప్పున వసూలు చేయడంతో కొంతవరకైనా బకాయిల భారం నుంచి ఉపశమనం లభిస్తుందని విద్యుత్‌ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఈ విధానానికి సంబంధించి శాఖ అధికారులు సిబ్బంది, రైత ులకు వివరించి అవగాహన కల్పిస్తున్నారు. 

ఇలా అనుసంధానం చేసుకోవచ్చు 

వ్యవసాయ కనెక్షన్‌ ఉన్న రైతులు తమ ఇంటి మీటర్‌ నెంబర్‌తో వ్యవసాయ కనెక్షన్‌ను తామే లింక్‌ చేసుకోవచ్చు. ఇంటి మీటర్‌ నెంబర్‌, వ్యవసాయ బోరుబావి వివరాలు లైన్‌మెన్‌ లేదా జేఎల్‌ఎంకు అందజేస్తే వారు అనుసంధానం చేస్తారు.  


బకాయిలను నివారించవచ్చు

ఇంటి మీటరుకు వ్యవసాయ మోటార్‌ కనెక్షన్లను అనుసంధానం ప్రక్రియ ప్రారంభమైంది. ఈవిధానం ద్వారా విద్యుత్‌ బిల్లుల వసూళ్లు సులభతరం అవుతుంది. బకాయిలను కూడా తగ్గించవచ్చు. విద్యుత్‌ బిల్లులు పేరుకుపోకుండా ఉండేందుకే విద్యుత్‌ శాఖ ఈ ప్రక్రియను ప్రారంభించింది. దీనికి సంబంధించి అధికారులు సిబ్బంది రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ విధానం ద్వారా ప్రతి నెలా ఇంటి మీటర్‌ బిల్లుతో పాటు వ్యవసాయ బోరు మోటర్‌ బిల్లులు కూడా చెల్లించే విధంగా రైతులను సన్నద్ధం చేస్తున్నాం.

 శ్యాంకుమార్‌, ఏడీఈ, చౌటుప్పల్‌ 


అనుసంధానం మంచిదే... పేర్లు మార్చండి

ఇంటి మీటర్‌కు వ్యవసాయ మోటర్‌ కనెక్షన్‌ అనుసంధానం చేయడం మంచిదే. దీంతో ఒకేసారి వ్యవసాయ మోటార్ల బిల్లులు చెల్లించే బాధ తప్పుతుంది. కానీ, పేర్ల మార్పిడిలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఇంటి మీటర్‌ రైతుపేరున ఉంటే వ్యవసాయ బావి మోటార్‌ కనెక్షన్‌ తాతలు, తండ్రుల పేరున ఉంది. వ్యవసాయ మోటర్‌ బిల్లు తాము కడుతున్నా పేరు మాత్రం తాతల, తండ్రుల పేరే వస్తోంది. వ్యవసాయ మోటర్‌ కనె క్షన్లను ఇంటి మీటర్‌ ఉన్న రైతుపేరు మీద మార్చడంలో విద్యుత్‌శాఖ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారు. ముందుగా ఇంటి మీటర్‌ ఎవరి పేరునా ఉంటే వ్యవసాయ మీటర్‌ వారి పేరున ఉండేలా అధికారులు మార్పులు చేయాలి. 

ఏపూరి సతీష్‌, రైతు, సంస్థాన్‌ నారాయణపురం

Updated Date - 2022-01-09T06:12:35+05:30 IST