Abn logo
Mar 26 2020 @ 09:51AM

19 జైళ్లలో కరోనా ప్రబలకుండా ఖైదీల విడుదల

చంఢీఘడ్ (హర్యానా): ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ 19 జైళ్లలో ప్రబలకుండా ముందుజాగ్రత్త చర్యగా ఖైదీలను పెరోలు, లేదా బెయిలుపై విడుదల చేయాలని హర్యానా రాష్ట్ర ప్రభుత్వం గురువారం నిర్ణయించింది. హర్యానా రాష్ట్రంలో ఖైదీలతో రద్దీగా ఉన్న19 జైళ్లలో ఏడేళ్ల కారాగార శిక్ష పడిన ఖైదీలను పెరోల్, బెయిలుపై విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని హర్యానా జైళ్ల శాఖ మంత్రి రంజిత్ సింగ్ చౌతాలా చెప్పారు. జైళ్ల నుంచి ఖైదీల విడుదలకు జైలులో వారి ప్రవర్తన, వారిపై ఉన్న ఇతర కేసుల గురించి పరిశీలిస్తామని మంత్రి పేర్కొన్నారు.


ఖైదీల్లో 65 ఏళ్ల వయసు దాటిన వారికి ఆరు వారాల పాటు ప్రత్యేక పెరోల్ ఇస్తామని మంత్రి ప్రకటించారు. డ్రగ్స్, అత్యాచారాలు, యాసిడ్ దాడులు లాంటి తీవ్ర నేరాల్లో ఖైదీలకు మాత్రం ఈ పెరోల్ నుంచి మినహాయిస్తామని మంత్రి పేర్కొన్నారు. విదేశీ ఖైదీలను విడుదల చేయబోమని మంత్రి చెప్పారు. ఇప్పటికే పెరోల్ పొందిన ఖైదీలకు నాలుగు వారాల పాటు ప్రత్యేక పెరోల్ మంజూరు చేస్తామని మంత్రి వివరించారు. జస్టిస్ రాజీవ్ శర్మ నేతృత్వంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో హోంశాఖ అదనపు చీఫ్ సెక్రటరీ  విజయ్ వర్దన్, జైళ్లశాఖ డైరెక్టరు జనరల్ కె సెల్వరాజ్ లు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement