నాకు ఢిల్లీ పెద్దల అండ

ABN , First Publish Date - 2022-04-19T08:16:42+05:30 IST

గవర్నర్‌ వ్యవస్థను తేలిగ్గా తీసుకోవద్దని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు.

నాకు ఢిల్లీ పెద్దల అండ

  • రాష్ట్రపతి, ప్రధాని నైతికంగా మద్దతిస్తున్నారు
  • నాపై నమ్మకంతోనే 2 రాష్ట్రాలు అప్పగించారు
  • నన్ను మార్చేస్తారని బెదిరించలేరు
  • ‘గవర్నర్‌’ను తేలిగ్గా తీసుకోవద్దు! 
  • వ్యవస్థను ఎందుకు గౌరవించడం లేదు?
  • ప్రొటోకాల్‌ ఉల్లంఘనలనూ ప్రస్తావించా
  • కాంగ్రెస్‌ నేతలను చేర్చుకొని.. పదవులిస్తున్నారు..
  • వారిపై ఉన్న నమ్మకం ఇతరులపై ఉండదా?
  • ఢిల్లీలో విలేకరులతో ఇష్టాగోష్ఠిలో గవర్నర్‌ తమిళిసై


‘‘నేను బీజేపీ వాళ్లకు సహకరిస్తున్నానని ఊహించుకోవచ్చు. కానీ, అందుకు ఆధారాలు లేకుండా ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు? గతంలో నేను బీజేపీకి చెందిన వ్యక్తినే. దాన్ని ఎవరూ కాదనలేదు. అది నా చరిత్ర. కానీ, ఇప్పుడు కూడా అలాగే ఉంటాననుకుంటే ఎలా? కాంగ్రెస్‌ నేతను టీఆర్‌ఎస్‌లో చేర్చుకొని తక్షణమే అతడ్ని ఎమ్మెల్సీ చేయాలనుకున్నారు. మరి అతన్ని కాంగ్రెస్‌ వ్యక్తిగా ఎందుకు భావించడం లేదు..? అతనిపై ఉన్న నమ్మకం ఇతరుల మీద ఎందుకు లేదు?’’    - తమిళిసై


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): గవర్నర్‌ వ్యవస్థను తేలిగ్గా తీసుకోవద్దని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. ఈ వ్యవస్థను ఎందుకు గౌరవిచండం లేదని ప్రశ్నించారు. ఢిల్లీ పెద్దల మద్దతు ఉంది కాబట్టే తాను బలంగా ఉన్నానని చెప్పారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి నైతికంగా మద్దతిస్తున్నారని తెలిపారు. దేశానికి సేవ చేయడంలో ఎంత మేరకు కట్టుబడి ఉంటారన్న విషయాలను పరిశీలించాకే గవర్నర్‌ పదవికి ఎంపిక చేస్తారన్నారు. సోమవారం ఆమె ఢిల్లీలో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ‘‘నా మీద విశ్వాసం ఉంది కాబట్టే తెలంగాణకు గవర్నర్‌గా, పుదుచ్చేరికి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా నియమించారు. నాయకుల పట్ల నాకు అత్యంత గౌరవం ఉంది. గవర్నర్‌ వారం రోజుల పాటు సెలవు తీసుకోవచ్చు. కానీ, నేను ఎప్పుడూ సెలవు తీసుకోకుండా  పనిచేశా. నా జీవితం పారదర్శకం. నన్ను మార్చేస్తారని (గవర్నర్‌ పదవి నుంచి తప్పించడం) బెదిరించలేరు. నా సమర్థతను, విధులను ఎవరూ ప్రశ్నించలేరు. ఎలా పనిచేయాలో ప్రధాని, కేంద్ర హోం మంత్రి నుంచి నేర్చుకున్నాం. వాటిని ఆచరిస్తున్నాం’’ అని అన్నారు. గవర్నర్‌ను మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్‌ చేసే విషయం తనకు తెలియదని తమిళిసై చెప్పారు.


ప్రొటోకాల్‌ ఉల్లంఘనపై నివేదిక

అఖిల భారత సర్వీసుల అధికారులు ప్రొటోకాల్‌ను ఉల్లంఘించడం పట్ల మీరు చేసిన ఫిర్యాదుపై కేంద్రం నిర్ణయం తీసుకుందా అని విలేకరులు తమిళిసైని అడగ్గా.. ‘‘అన్ని విషయాలను బయటపెట్టలేను. వ్యవస్థ తన పని తాను చేసుకుంటూ పోతుంది. కానీ, చేసిన తప్పులను వారు గ్రహించుకోవాలి. వాళ్లకూ ప్రొటోకాల్‌ తెలుసు. కాబట్టి వాళ్లే సరిదిద్దుకోవాలి. అధికారుల శైలిపై కేంద్రం దృష్టికి తీసుకెళ్లడాన్ని ఫిర్యాదు అనుకోవడానికి లేదు. ప్రతి నెలా కేంద్రానికి నివేదిక అందిస్తుంటా. అందులో ప్రతి విషయాన్నీ ప్రస్తావిస్తా. తొలుత ఈ వ్యవహారాన్ని సీరియ్‌సగా తీసుకోలేదు. కానీ, ఉద్దేశపూర్వకంగా చేస్తుండడంతోనే నెలవారీ నివేదికలో ప్రస్తావించా’’ అని అన్నారు. కేంద్రం ఏమీ చేయదని అనుకోకూడదన్నారు. గవర్నర్‌, సీఎం వ్యవస్థలు పరస్పరం గౌరవించుకోవాలని పేర్కొన్నారు. తాము ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులం కాబట్టి సుపీరియర్‌ అని.. గవర్నర్‌ను కేంద్రం నియమిస్తుంది కాబట్టి సుపీరియర్‌ కాదని, అనుకోవడం సరికాదని సూచించారు. ఎమ్మెల్యేలు మంచి చేస్తే జనం గవర్నర్‌ను ఎందుకు ఆశ్రయిస్తున్నారని ప్రశ్నించారు. బీజేపీకి సహకరిస్తున్నారని టీఆర్‌ఎస్‌ నేతలు చేస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ.. గవర్నర్‌ వ్యవస్థను అవమానించడం సరికాదని, అది ప్రజలకూ మంచిది కాదన్నారు. ప్రతిపక్ష పార్టీలతో పోరాటం చేయాలి కానీ, గవర్నర్‌తో చేయకూడదని సూచించారు. గవర్నర్‌ అన్నింటినీ ఆమోదించాలనేం లేదన్నారు. తనతో ఏదైనా సమస్య ఉంటే సీఎంతో చర్చించడానికి కూడా అభ్యంతరం లేదని ప్రకటించానని గుర్తు చేశారు. మంత్రులు కూడా ఫైల్స్‌తో వచ్చి తనకు పరిస్థితిని వివరించవచ్చునని, గవర్నర్లు రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిచలేరని స్పష్టం చేశారు.


సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేశారు

‘‘సోషల్‌ మీడియాలో నన్ను ట్రోల్‌ చేశారు. తమిళనాడులోని నా పాత వీడియోలను బయటికి తీశారు. ఏ ఎన్నికల్లో గెలవలేదు కాబట్టే గవర్నర్‌ను చేశారని ఓ మంత్రి అన్నారు. ఇవన్నీ మంచి పద్ధతులు కాదు. కొంత మంది సాధారణ ప్రజలు నాకు అండగా నిలబడ్డారు. రాష్ట్ర ప్రభుత్వంతో నాకు ఎలాంటి వ్యక్తిగత శత్రుత్వమూ లేదు. వాళ్లు ఎందుకిలా చేస్తున్నారో అర్థం కావడం లేదు’’ అని అన్నారు.


గిరిజన ప్రాంతాలపై ప్రత్యేక అధికారాలు

గిరిజన ప్రాంతాలపై అన్ని రాష్ట్రాల గవర్నర్లకు రాజ్యాంగం ప్రత్యేక అధికారాలను కల్పించిందని తమిళిసై అన్నారు. నేరుగా పర్యటించవచ్చని, నిధులు విడుదల చేయవచ్చని వివరించారు. భద్రాచలం పర్యటనలో కలెక్టర్‌, ఎస్పీ ఆహ్వానించడానికి రాలేదని, ప్రొటోకాల్‌ను ఉల్లంఘించారని తెలిపారు. గవర్నర్‌ వస్తున్నారంటే అక్కడ భద్రత కల్పించాలని, ఎస్పీనే రాకపోతే ఇక భద్రతాపరమైన ఏర్పాట్లు ఏం చేసినట్లని అడిగారు. తమిళ నూతన సంవత్సర సందర్భంగా పుదుచ్చేరి రాజ్‌భవన్‌ నిర్వహించిన వేడుకలకు అక్కడి ప్రతిపక్ష పార్టీలు హాజరుకాకపోవడంపై స్పందిస్తూ.. ‘‘తమిళనాడు రాజకీయ పరిస్థితుల ప్రభావం పుదుచ్చేరిపై ఉంటుంది. తమిళనాడు గవర్నర్‌ ఏర్పాటు చేసిన వేడుకలకు సీఎం వెళ్లలేదు. డీఎంకే, కాంగ్రెస్‌, వామపక్షాలు   బహిష్కరించాయి. అలాగే, పుదుచ్చేరిలో ప్రతిపక్షాలుగా ఉన్న ఈ పార్టీల నేతలు రాలేదు’’ అని వ్యాఖ్యానించారు. అయితే, తెలంగాణలో అలా బహిష్కరించడానికి కారణమే లేదని స్పష్టం చేశారు. తాను తెలంగాణ వ్యక్తిలాగానే ప్రవర్తిస్తున్నానన్నారు. అహంకారంతో, నిరంకుశంగా వ్యవహరించే మనస్తత్వం కూడా తనది కాదని స్పష్టం చేశారు. కాగా, ధాన్యం కొనుగోలుపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్‌ నేతలు ఇచ్చిన వినతిని సంబంధిత సంస్థకు పంపించానని వెల్లడించారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి చేస్తారన్న ప్రచారంపై స్పందించడానికి నిరాకరించారు. తాను దేన్నీ ఆశించడం లేదని, ఏ పని అప్పగించినా కట్టుబడి పనిచేస్తానని స్పష్టం చేశారు. 


ప్రభుత్వాన్ని రద్దు చేస్తానని అనలేదు

‘‘నేను యథాలాపంగా మాట్లాడిన విషయాలు బయటికి వచ్చాయి. నేను ప్రభుత్వాన్ని రద్దు చేస్తానని ఎక్కడా చెప్పలేదు. ఆర్నెల్ల వ్యవధిలో అసెంబ్లీ సమావేశాలు జరగాల్సి ఉంటుందని చెప్పా. ఈ విషయాన్ని చెబితే గవర్నర్‌ ప్రభుత్వాన్ని పడగొడతానన్నారని ఆరోపణలు చేస్తున్నారు. నేను అప్రజాస్వామిక పనులు చేయను’’ అని తమిళిసై పేర్కొన్నారు. 

Updated Date - 2022-04-19T08:16:42+05:30 IST