పిల్లల స్ర్కీన్‌టైమ్‌ తగ్గాలంటే

ABN , First Publish Date - 2021-09-29T05:30:00+05:30 IST

‘‘ఎప్పుడూ స్మార్ట్‌ ఫోన్‌ చూస్తూనో, ట్యాబ్‌లో ఆడుకుంటూనో

పిల్లల స్ర్కీన్‌టైమ్‌ తగ్గాలంటే

‘‘ఎప్పుడూ స్మార్ట్‌ ఫోన్‌ చూస్తూనో, ట్యాబ్‌లో ఆడుకుంటూనో ఉంటారు... అవి చేతిలో ఉంటే తిండీ, నిద్రా అక్కర్లేదు. చదువు ఊసే పట్టదు...’’- పిల్లల గురించి చాలామంది తల్లితండ్రుల నుంచి తరచూ వినిపించే ఫిర్యాదు ఇది! నిజానికి ఈ సమస్య పిల్లల్లోనే కాదు, పెద్దల్లోనూ ఎక్కువగానే ఉంది. అయితే, మనోవికాసానికీ, శారీరకమైన ఎదుగుదలకూ దోహదపడే క్రీడలు, వ్యాయామాలకు పిల్లలు మునుపటికన్నా ఎక్కువగా దూరమైపోతున్నారు. పిల్లల కన్నా కారాగారాల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలే ఆరుబయట ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారని అయిదేళ్ళ క్రితం ఒక అంతర్జాతీయ సంస్థ నిర్వహించిన అధ్యయనం వెల్లడించింది.


ఇక, కరోనా వల్ల గత ఏడాదిన్నరగా పిల్లలు ఆరుబయట ఆట పాటలకు దాదాపుగా దూరమైపోయారు. దీంతో గాడ్జెట్లతో వాళ్ళు గడిపే సమయం ఇంకా పెరిగింది. ఈ ధోరణి దీర్ఘకాలికంగా వారి ఆరోగ్యం మీదా, మానసిక స్థితిగతులమీదా, భావోద్వేగాల మీదా దుష్ప్రభావం చూపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో... స్ర్కీన్‌ టైమ్‌ తగ్గించి, నాన్‌ స్ర్కీన్‌ యాక్టివిటీస్‌లో పిల్లలను నిమగ్నం చేసే కొన్ని చర్యలను వారు సూచిస్తున్నారు. అవేమిటంటే...


వాళ్ళకు చెప్పేది మీరు చేయండి

మీరు రోజంతా స్మార్ట్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లకు అతుక్కుపోతూ... వాటికి దూరంగా ఉండాలని పిల్లలకు చెప్పినా ప్రయోజనం ఉండదు. మీరు ఆఫీసు పనుల కోసం గనుక వాటిని ఉపయోగిస్తున్నట్టయితే... ఆ సంగతి వారికి అర్థమయ్యేలా చెప్పండి. అలా కానప్పుడు మీ స్ర్కీన్‌ టైమ్‌ తగ్గించుకోండి. 


సమయం నిర్దేశించండి

ఏఏ పనులకు ఎంత సమయం కేటాయించాలో షెడ్యూల్‌ వేయండి. స్ర్కీన్‌ టైమ్‌ ఎంత ఉండాలో కచ్చితంగా నిర్దేశించుకోండి. ఆ వేళలను మీరు పాటిస్తూ... మీ పిల్లలు పాటించేలా చూడండి. 


హాబీలను ప్రోత్సహించండి

కాలక్షేపం అంటే టీవీ, స్మార్ట్‌ ఫోన్‌ మాత్రమే కాదు. ఆలోచనా శక్తినీ, సృజనాత్మకతనూ పెంచే అభిరుచుల వైపు పిల్లల్ని చిన్న వయసులోనే ప్రోత్సహించడం వారి వికాసానికి దోహదం చేస్తుంది. పుస్తకాలు చదవడం, బొమ్మలు గీయడం, రంగులు వేయడం లాంటివే కాదు... తోట పని లాంటి పనుల్లోనూ వారిని నిమగ్నం చేయవచ్చు.


సమయం కేటాయించండి

పిల్లల స్ర్కీన్‌ టైమ్‌ తగ్గించాలంటే వారితో మీరు ఎక్కువ సమయం గడపాలి. వారితో కలిసి చిన్న చిన్న ఆటలు ఆడండి. కంప్యూటర్లలోనో, ఫోన్లలోనో ఆడేవి ఎంచుకోకండి. మీతో వాకింగ్‌కు తీసుకువెళ్ళండి. వారి శక్తికి తగిన వ్యాయామాలు చేయించండి. అవుట్‌డోర్‌ గేమ్స్‌ను ప్రోత్సహించండి. పాఠాలను వారికి మరింతగా అర్థమయ్యేలా వివరించండి.


ఓపిక ప్రధానం

నెలలూ, సంవత్సరాలుగా ఉన్న అలవాటు గంటల్లోనో, రోజుల్లోనో మాయమైపోదు. కానీ, ఎలకా్ట్రనిక్‌ పరికరాల కన్నా ఎక్కువ కాలక్షేపం, వినోదం అందించే హాబీల అందుబాటు, కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం సంతోషంగా గడపడం.. వీటిద్వారా గాడ్జెట్ల అడిక్షన్‌ నుంచి పిల్లలు క్రమంగా బయటపడతారు.


Updated Date - 2021-09-29T05:30:00+05:30 IST