రాష్ట్రపతి ఎన్నిక గురించి..! పోటీ పరీక్షల కోసం!

ABN , First Publish Date - 2022-08-09T21:23:10+05:30 IST

సంప్రదాయ పాలిటీ పుస్తకాల్లో మొదటగా రాష్ట్రపతి టాపిక్‌ను చర్చించిన అనంతరం పార్లమెంట్‌ అనే అంశాన్ని చర్చిస్తారు. ఇక్కడ కొంత భిన్నంగా చర్చిద్దాం. రాష్ట్రపతి ఎన్నికల్లో లోక్‌సభ, రాజ్యసభ, రాష్ట్రాల విధాన సభల సభ్యులు పాల్గొంటారు. కాబట్టి రాష్ట్రపతి

రాష్ట్రపతి ఎన్నిక గురించి..! పోటీ పరీక్షల కోసం!

భారత రాజ్యాంగం - రాజకీయ వ్యవస్థ


సంప్రదాయ పాలిటీ పుస్తకాల్లో మొదటగా రాష్ట్రపతి టాపిక్‌ను చర్చించిన అనంతరం పార్లమెంట్‌ అనే అంశాన్ని చర్చిస్తారు.  ఇక్కడ  కొంత భిన్నంగా చర్చిద్దాం.  రాష్ట్రపతి ఎన్నికల్లో లోక్‌సభ, రాజ్యసభ, రాష్ట్రాల విధాన సభల సభ్యులు పాల్గొంటారు. కాబట్టి రాష్ట్రపతి ఎన్నిక గురించి తెలియాలంటే ఎవరు పార్లమెంట్‌, రాష్ట్ర విధాన సభలకు ఎన్నికైన సభ్యులో తెలవాలి.


అభ్యర్థులు రాష్ట్రపతి అనే టాపిక్‌ను మూడు భాగాలుగా విభజించి చదువుకుంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. 

1) రాష్ట్రపతికి సంబంధించిన ప్రాథమిక సమాచారం

(రాష్ట్రపతి అధికారాల ముందు వరకు ఉన్న సమాచారం).

2) రాష్ట్రపతి సాధారణ అధికారాలు

3) రాష్ట్రపతి అత్యవసర అధికారాలు


రాష్ట్రపతికి సంబంధించి ముఖ్యమైన ఆర్టికల్స్‌

ఆర్టికల్‌ 52: భారతదేశానికి అధిపతిగా రాష్ట్రపతి ఉంటారు.

ఆర్టికల్‌ 53: కేంద్రప్రభుత్వ కార్యనిర్వహణ అధికారాలు

ఆర్టికల్‌ 54: రాష్ట్రపతి ఎన్నిక

ఆర్టికల్‌ 55: రాష్ట్రపతి ఎన్నిక విధానం

ఆర్టికల్‌ 56: రాష్ట్రపతి పదవీకాలం

ఆర్టికల్‌ 57: తిరిగి ఎన్నిక కావడానికి అర్హతలు

ఆర్టికల్‌ 58: రాష్ట్రపతి ఎన్నుకోవడానికి అర్హతలు

ఆర్టికల్‌ 59: రాష్ట్రపతి పదవీ నిబంధనలు లేదా సేవా నిబంధనలు

ఆర్టికల్‌ 60: రాష్ట్రపతి పదవీ ప్రమాణ స్వీకారం

ఆర్టికల్‌ 61: మహాభియోగ తీర్మాన ప్రక్రియ

ఆర్టికల్‌ 62: రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడితే భర్తీ ప్రక్రియ


భారతదేశంలో రాజ్యాంగాధినేత రాష్ట్రపతి. రాజ్యాంగంలో 5వ భాగంలో కేంద్ర కార్యనిర్వాహక వర్గం గురించి తెలియచేసింది.


కేంద్ర కార్యనిర్వాహక వర్గం

1) రాష్ట్రపతి 2) ఉపరాష్ట్రపతి 3) ప్రధానమంత్రి 4) మంత్రిమండలి 5) అటార్నీ జనరల్‌

ఆర్టికల్‌ 52:  భారతదేశానికి ఒక రాష్ట్రపతి ఉంటాడు. దేశంలో పార్లమెంటరీ తరహా ప్రభుత్వం ఉంది కనుక రాష్ట్రపతి కేవలం నామమాత్రపు అధికారి.

  • దేశ ప్రథమ పౌరుడు, రాజ్యాంగ అధిపతి, సర్వసైన్యాధ్యక్షుడిగా రాష్ట్రపతి వ్యవహరిస్తారు.

ఆర్టికల్‌ 54: రాష్ట్రపతి ఎన్నిక అవుతారు(భారతదేశంలో పరోక్షంగా):

ఆర్టికల్‌ 55: రాష్ట్రపతి ఎన్నిక విధానం గురించి తెలియచేస్తుంది. రాష్ట్రపతి ఎన్నికలో ఎలక్ట్రోరల్‌ కాలేజీ సభ్యులు పాల్గొంటారు.


ఎలక్ట్రోరల్‌ కాలేజీలో సభ్యులు

1) ఎన్నికైన లోక్‌సభ సభ్యులు(543)

2) ఎన్నికైన రాజ్యసభ సభ్యులు(233)

3) ఎన్నికైన రాష్ట్రాల విధానసభల సభ్యులు

4) ఎన్నికైన కేంద్రపాలిత ప్రాంతాల విధానసభల సభ్యులు


సభ్యులు కానివారు

1. లోక్‌సభకు నామినేట్‌ అయిన ఇద్దరు ఆంగ్లో ఇండియన్లు

2. రాజ్యసభకు నామినేట్‌ అయిన 12 మంది ప్రముఖులు

3. రాష్ట్రాల విధానసభలకు నామినేట్‌ అయ్యేవారు

4. కేంద్రపాలిత ప్రాంతాల విధానసభలకు నామినేట్‌ అయ్యేవారు

గమనిక: ఢిల్లీ, పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాల విధానసభల సభ్యులు ఎలక్ట్రోరల్‌ కాలేజీ సభ్యులుగా ఉండాలని 1992లో 70వ రాజ్యాంగ సవరణ ద్వారా నిర్ణయించడం జరిగింది.

  • 1995 జూన్‌ 1 నుంచి వీరు ఎలక్ట్రోరల్‌ కాలేజీ సభ్యులుగా కొనసాగుతున్నారు. (1997 రాష్ట్రపతి ఎన్నికల్లో మొదటగా ఓటు వేశారు)
  • ఎన్నిక పద్ధతి (ఆర్టికల్‌ 55)
  • రాష్ట్రపతి ఎన్నికకు రిటర్నింగ్‌ అధికారిగా ఒకసారి లోక్‌సభ సెక్రటరీ జనరల్‌, మరోసారి రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ వ్యవహరిస్తారు.

గమనిక: 1) 1950లో రాజేంద్రప్రసాద్‌ ఎన్నికప్పుడు రాజ్యాంగ పరిషత్‌ కార్యదర్శి హెచ్‌.వి.ఆర్‌.అయ్యంగార్‌ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరించారు.

2. 2012లో రాష్ట్రపతి ఎన్నికలకు రిటర్నింగ్‌ అధికారిగా రాజ్యసభ సెక్రటరీ జనరల్‌- వి.కె.అగ్నిహోత్రి.

3. 2017లో రాష్ట్రపతి ఎన్నికలకు రిటర్నింగ్‌ అధికారిగా లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ - అనూప్‌ మిశ్రా వ్యవహరించారు.

  • రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల చట్టం-1952 ప్రకారం రాష్ట్రపతిని నైష్పత్తిక ప్రాతినిధ్య విధానం ద్వారా ఎన్నుకుంటారు.
  • నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో ప్రతి ఎలక్ట్రోరల్‌ కాలేజీ సభ్యునికి, ఎంతమంది రాష్ట్రపతి పదవికి పోటీచేస్తూ ఉంటే అన్ని ఓట్లు ఉంటాయి. ఈ ఓట్లను ప్రాధాన్య క్రమంలో ఉపయోగించుకోవాలి. ఈ  ఎన్నిక విధానంలో వేర్వేరు ఓటర్లకు వేర్వేరు ఓటు విలువలు నిర్ణయిస్తారు. అవి....
  • ఓటు విలువ వివిధ రాష్ట్రాల్లో ఉండే జనాభా ఆధారంగా ఉంటుంది.
  • ఈ ఓటు విలువను 1971, జనాభా లెక్కల ఆధారంగా పరిగణనలోకి తీసుకోవాలి.
  • 2026 వరకు ఇదే ప్రాతిపదికన ఓటు విలువను అనగా 1971 జనాభా లెక్కల ఆధారంగా లెక్కించాలని 2001లో 84వ రాజ్యాంగ సవరణ చేశారు.
  • ఎమ్మెల్యే, ఎంపీ ఓటు విలువలను లెక్కించడానికి (లెక్కగట్టడానికి) కింది సూత్రాలను అనుసరిస్తారు.

ఎమ్మెల్యే ఓటు విలువ= రాష్ట్ర జనాభా/ ఎన్నికైన ఎమ్మెల్యేల సంఖ్య x 1/1000

ఎంపీ ఓటు విలువ= అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యే ఓట్ల విలువల మొత్తం / ఎన్నికైన ఎంపీల సంఖ్య

  • ఓట్ల లెక్కింపులో ముందుగా ప్రథమ ప్రాధాన్య ఓట్లను లెక్కిస్తారు. ఆ సందర్భంగా ఏ అభ్యర్థికి నిర్ణీత కోటా ఓట్లు(50 శాతం) రాకపోతే ద్వితీయ ప్రాధాన్య ఓట్లను లెక్కిస్తారు.
  • ద్వితీయ ప్రాధాన్య ఓట్లను లెక్కించే ముందు మొదటి రౌండ్‌లో అతి తక్కువ ప్రథమ ప్రాధాన్య ఓట్లు  వచ్చిన అభ్యర్థిని పోటీ నుంచి తప్పిస్తారు. ఈ ప్రక్రియలో చివరి ఇద్దరు అభ్యర్థులు మిగిలే వరకు లెక్కిస్తారు.

గమనిక: నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో ఒక అభ్యర్థి గెలుపొందాలంటే నిర్ణీత కోటా అనగా 50 శాతం కన్నా ఎక్కువ ఓట్లు పొందాల్సి ఉంటుంది.

  • ప్రపంచంలో మొట్టమొదటగా నైష్పత్తిక ప్రాతినిధ్యం పద్ధతిని ప్రస్తావించిన వ్యక్తి డేవిడ్‌ హేర్‌, కనుక దీనిని హేర్‌ పద్ధతి అని కూడా అంటారు.
  • ప్రపంచంలో మొట్టమొదటగా నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి ద్వారా ఎన్నికైన వ్యక్తి డెన్మార్క్‌కు చెందిన ఆండ్రే. ఆందుకే దీనిని ‘ఆండ్రే పద్ధతి’ అని కూడా అంటారు.
  • భారత్‌లో అధ్యక్ష తరహా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలన్నది- కె.టి.షా
  • రాష్ట్రపతిని ప్రత్యక్షంగా ఎన్నుకోవాలని సూచించింది - హెచ్‌.వి.కామత్‌
  • ప్రస్తుతం మన దేశంలో రాష్ట్రపతి ఎన్నిక అయినటువంటి నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతే ప్రత్యక్ష ఎన్నికతో సమానమని పేర్కొన్నది.- డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌.
  • భారతదేశంలో పార్లమెంటరీ తరహా ప్రభుత్వం ఉండాలని ప్రస్తావించింది- డాక్టర్‌ అంబేద్కర్‌, జవహర్‌లాల్‌ నెహ్రూ, సర్దార్‌ వల్లభబాయ్‌ పటేల్‌.

-వి.చైతన్యదేవ్‌

సీనియర్‌ ఫ్యాకల్టీ

Updated Date - 2022-08-09T21:23:10+05:30 IST