కరోనా కేసులు పెరగకుండా చర్యలు

ABN , First Publish Date - 2021-07-31T05:29:34+05:30 IST

జిల్లాలో రెండు శాతం కంటే ఎక్కువగా కరోనా కేసులు ఉన్న గ్రామ, మండల కేంద్రాల్లో ఇకపై కేసులు పెరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ చక్రధర్‌బాబు పలు శాఖల అధికారులకు సూచించారు

కరోనా కేసులు పెరగకుండా చర్యలు
మాట్లాడుతున్న కలెక్టర్‌ చక్రధర్‌బాబు

 100 పడకల ఆసుపత్రిలో ఆక్సిజన్‌ ప్లాంట్‌ 

టాస్క్‌ఫోర్స్‌ సమీక్షలో కలెక్టర్‌ చక్రధర్‌బాబు

నెల్లూరు(వైద్యం) జూలై 30 : జిల్లాలో రెండు శాతం కంటే ఎక్కువగా కరోనా కేసులు ఉన్న గ్రామ, మండల కేంద్రాల్లో ఇకపై కేసులు పెరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ చక్రధర్‌బాబు పలు శాఖల అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని తిక్కన భవన్‌లో కొవిడ్‌ నియంత్రణ, వ్కాక్సినేషన్‌, ఆసుపత్రుల నిర్వహణపై టాస్క్‌ఫోర్స్‌, నోడల్‌ అధికారులు, ఆసుపత్రుల సూపరింటెండెంట్‌లతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ప్రజలకు అవగాహన కల్పించి వ్యాక్సిన్‌ వేయించుకునేలా చూడాలన్నారు. ప్రత్యేకించి ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ వ్యాక్సిన్‌ వేసుకునేలా చూడాలన్నారు. థర్డ్‌వేవ్‌ సెప్టెంబర్‌లో వచ్చే అవకాశం ఉన్నందున,  దానిని ఎదుర్కొనేలా సన్నద్ధం కావాలన్నారు. మాస్క్‌లు ధరించని వారికి జరిమానా విధించాలన్నారు. ప్రజలు ఎక్కువగా గుమిగూడే ప్రాంతాలు, నిబంధనలు పాటించని వ్యాపారులపై చర్యలు తీసుకునేలా మున్సిపల్‌, పంచాయితీరాజ్‌, రెవెన్యూ, పోలీసు శాఖలు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. కొవిడ్‌ ఆసుపత్రుల్లో సామర్థ్యాన్ని బట్టి ఆక్సిజన్‌ నిల్వలను, ఐసీయూను ఏర్పాటు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. 100 పడకలున్న ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో తప్పని సరిగా ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలన్నారు. రానున్న రెండు వారాల్లో ఆక్సిజన్‌ ప్లాంట్‌ నిర్మాణంపై గుర్తింపు పత్రాలు సమర్పించాలని ఆదేశించారు. జిల్లాలోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లను అభివృద్ధి చేసి 50 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దాలన్నారు. ఐదేళ్లలోపు చిన్నారులకు వ్యాధినిరోధక టీకాలు పూర్తి చేయాలని  తెలిపారు. ప్రతి పరిశ్రమలో సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు కరోనా వ్యాక్సిన్‌ వేయించాలన్నారు. లేని పక్షంలో పరిశ్రమల కార్యకలాపాలు నిలిపి వేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జేసీలు హరేందిరా ప్రసాద్‌, గణేష్‌కుమార్‌, కమిషనర్‌ దినేష్‌కుమార్‌, ట్రైనీ కలెక్టర్‌ అహ్మద్‌ఖాన్‌, డీఎఫ్‌వో షణ్ముఖకుమార్‌ పాల్గొన్నారు.


Updated Date - 2021-07-31T05:29:34+05:30 IST