పల్లె రుణం తీర్చడానికి

ABN , First Publish Date - 2022-05-26T07:42:03+05:30 IST

‘‘ఉద్యోగ రీత్యా నేను, మా వారు తుకారామ్‌ పుణెలో స్థిరపడ్డాం. ఆయన మెకానికల్‌ ఇంజనీర్‌. నేను ఇండస్ర్టియల్‌ ఇంజనీర్‌ని.

పల్లె రుణం తీర్చడానికి

‘‘ఉద్యోగ రీత్యా నేను, మా వారు తుకారామ్‌ పుణెలో స్థిరపడ్డాం. ఆయన మెకానికల్‌ ఇంజనీర్‌. నేను ఇండస్ర్టియల్‌ ఇంజనీర్‌ని. లేచింది మొదలు క్షణం తీరికలేని జీవితం మాది. అలాంటి సమయంలో కరోనావల్ల కార్యాలయాలు బంద్‌ అయ్యాయి. అంతా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌. దీంతో మేం మా ఊరికి పోదామనుకున్నాం. మహారాష్ట్రలోని అందర్‌సూల్‌ గ్రామం మాది. పని ఒత్తిడి వల్ల పధ్నాలుగేళ్లుగా అటువైపు చూడలేకపోయాం. ఇప్పుడు అవకాశం లభించింది. ఎలా వదులుకొంటాం! కొన్ని రోజులు ఉండి వచ్చేద్దామనుకుని ఊరికి పయనమయ్యాం. అక్కడకు వెళ్లిన తరువాత కుటుంబ సభ్యులు, స్నేహితులతో సరదాగా గడిపాం. కొన్ని వారాలు ఉన్నాక అర్థమైంది... ఈ పధ్నాలుగేళ్లలో ఊరు పెద్దగా ఏమీ మారలేదని! ముఖ్యంగా రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది. సరైన పంట దిగుబడి లేక అవస్థలు పడుతున్నారు. ప్రపంచమంతా ఆధునిక వ్యవసాయంతో పోటీపడుతుంటే వారు మాత్రం ఇంకా పశువులు, కూలీలపైనే ఆధారపడుతున్నారు. ఫలితంగా వ్యయం పెరిగి, ఆదాయం గణనీయంగా తగ్గింది. ప్రధానంగా ఒకటి, అర ఎకరాలున్న పేద రైతులపై ఈ ప్రభావం ఎక్కువని మాకు అర్థమైంది. మరి పరిష్కారం ఏమిటి? 


ఆ కష్టాలు... బాధలు తెలుసు... 

పొలం దున్నడం, నాటడం, ఎరువులు, పురుగు మందులు చల్లడం లాంటివన్నీ వ్యవసాయ కూలీలు చేస్తున్నారు. దానికితోడు అక్కడ ఎద్దుల కొరత. వాటిని పోషించడం చాలా ఖర్చుతో ముడిపడిన వ్యవహారం కావడంతో రైతులందరి ఇళ్లల్లో అవి కనిపించవు. దాదాపు యాభై శాతం మంది గ్రామస్తుల వద్ద ఎద్దులు లేవు. ట్రాక్టర్లు పెట్టుకొనే అంతటి స్థోమతా లేదు. ఉన్నా మొక్కలు కాస్త పెరిగాక ట్రాక్టర్‌ ఉపయోగించడం కుదరదు. అందుబాటులో ఉన్న వనరులనే అందరూ పంచుకోవాలి. అయితే సాగులో ఒక్క వారం ఆలస్యమైనా ఆ ప్రభావం పంట దిగుబడి, అమ్మకాలు, ఆదాయం... ఇలా అన్నిటిపై పడుతుంది. ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిగా ఆ కష్టాలు, బాధలు నాకు తెలుసు. వాటిని కొంతైనా తగ్గించగలిగితే... అంతకు మించిన సంతృప్తి మరేదీ ఉండదు. అన్నిటికంటే... మమ్మల్ని పెంచి పెద్ద చేసిన పల్లె రుణం కొంతైనా తీర్చుకోవాలి కదా! 


అన్నీ చేసేలా...  

లాక్‌డౌన్‌లో లభించిన సమయాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకుని ఈ సమస్యలను పరిష్కరించాలనుకున్నాం. కానీ ఎలా? ఆలోచిస్తుండగా తట్టిందే ‘ఎలక్ర్టిక్‌ బుల్‌’. స్నేహితులు, స్థానిక వర్క్‌షా్‌పల సహకారంతో అన్ని పనులూ చేయగలిగేలా దీన్ని రూపొందించాలనుకున్నాం. నిరుపయోగంగా పడివున్న సామగ్రి సేకరించి, ఇంజన్‌ అమర్చి చిన్నపాటి మిషన్‌ డిజైన్‌ చేసి, పని ప్రారంభించాం. అయితే విషయం ఊరంతా పాకింది. మిషన్‌ గురించి తెలుసుకోవడానికి రైతులు, ఔత్సాహిక ఇంజనీర్లు మా ఇంటికి రావడం మొదలుపెట్టారు. ఏంచేస్తున్నామో ఆసక్తిగా గమనించారు. అలాగే వారి ఆలోచనలు మాతో పంచుకున్నారు. రైతులకు మరింత ప్రయోజనం చేకూరేలా ఎలా అభివృద్ధి చేస్తే బాగుంటుందో అందరి సూచనలూ తీసుకున్నాం.  వాటిన్నిటినీ దృష్టిలో పెట్టుకుని, అనుకున్న యంత్రం తేవడానికి నేను, మావారు కష్టపడ్డాం. కొన్ని రోజులు రాత్రిళ్లు నిద్ర కూడా పోయే అవకాశం ఉండేది కాదు. చివరకు మా ప్రయత్నానికి ఒక రూపం వచ్చింది. ఒక్కసారి పొలం దున్నడం అయిపోయాక ఇక విత్తనాలు నాటడం నుంచి కోతల వరకు ఈ మిషనే చూసుకొంటుంది. కొన్ని రోజులు ట్రయల్‌ రన్‌ నిర్వహించాం. మంచి ఫలితాలనిచ్చింది. 


పదో వంతు ఖర్చులో...  

కొంత కాలానికి మాకు అర్థమైంది ఏమిటంటే... నేల స్వభావం అన్నిచోట్లా ఒకేలా ఉండదు. అలాగే రైతుల అవసరాలు కూడా! కనుక దానికి తగ్గట్టుగా కస్టమైజ్డ్‌ మిషన్లు తయారు చేయాలనుకున్నాం. లాక్‌డౌన్‌ అయిపోయాక పుణేలోని రాష్ట్ర ప్రభుత్వ ‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌’లో మా మిషన్‌ ప్రదర్శించాలనుకున్నాం. దాని కోసం దరఖాస్తు పంపాం. వారు పరిశీలించి మాకు ఒక సూచన చేశారు. సంప్రదాయ ఇంధనంతో కంటే విద్యుత్‌ శక్తితో నడిపించగలిగితే మరింత ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఆ ఆలోచన మాకు బాగా నచ్చింది. దానికి అనుగుణంగానే ‘ఎలక్ర్టిక్‌ బుల్‌’కు రూపం ఇచ్చాం. దీనివల్ల రైతులకు సంప్రదాయ పద్ధతితో పోలిస్తే పదో వంతు ఖర్చులోనే పనులన్నీ అయిపోతాయి. ఒక్కళ్లే దీన్ని ఉపయోగించవచ్చు. సింగిల్‌ ఫేజ్‌ యూనిట్‌తో మిషన్‌ని చార్జింగ్‌ చేసుకోవచ్చు. పూర్తి చార్జింగ్‌కు రెండు గంటలు పడుతుంది. ఒక్కసారి చార్జింగ్‌ చేస్తే నాలుగు గంటలు నడుస్తుంది. 


అంతా అడుగుతున్నారు... 

‘ఎలక్ర్టిక్‌ బుల్‌’ తయారీ, విక్రయం కోసం ‘కృషిగతి ప్రైవేట్‌ లిమిటెడ్‌’ పేరుతో స్టార్టప్‌ ఒకటి నెలకొల్పాం. మహారాష్ట్రతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కంపెనీలు కూడా మమ్మల్ని సంప్రతిస్తున్నాయి. వివిధ ప్రాంతాల్లోని  రైతుల నుంచి వందల్లో ఫోన్లు వస్తున్నాయి. ఇది మాకు ఉత్సాహాన్నిస్తోంది. ఇప్పటికి పది ఆర్డర్లు మాత్రమే తీసుకున్నాం. ఎందుకంటే మేం పరిమిత వనరులతో పనిచేస్తున్నాం కదా! అందుకే ఇంకా మార్కెట్‌లోకి వెళ్లలేదు. దేశ వ్యాప్తంగా ఈ ‘ఎలక్ర్టిక్‌ బుల్‌’ని అందుబాటులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నాం. అలాగే విదేశాల్లో కూడా విస్తరించాలనేది మా కోరిక.


స్నేహితులు, స్థానిక వర్క్‌షా్‌పల సహకారంతో అన్ని పనులూ చేయగలిగేలా  ఎలక్ర్టిక్‌ బుల్‌ రూపొందించాలనుకున్నాం. నిరుపయోగంగా పడివున్న సామగ్రి సేకరించి, ఇంజన్‌ అమర్చి చిన్నపాటి మిషన్‌ డిజైన్‌ చేసి, పని ప్రారంభించాం. 

Updated Date - 2022-05-26T07:42:03+05:30 IST