మనూ భాకర్‌కు షాకిచ్చిన ఇషా

ABN , First Publish Date - 2022-10-02T09:25:39+05:30 IST

జాతీయ క్రీడల్లో తెలంగాణ క్రీడాకారులు పతకాల మోత మోగిస్తున్నారు. మహిళల 25 మీటర్ల పిస్టల్‌ విభాగంలో భారత స్టార్‌ షూటర్‌, ఒలింపియన్‌ మనూ భాకర్‌కు..

మనూ భాకర్‌కు  షాకిచ్చిన ఇషా

ద్యూతి, హిమాదాస్‌ను వెనక్కినెట్టిన జ్యోతి

జాతీయ క్రీడల్లో తెలుగు క్రీడాకారుల పతకాల మోత

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): జాతీయ క్రీడల్లో తెలంగాణ క్రీడాకారులు పతకాల మోత మోగిస్తున్నారు. మహిళల 25 మీటర్ల పిస్టల్‌ విభాగంలో భారత స్టార్‌ షూటర్‌, ఒలింపియన్‌ మనూ భాకర్‌కు హైదరాబాద్‌ అమ్మాయి ఇషా సింగ్‌ చెక్‌ పెట్టింది. క్వాలిఫయింగ్‌ రౌండ్లు ముగిసేసరికి మనుభాకర్‌ (583)ను వెనక్కి నెట్టిన ఇషా 584 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఇదే జోష్‌ను ఫైనల్‌ రౌండ్‌లోనూ కొనసాగించిన ఇషా 26 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని ఎగరేసుకుపోగా, రిథమ్‌ సంగ్వాన్‌ (హరియాణా) రజతం, అభిదన్య (మహారాష్ట్ర) కాంస్యం సాధించారు. మనుభాకర్‌ 4వ స్థానంతో సరిపెట్టుకుంది. ఇక, రోలర్‌ స్కేటింగ్‌ ఆర్టిస్టిక్‌ కపుల్‌ డ్యాన్స్‌లో తెలంగాణ జోడీ జుహిత్‌, ఖ్యాతి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.


స్ప్రింట్‌లో జ్యోతి సంచలనం:

మహిళల 100 మీటర్ల స్ప్రింట్‌లో విశాఖపట్నం యువ అథ్లెట్‌ ఎర్రాజీ జ్యోతి ఏకంగా స్టార్‌ అథ్లెట్లు ద్యూతీ చంద్‌ (ఒడిశా), హిమాదాస్‌ (అసోం)ను వెనక్కినెట్టి స్వర్ణ పతకంతో సంచలనం సృష్టించింది. జ్యోతి 11.51 సెకన్లలో రేసును ముగించి జాతీయ క్రీడల్లో సరికొత్త రికార్డును నెలకొల్పింది. అర్చన(తమిళనాడు), డైండ్రా(మహారాష్ట్ర) తర్వాతి రెండు స్థానాల్లో నిలిచారు. ద్యూతి (11.69 సె.) 6వ, హిమాదాస్‌ (11.74 సె.) 7వ స్థానాలతో సరిపెట్టుకున్నారు. వెయిట్‌ లిఫ్టింగ్‌ 67కిలోల విభాగంలో గుంటూరుకు చెందిన నీలంరాజు మొత్తం 270 కిలోల బరువెత్తి రజతం అందుకున్నాడు. మహిళల 400 మీటర్ల పరుగులో తణుకుకు చెందిన జ్యోతికశ్రీ 53.30 సెకన్లలో రేసును ముగించి రజతం సాధించింది. ఇక, ఆర్టిస్టిక్‌ రోలర్‌ స్కేటింగ్‌ క్వాడ్‌ ప్రీలో సాయి సంహిత రజతం, అన్మిషా కాంస్యం నెగ్గారు.

Updated Date - 2022-10-02T09:25:39+05:30 IST