వానాకాలం హాయిగా ఉండాలంటే!

ABN , First Publish Date - 2021-07-28T05:37:46+05:30 IST

వానాకాలం మొదలయిందంటే దోమల బెడద ఎక్కువవుతుంది. ముఖ్యంగా దగ్గు, జలుబు, గొంతులో ఇన్ఫెక్షన్‌ లాంటివి ఎక్కువ అవుతాయి.

వానాకాలం హాయిగా ఉండాలంటే!

చినుకులు పడితే ఎక్కడ చూసినా పచ్చదనమే పలకరిస్తుంది. వానమ్మ మట్టిమీద పడినవేళ మనసు పులకరిస్తుంది. అన్నంత మాత్రాన ఇది మన ఒంటికి వర్తించదు. వానలు పడుతుంటే.. పరిసరాలంతా తేమతో పాటు శరీరానికి అలర్జీలు మొదలవుతాయి. వానల్లో హాయి హాయితో పాటు ఆరోగ్యమూ కాపాడుకోవాలి. 


వానాకాలం మొదలయిందంటే దోమల బెడద ఎక్కువవుతుంది. ముఖ్యంగా దగ్గు, జలుబు, గొంతులో ఇన్ఫెక్షన్‌ లాంటివి ఎక్కువ అవుతాయి. వైరల్‌ ఇన్‌ఫెక్షన్లతోనే ఇబ్బంది. అందుకే రోగనిరోధక శక్తిని పెంపొందించే ఆహారాన్ని తీసుకోవాలి. క్రమం తప్పకుండా నీటిని తాగడం, హెర్బల్‌ టీ.. లాంటి తాగడంతో పాటు జంక్‌ఫుడ్‌, ఆయిల్‌ఫుడ్‌కి దూరంగా ఉండాలి. 


మనమాదిరే వర్షాకాలమంటే దోమలకూ, శిలీంధ్రాలు, బాక్టీరియా, వైర్‌సలకూ ఇష్టమే. మలేరియా, డెంగ్యూ.. లాంటివి సులువుగా దోమల ద్వారా వ్యాప్తి చెందుతాయి. నిల్వ ఉంచిన నీరు తాగడం వల్ల కూడా ఇబ్బందే. నిద్రపోయేముందు గోరు వెచ్చని నీటిని తాగటం అలవాటు చేసుకోవాలి. ముసురుపట్టిన రోజుల్లో ఆకుకూరలు, కూరగాయలను బాగా శుభ్రం చేసుకుని తినాలి. వాటిమీద అంటుకున్న బురద అంత సులువుగా పోదు. ముఖ్యంగా అప్పటికప్పుడు వండుకొని వేడివేడిగా భుజించటం ఉత్తమం. తడిబట్టలను వాడటం, బురదలో తిరగడం వల్ల ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లకూ దారితీసే అవకాశాలెక్కువ. మొత్తానికి చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే.. వానాకాలం జాయి జాయినే!

Updated Date - 2021-07-28T05:37:46+05:30 IST