గాల్లో వెళ్లయినా పరిశ్రమలు పెట్టాలట!

ABN , First Publish Date - 2022-04-15T08:18:21+05:30 IST

ఐదేళ్ల క్రితం వారంతా ఎంతో ఆసక్తితో పరిశ్రమలు పెట్టేందుకు ముందుకొచ్చారు. ప్రభుత్వం వారికి భూమిని కూడా కేటాయించింది. ఆ భూమికి చెల్లించాల్సిన సొమ్ము....కొ

గాల్లో వెళ్లయినా పరిశ్రమలు పెట్టాలట!

సైకిల్‌పై వెళ్లేందుకూ దారి లేదు.. అక్కడ పరిశ్రమలు పెట్టలేదని తాఖీదు

భూమికీ, వసతులకూ ఐదేళ్ల క్రితమే 100% చెల్లించిన వైనం

వసతులు కల్పించని ఏపీఐఐసీ.. అయినా పెనాల్టీ పారిశ్రామికవేత్తలకు 

మల్లవల్లి పారిశ్రామికవేత్తలతో చెడుగుడు.. రహస్యంగా ఉత్తర్వులు!


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఐదేళ్ల క్రితం వారంతా ఎంతో ఆసక్తితో పరిశ్రమలు పెట్టేందుకు ముందుకొచ్చారు. ప్రభుత్వం వారికి భూమిని కూడా కేటాయించింది. ఆ భూమికి చెల్లించాల్సిన సొమ్ము....కొద్ది కొద్దిగా కాకుండా...వందశాతం అప్పుడే చెల్లించేశారు. కానీ ఏపీఐఐసీ... ఆయా పారిశ్రామికవేత్తలు తమకు కేటాయించిన స్థలం వద్దకు వెళ్లేందుకు రోడ్డు వేయలేదు. కనీసం సైకిల్‌పై వెళ్లే వీలూ లేదు. కానీ గాల్లో వెళ్లయినా పరిశ్రమలు మాత్రం పెట్టేయాలట! అలా గాల్లో వెళ్లి పరిశ్రమలు పెట్టలేదు కాబట్టి...అలా పెట్టనివారికి అప్పట్లో కేటాయించిన స్థలాలకుగాను...మళ్లీ ఇప్పుడు అదనంగా చెల్లించాలట! పూర్తి మొత్తం అప్పట్లో చెల్లించినా ఈ పెనాల్టీ కట్టాల్సిందేనట! అది కూడా గతంలో ఎకరా రూ.16.5లక్షల ధరతో కేటాయిస్తే ఇప్పుడు ఏకంగా రూ.65లక్షల మేర చెల్లించాలి. అంతేకాదు కొందరు పారిశ్రామికవేత్తలకు ఇచ్చిన స్థలాల కేటాయింపును కూడా రద్దు చేసేయాలి. ఇదీ తాజా ఉత్తర్వుల సారాంశం. అయితే, ఈ నిర్ణయానికి సంబంధించిన ఉత్తర్వును కూడా రహస్యంగా ఉంచేసింది. వివరాల్లోకి వెళితే.. కృష్ణాజిల్లా మల్లవల్లిలో పారిశ్రామిక పార్కును ప్రారంభించాలని 2017 లో నిర్ణయించారు.


దానికి అనుగుణంగా 1,341 ఎకరాల్లో ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. పెద్ద పరిశ్రమలతోపాటు చిన్న, మధ్యతరగతి పరిశ్రమలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలను పెట్టేందుకు సంకల్పించారు. దానికోసం పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారు. వందలమందికి స్థలాలు కేటాయించారు. ఇందులో కాస్త పెద్ద పరిశ్రమలకు మాత్రం రోడ్డు పక్కనే స్థలాలు కేటాయించారు. ఒక కంపెనీకి అయితే ఏకంగా ఒక కిలోమీటరు మేర రోడ్‌ ఫేసింగ్‌ ఉండే 90ఎకరాల భూమిని కేటాయించారు. వాస్తవానికి అంత మేర రోడ్డు ఫేసింగ్‌ కాకుండా.. కొంత దీర్ఘ చతురస్రాకారంగా కూడా భూమిని ఇవ్వొచ్చు. ఈ కంపెనీకి కేటాయించిన భూమికి వెనక్కు వెళ్తే 30 అడుగుల లోతున్న గొయ్యి. అది కూ డా పారిశ్రామిక పార్కులోదే. బ్లాక్‌ నంబర్‌ 17, 18లలో ఉన్న ఆ గొయ్యిలో చిన్న, మధ్యతరగతి పారిశ్రామికవేత్తలకు ప్లాట్లు కేటాయించారు. ఈ రెండు బ్లాకులు కలిపి సుమారు 240ఎకరాలు ఉంటుంది. ఇందులోని భూమిని సుమారు 200మందికి ప్లాట్లుగా ఇచ్చారు. వీటికి ఐదేళ్లుగా కనీసం రోడ్డు సౌకర్యం కూడా లేదు. దీంతో వారు తమ యూనిట్లను పెట్టలేకపోయారు. భూమి విలువ, మౌలిక సదుపాయాల కల్పన రెండింటికీ కలిపి ఎకరానికి రూ.16.5లక్షలు చొప్పున ఏపీఐఐసీ తీసుకుంది.


మరి దాని ప్రకారం ఆ సంస్థలు పనులు చేయాలి. అది వదిలేసి యూనిట్లు పెట్టనివారికి మౌలిక సదుపాయాల కల్పన కోసం ఖర్చయిందంటూ ఎకరాకు రూ.65లక్షలు ఇవ్వాలని కొందరికి, అసలు కొంతమందికి స్థలాల కేటాయింపే రద్దు చేస్తున్నామం టూ నోటీసులు పంపేందుకు కూడా రంగం సిద్ధమైందని సమాచారం. 


అంత ఖర్చు చేశారా..!

మల్లవల్లి పారిశ్రామిక పార్కును గత టీడీపీ హయాంలోనే ప్రారంభించా రు. అప్పట్లోనే కొన్ని పెద్ద పరిశ్రమలకు భూములిచ్చారు. ఎక్కువభాగం చిన్న, మధ్యతరగతి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కేటాయించారు. అప్పట్లో భూములిచ్చిన వాటిలో సుమారు 13పెద్ద పారిశ్రామిక సంస్థలున్నాయి. వాటికి పారిశ్రామిక పార్కు ముందుభాగంలోనే స్థలాలు కేటాయించారు. అదే సమయంలో ఆ పార్కుకు వెళ్లేందుకు వేసిన పెద్ద రోడ్డుకు ఆనుకునే ఈ భూములున్నాయి. దీంతో ఆయా పెద్ద పారిశ్రామిక  సంస్థలు అక్కడ తమ యూనిట్లను ప్రారంభించేశాయి. ఇలా యూనిట్లను ప్రారంభించిన 13పెద్ద సంస్థలకు పాత ధరకే...కేటాయించిన భూములను రిజిస్ర్టేషన్‌ చేసేయాలని నిర్ణయించారు. గత  ప్రభుత్వ హయాంలోనే వీటికి భూములు కేటాయించి యూనిట్లు ప్రారంభించినా రిజిస్ర్టేషన్లు చేయకపోవడంతో ఇప్పు డు చేస్తున్నారు. ఇక మరో కేటగిరీ ఏంటంటే...స్థలాల కేటాయింపు పొంది పూర్తిగా సొమ్ములు చెల్లించినా...యూనిట్లు పెట్టనివారు. ఇలాంటి వారు వందల్లోనే ఉన్నారు. వీరు యూనిట్లు పెడతామన్నా...రోడ్డు సదుపాయం లేదు. దీంతో యూనిట్లు పెట్టడానికి సాధ్యం కాలేదు. అయితే వీరికి కేటాయించిన స్థలాల రేటును ఇప్పుడు పెంచేశారు.


గతంలో ఎకరాకు రూ.16.5లక్షల చొప్పున స్థలం కేటాయించిన వీరికి...ఇప్పుడు ఎకరాకు రూ.65లక్షల చొప్పున చెల్లించాలని అంటున్నారు. అదేంటి? అంటే...గతంలో స్థలాలు కేటాయించినప్పుడు విద్యుత్‌ సరఫరాను డిస్కం ఇస్తామని చెప్పిందని, అదేవిధంగా రోడ్లను మరో శాఖ వేస్తానని చెప్పిందని...కానీ ఆయా శాఖలు ఆ పనిచేయలేదని ఏపీఐఐసీ చెప్తోంది. ఇప్పుడు ఆ మౌలిక సదుపాయాల కల్పనను ఏపీఐఐసీనే చేస్తోందని....దానికోసం అయ్యే ఖర్చునే స్థలాలు పొందినా యూనిట్లు పెట్టనివారిపై వేస్తున్నామని అంటున్నారు.  

తప్పు వారిది...తిప్పలు వీరికా!

రోడ్డు ఫేసింగ్‌లో భూములు పొందిన 13పెద్ద కంపెనీలు తమ యూనిట్లను స్థాపించేశాయి. వీరికి రోడ్డు ఫేసింగ్‌ ఇవ్వడంలో తప్పులేదు కానీ..వీటితోపాటే స్థలాలను పొంది, సొమ్ములు చెల్లించిన యూనిట్ల విషయంలో ఏపీఐఐసీ అనుసరిస్తున్న వైఖరే చర్చనీయాంశంగా మారింది.  యూనిట్లు పెట్టిన పెద్ద కంపెనీలకు రోడ్డు సౌకర్యం ఉండడంతో వాళ్లు తమ పనులు పూర్తిచేయగలిగారు. కానీ ఈ పారిశ్రామిక పార్కులో వెనక ఉన్న కొన్ని బ్లాకులు, అదేవిధంగా ఫేజ్‌-2లో కేటాయింపు పొందిన చిన్న, మధ్యతరగతి పారిశ్రామికవేత్తలకు చెందిన స్థలాలకు అసలు రోడ్లే వేయలేదు. మరి రోడ్లు వేయకపోవడం ఎవరి తప్పు? అది ఏపీఐఐసీ చేయాల్సిన పని. చేయాల్సిన పని చేయకపోగా...ఇప్పుడు మౌలిక వసతుల కల్పన కోసం ఖర్చయిందంటూ ధర పెంచడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.  మల్లవల్లి పారిశ్రామిక పార్కు కోసం తీసుకున్న భూముల్లో కొన్నింటిపై హైకోర్టులో కేసులున్నాయి. ఆయా భూముల్లో అనుభవంలో ఉన్నవారు పరిహారం విషయంలో తమకు న్యాయం జరగలేదని కేసులు వేశారు. హైకోర్టు ఈ విషయంలో సదరు భూములను యథాతథంగా ఉంచాలంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఇలాంటి భూముల్లోనూ  స్థ లాలు కేటాయించేశారు. వారు తమ స్థలాలకు సంబంధించిన పూర్తి సొమ్ము చెల్లించేశారు. అయితే కోర్టు కేసుల నేపథ్యంలో కేటాయింపు పొందిన పారిశ్రామికవేత్తలకు ఆయా ప్లాట్లను రిజిస్ర్టేషన్‌ చేసే అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు అలాంటివారందరికీ వారు కట్టిన డబ్బును వందశాతం వెనక్కు ఇచ్చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ విషయంలోను అసంతృప్తి ఉం ది. ఎప్పుడో స్థలాల కేటాయింపు కోసం పూర్తి డబ్బు వారు కట్టేశారు. ఇప్పుడు సింపుల్‌గా ‘మీరు కట్టిన డబ్బు మీకిచ్చేస్తాం’ అంటే తమ కష్టం, వడ్డీ, ఔత్సాహికులుగా పరిశ్రమలు పెట్టాలన్న తమ ఆకాంక్ష ఏమైపోతాయని వారంతా ప్రశ్నిస్తున్నారు. మరో బ్లాక్‌లో స్థలాలు కేటాయించాలని కోరుతున్నారు. 

Updated Date - 2022-04-15T08:18:21+05:30 IST