పొట్ట కొవ్వు కరగాలంటే...

ABN , First Publish Date - 2022-01-04T05:30:00+05:30 IST

సాధారణంగా అధిక బరువు ఉండే వారికి పొట్ట దగ్గర కొవ్వు

పొట్ట కొవ్వు కరగాలంటే...

సాధారణంగా అధిక బరువు ఉండే వారికి పొట్ట దగ్గర కొవ్వు బాగా ఉంటుంది. దీన్ని కరిగించాలంటే రోజూ కచ్చితంగా ఈ ఆసనాలు వేయాల్సిందే. పరిమితంగా తింటూ, క్రమశిక్షణతో ఈ యోగాసనాలు చేస్తే పొట్ట దగ్గర కొవ్వును తగ్గిస్తాయి. అవే ఇవి..


భుజాంగాసనం

బోర్లా పడుకోవాలి.

చేతులను నేలపై ఉంచాలి.

చేతుల మీద బరువు మోపుతూ నడుము పైభాగాన్ని గాల్లోకి లేపాలి.

ఈ భంగిమలో 25 నుంచి 30 సెకన్లు ఉండి తిరిగి క్రితం భంగిమలోకి రావాలి.

ఆ ఆసనంతో కటి దగ్గరి కండరాలు బలపడతాయి. పైకడుపు, పొత్తి కడుపు దగ్గర పేరుకున్న కొవ్వు కరుగుతుంది.

అదే సమయంలో చేతుల మీద బరువు ఉంచడం వల్ల భుజాలు, చేతుల్లోని కండరాలు కూడా బలపడతాయి.




ఉష్ట్రారాసనం


మోకాళ్ల మీద కూర్చుని, నడుము పైభాగాన్ని వెనక్కి విల్లులా వంచాలి.

చేతులను వెనక్కి వంచి, కాలి మడమలను పట్టుకోవాలి.

కాళ్ల మధ్య అడుగు ఎడం ఉండాలి.

వెనక్కి వంగేటప్పుడు నడుము పైభాగంతో పాటు చేతులను కూడా వెనక్కి తీసుకెళ్లాలి.

ఆ ఆసనంతో పొట్ట ప్రదేశంలోని కండరాలు సాగుతాయి.

పొట్ట బిగుతుగా తయారవుతుంది.

పిరుదుల మీద కూడా ఒత్తిడి పడుతుంది.




వశిష్టాసనం


కుడి మోచేయి ఆసరాతో పక్కకు పడుకోవాలి.

కుడి కాలు ముందుకు, ఎడమకాలు వెనుకకు ఉంచాలి.

చేయి మీద బరువు ఉంచి, నడుమును గాల్లోకి లేపాలి.

ఇలా చేస్తున్నప్పుడు మోచేయి, పాదాలు మాత్రమే నేలను తాకి ఉండాలి.

రెండో చేయి నేలమీద ఉంచిన చేతికి సమాంతరంగా గాల్లో లేపి ఉంచాలి.

ఈ భంగిమలో 15 నుంచి 30 సెకన్లపాటు ఉండి, రెండో వైపు చేయాలి.

ఈ ఆసనం కడుపు, వెన్ను, పిరుదులలోని కండరాలకు బలాన్నిస్తుంది.

ఆ ప్రదేశాల్లోని కొవ్వు కరుగుతుంది.




పశ్చిమోత్తాసనం


ఈ ఆసనం సుఖాసనం, పద్మాసనం వేసిన తర్వాత చేయవచ్చు.

నేలమీద కాళ్లు చాపి కూర్చోవాలి.

ముందుకు వంగి రెండు చేతులతో పాదాలను పట్టుకోవాలి.

వంగుతున్నప్పుడే తలను కూడా వంచుతూ, మోకాళ్లకు ఆనించాలి.

ఈ భంగిమలో కనీసం ఒక నిమిషం పాటు ఉండాలి.

ఈ ఆసనం వేయడం వల్ల పొట్ట మీద ఒత్తిడి పడుతుంది.

ఆ ప్రదేశంలోని కొవ్వు కరగడంతో పాటు కటి కండరాలు బలపడతాయి.


Updated Date - 2022-01-04T05:30:00+05:30 IST