జైల్లో చంపాలని..!

ABN , First Publish Date - 2021-12-27T07:55:15+05:30 IST

జైల్లో చంపాలని..!

జైల్లో చంపాలని..!

అంతా పక్కా స్కెచ్‌.. ఇప్పటిదాకా ఎవరికీ చెప్పలేదు

షర్మిల ఏపీకి వస్తే కచ్చితంగా మంచి స్పందన

‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’లో రఘురామరాజు

గుంటూరు ఆస్పత్రిలో పరీక్షలు చేసి నేరుగా జైలుకు తీసుకెళ్లారు

అదేమంటే ‘దిగవోయ్‌’ అంటూ నెట్టేశారు

ఎప్పుడూ లేనిది జైల్లో ఆ రోజే పవర్‌ కట్‌

కటకటాల్లో నుంచి చేతులు పెట్టి.. ఏమైనా చేస్తారని దూరంగా పడుకున్నాను

మర్నాడు ఓ ఖైదీ నాకు నీళ్లు తెచ్చిపెట్టాడు

విడుదలయ్యాక నాకు ఫోన్‌ చేశాడు

బెంగళూరులో జగన్‌ ఇంట్లో చేస్తానన్నాడు

చెక్‌బౌన్స్‌ కేసులో ఆ జైలుకు వచ్చాడట

ఓటీఎస్‌ స్కీంతో కోటి ఓట్లు పోతాయ్‌

వలంటీర్లు రాబందుల్లా పీక్కుతింటున్నారు

ఈ వ్యవస్థను తీసేస్తామన్నవాళ్లు గెలుస్తారు


పక్కా స్కెచ్‌ ప్రకారం.. తనను జైలుకు రప్పించి.. అక్కడ తనను చంపేందుకు కుట్ర జరిగిందని వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అనుమానం వ్యక్తంచేశారు. తాను జైలులో ఉన్నప్పుడు, విడుదలయ్యాక జరిగిన సంఘటనలు బేరీజు వేసి ఈ అభిప్రాయానికి వచ్చారు. జగన్‌ ప్రభుత్వంపై ప్రజల్లో రోజురోజుకూ వ్యతిరేకత పెరుగుతోందని చెప్పారు. ఓటీఎస్‌ స్కీం, వలంటీర్ల వ్యవస్థతో వైసీపీ మునిగిపోవచ్చన్నారు. సీఎం జగన్‌ చెల్లెలు షర్మిల ఆంధ్రప్రదేశ్‌కు రావచ్చని.. ఆమెకు మంచి స్పందన వచ్చే అవకాశముందని అభిప్రాయపడ్డారు. ఆయనతో ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి మేనేజింగ్‌ డైరెక్టర్‌ వేమూరి రాధాకృష్ణ నిర్వహించిన ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’ కార్యక్రమం తుది భాగం..

 వైసీపీ ఎంపీ రఘురామ రాజుతో ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి మేనేజింగ్‌ డైరెక్టర్‌ వేమూరి రాధాకృష్ణ నిర్వహించిన ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’ కార్యక్రమం తుది భాగం... 


మీపై హత్యాయత్నం జరిగిందన్నారు కదా! ఎక్కడ?

ఇది ఇప్పటి వరకూ ఎక్కడా చెప్పని విషయం. ఇప్పుడే చెబుతున్నా. నన్ను జైలుకు తీసుకెళ్లినప్పుడు మేజిస్ట్రేట్‌ రెండు ఆస్పత్రులకు తీసుకెళ్లి రిపోర్టు ఇవ్వమని చెబితే... గుంటూరు ఆస్పత్రిలో పరీక్షలు చేయించి మేజిస్ట్రేట్‌ దగ్గరకు తీసుకెళ్లకుండా నేరుగా జైలుకు తీసుకెళ్లారు. అదేంటి.. ఇక్కడకు తెచ్చారేంటని అడిగితే ’ఏయ్‌ దిగవోయ్‌’ అంటూ నెట్టేశారు. 


అంత రఫ్‌గా మాట్లాడారా?

చాలా నీచంగా! ఇలా మాట్లాడారు అంటే అక్కడొక ఆత్మ.. తాడేపల్లి ఆత్మ పరవశిస్తుందని అలా చూపెట్టారు. 


జైలుకు వెళ్లిన తర్వాత..

జైలుకు వెళ్లాక.. కటకటాలన్నీ కొత్తగా ఉన్నాయి. ‘ఈ గదిలోనే జయదేవ్‌గారిని పెట్టాం. మా జైలులో ఉన్న మంచి రూమ్‌ ఇదే’ అని చెప్పారు. నాకు స్నానం చేయడానికి కుర్చీ కావాలని అడిగాను. నిలబడే, నడిచే పరిస్థితి లేదు కదా! జైలులో ఎప్పుడూ కరెంట్‌ పోదట. కానీ ఆ రోజు పోయింది. జనరేటర్‌ ఎప్పుడూ పని చేస్తుందట! ఆ రోజు పని చేయలేదు. కటకటాలకు దగ్గరగా మంచం వేసుకుని పడుకుందామని అనుకుంటుండగా కరెంట్‌ పోయింది. దాంతో మంచం వెనక్కి లాక్కుని పడుకున్నా. ఇంతలో కరెంట్‌ వచ్చింది. బయట లైట్‌ వేసే ఉంచమని సెంట్రీతో చెప్పి పడుకున్నా. అంతలో మళ్లీ కరెంట్‌ పోయింది. మళ్లీ లేచి మంచాన్ని దూరంగా జరుపుకొన్నా. కటకటాల్లోంచి చేతులు పెట్టి ఏదైనా చేయొచ్చు కదా! తర్వాతి రోజు పొద్దున్నే ఒక ఖైదీ నీళ్లు తెచ్చి ఇస్తే స్నానం చేశాను. నేను బయటకు వచ్చిన నెల తర్వాత ముస్లిం పేరుతో ఉన్న నంబర్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. ఆ నంబరు డీపీ ఏమో జగన్‌ బొమ్మ ఉంది. ఎవరో తిట్టడానికే ఫోన్‌ చేసి ఉంటారని తీయలేదు. అదేపనిగా 20, 30 కాల్స్‌ వచ్చాయి. చివరకు ఫోన్‌ ఎత్తాను. ‘సార్‌ నేను.. మీకు జైల్లో నీళ్లు ఇచ్చాను కదా’ అని పరిచయం చేసుకున్నాడు. నువ్వు జైలుసిబ్బందివా లేక అండర్‌ ట్రయల్‌ ఖైదీవా అని అడిగాను. ‘చెక్‌ బౌన్స్‌ కేసులో నన్ను జైలుకు పంపారు.. మీరు వచ్చేసిన తర్వాత రెండు రోజులకు బయటకు వచ్చాను’ అన్నాడు. ఏం చేస్తుంటావని అడిగాను. బెంగళూరులో జగన్‌ ఇంటిలో పనిచేస్తానని అన్నాడు. అతడు చెప్పింది నిజమో కాదో తెలియదు. కానీ అది వినగానే కళ్లు బైర్లు కమ్మాయి. బెంగళూరులో పనిచేయడం ఏమిటి? గుంటూరులో చెక్‌ బౌన్స్‌ ఏమిటని అడిగాను. ‘అవన్నీ అడగొద్దు సర్‌. మీరంటే నాకు అభిమానం. కొంచెం జాగ్రత్తగా ఉండండి’ అని చెప్పాడు. నన్ను ఫలానా తారీఖున అరెస్టు చేసి ఇక్కడకు పంపాలని ముందుగానే స్కెచ్‌ వేసుకున్నారు. నన్ను జైలుకు పంపడానికి రెండ్రోజుల ముందే అతడిని జైలుకు పంపడం అనుమానాస్పదంగా ఉంది. ఆ తర్వాత అతను నాకు టచ్‌లో లేడు. నంబర్‌ కూడా మార్చినట్లు ఉన్నాడు. 


ఇది నిజమైతే మీ ఆయువు గట్టిదే!

నిజానికి నన్ను కొట్టినప్పుడే.. నాలుగున్నర నెలలు ముందే హార్ట్‌సర్జరీ అయింది. ఒక కానిస్టేబుల్‌ కొద్దిసేపు గుండెల మీదే కూర్చున్నాడు. ఎక్కువసేపు కూర్చుంటే అప్పుడే పోయేవాడినేమో! తెల్లారేసరికి పోతానని కూడా అనుకుని ఉండొచ్చు. 


ఈ మొండితనం ఎక్కడ నుంచి వచ్చింది?

చిన్నప్పటి నుంచే ఉంది. నన్ను అవమానించినా సర్దుకోవచ్చు. కానీ చంద్రబాబు కాదు.. అంతకంటే కష్టపడే వాళ్లు వచ్చినా బాగు చేయలేని పరిస్థితికి వెళ్లిపోతుంది. కనీసం ప్రజలను చైతన్యం చేయాలి.. కాష్ఠం రగులుతోంది... జాగ్రత్తగా ఉండాలని చెబితే ఒకరోజు కాకుంటే రెండో రోజయినా అర్థం చేసుకుంటారని ప్రయత్నం. 


జగన్‌ నైజం.. ఆయనకు దక్కిన అపరిమితమైన అధికారం.. ఇలాంటి శక్తిమంతుడిని ఎదుర్కోవడం ఆషామాషీ కాదు కదా! ఈ దెబ్బలు తిన్న తర్వాత ఏదైనా ఒక పాయింట్‌ ఆఫ్‌ టైంలో ఎవడికీ పట్టనిది మనకెందుకని అనిపించలేదా?

ఒక్క సెకనుకూడా అనిపించలేదు. దీనికిముందు పార్లమెంట్‌లో మిత్రులు కూడా ఎందుకురా బాబూ.. నువ్‌ ఏంచేసినా ఐదేళ్లు ఇతడే అధికారంలో ఉంటాడు కదా.. ఉపయోగం ఏముంది అని చెప్పినోళ్లు ఉన్నారు. కానీ ఒకటే జన్మ సర్‌. మంచో చెడో ఒకసారి ప్రజలకు సేవ చేయాలని వచ్చాం. వెనక్కి వెళ్లే ప్రశ్నే లేదు.


మిమ్మల్ని పచ్చి బూతులు తిడుతుంటారు.. విగ్గు రాజు అంటుంటారు కదా!

పొట్టిగా ఉన్నవాడు హీల్‌ వేసుకుంటాడు. జుట్టు తగ్గినోడు కొంచెం ప్యాచ్‌ వేసుకుంటారు. హీల్‌ వేసుకుంటున్నాడని అతడిని నేను పొట్టివాడు అంటున్నానా?


మళ్లీ సీఎం దగ్గరకు వెళ్లారా?

నేను అతడి పేరు ఎత్తలేదు కదా!


తిట్ల ఫోన్లు ఎత్తడం మానేశారా? ఇంకా కాల్స్‌ వస్తున్నాయా?

ఇప్పుడు తగ్గినయ్‌. ఇలా చెబితే మళ్లీ కొత్త ఎసైన్‌మెంట్స్‌ ఇస్తారేమో! అయితే నా రోజువారీ వీడియోల కింద వ్యతిరేక కామెంట్లు పెట్టేవారు కదా! వాటికి కామెంట్‌కి రూ.పదో, ఎంతో ఇస్తారట. నన్ను ప్రేమించే వాళ్లు పెరిగి.. ఆ తిట్టేవాళ్లని తిరిగి తిడుతుంటే ఇప్పుడు వాళ్లు వెనక్కితగ్గారట. ఇప్పుడు వ్యతిరేక కామెంట్లు బాగా తగ్గాయి. గతంలో గుడ్డిగా ప్రేమించిన వాళ్లకు కూడా కనువిప్పు కలుగుతోంది. హార్డ్‌కోర్‌ వైఎస్‌ గ్రూపుల్లో వేసిన వ్యతిరేక కామెంట్లు తగ్గాయి. అంటే ప్రజల్లో మార్పు వస్తోంది.


వీరిపై స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు కదా! చర్యలు తీసుకుంటున్నారా?

కొంచెం ఆలస్యమైనా చర్య మాత్రం ఉంటుంది. ప్రధానికి లేఖ రాసిన తర్వాతే విజయసాయి రెడ్డికి పిలుపు వచ్చింది. నేను రెండు లేఖలు రాశాను. ఆ లేఖల తర్వాత అమిత్‌ షాను కలవాలని నాకు సందేశం వచ్చింది. ఇంకా హోం మంత్రిని కలవలేదు. విజయసాయిరెడ్డి మాత్రం ఒక ఫొటో దిగి వచ్చారు. కేవలం 3నిమిషాల్లోనే ప్రధానిని కలిసి బయటకు వచ్చేశారని అక్కడి వారు చెప్పారు. రాష్ట్ర సమస్యలు ఏదో చర్చించామని కహానీలు చెబుతున్నారు. చెన్నారెడ్డి అమెరికా వెళ్లినప్పుడు నల్లపురెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆస్పత్రిలో ఉన్నారు. ‘ఆస్పత్రిలో ఉన్న నల్లపురెడ్డిని అమెరికా నుంచి పరామర్శించిన చెన్నారెడ్డి’ అని వార్త వచ్చింది. అప్పుడు ‘ఏం ఒళ్లెలా ఉంది..’ అని చెన్నారెడ్డి అన్నట్లు ఒక కార్టూన్‌. అలాగే పిలిచి వార్నింగ్‌ ఇచ్చి పంపిస్తే విజయసాయిరెడ్డి కూడా బయటకు వచ్చి అది చర్చించాం.. ఇది చర్చించామని చెబుతుంటారు. 


వైసీపీలో చేరి గెలిచినందుకు మీరు పశ్చాత్తాపపడుతున్నారా? మీకు టికెట్‌ ఇచ్చినందుకు జగన్‌ పశ్చాత్తాపపడుతున్నారా?

ఇద్దరిలో ఉందనుకుంటున్నా. నేనయితే పశ్చాత్తాపపడుతున్నా. ఆయనలో కూడా అంతకుమించి ఉంది. అందుకే నన్ను అనర్హుడిని చేయమని ఒత్తిడి చేస్తున్నారు కదా! నేను పార్టీని ప్రేమించినంత కాలం అది జరగదు. ఒకసారి నన్ను వాళ్లు బహిష్కరిస్తే ఇక నాకు ప్రేమించే హక్కు ఉండదు కదా! 


మీపైనా కేసులున్నాయి.. జగన్‌ కేసులపై మాట్లాడే అర్హత ఏముందని ప్రశ్నిస్తున్నారు కదా!

ఎన్నికలకు ముందు నాపై రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. చార్జిషీట్లు కూడా వేయలేదు. ఒక కేసులో తమిళనాడు ప్రభుత్వంతో నాకు ఫైట్‌ జరిగింది. నాకు పేమెంట్‌ రాకుండా స్టాలిన్‌ ప్రభుత్వంపై వీళ్లు ఒత్తిడి తెస్తున్నారు. 


మీరు ఎంతో ప్రేమించే పార్టీ అధ్యక్షుడి బెయిల్‌ రద్దు చేయాలని ఎందుకు పిటిషన్‌ వేశారు?

తొందరగా కడిగిన ముత్యంలా బయటకు వచ్చేయొచ్చు కదా! అందరూ దొంగ దొంగ అని తిడుతుంటే నా మనసు చివుక్కుమంటోంది. దాన్ని వదిలించేసుకుని బయటకు వస్తే బావుంటుంది కదా!


ఎవరు ఎన్నన్నా జనం ఆయనకే ఓట్లు వేశారు కదా!

ప్రజాస్వామ్యంలో ఓట్లు వేస్తే కేసులు తీసేయొచ్చంటే ఇబ్బందే లేదు. కానీ అలా లేదు కదా!  


మీ పార్టీకి నష్టం జరుగుతుందన్న బాధను పార్టీ గౌరవాధ్యక్షురాలి దృష్టికి తీసుకెళ్లారా?

లేదు. కానీ ఆమె దృష్టికి తీసుకెళ్లడం మంచిదే. మంచి సలహా ఇచ్చారు. ప్రయత్నం చేస్తాను. ఆమె సమయం ఇస్తే చెబుతా. 


షర్మిల తన అన్నతో విభేదించి తెలంగాణలో పార్టీ పెట్టారు కదా!

ఆమె మాట్లాడే మాటలన్నీ మా పార్టీకి తీరని నష్టం చేస్తున్నాయి. అదేదో సినిమాలో డైలాగ్‌ మాదిరి ఆమె కేసీఆర్‌ను తిడుతుంటే అవన్నీ మా ముఖ్యమంత్రినే తిడుతున్నట్లు ఉంది. వరి విషయంలో.. ఉద్యోగాల విషయంలో..! 


మీ అంచనా ప్రకారం షర్మిల తన స్టీరింగ్‌ ఏపీ వైపు తిప్పే అవకాశం లేదంటారా?

ఆ రోజు దూరంలో లేదనుకుంటున్నా. న్యాయంగా మాట్లాడుకోవాలంటే స్టార్టింగ్‌లో ఏదో మేనేజ్‌ చేశారు. ఇప్పుడు నంబరు రెండు మూడొందలకు పడిపోయింది. ఇవే నినాదాలతో జస్ట్‌ ఫొటో మార్చుకుని ఏపీకి వస్తే కచ్చితంగా మంచి స్పందన వస్తుంది. అదే జరిగితే మా పార్టీ దెబ్బతింటుంది కాబట్టి షర్మిల రాకూడదని కోరుకుంటున్నా. 


కోడి పందాలకు సొంతూరు వెళ్లే పరిస్థితి లేదు కదా? ఎలా?

ఇంకా సమయం ఉంది కదా చూద్దాం. ఆ టైంకు మంచి రోజు వస్తుందని ఆశ. లేదు. ఈసారి పంజాబ్‌ ఫ్రెండ్స్‌ రమ్మంటున్నారు. కోళ్లు తీసుకురండి.. ఇక్కడ పందాలు వేద్దాం అంటున్నారు. అక్కడ పెట్టినా మా వాళ్లు ప్రత్యేక విమానాలు వేసుకుని వచ్చేస్తారు. 


మీ ఉద్దేశంలో అమరావతి పరిస్థితి ఏమిటి?

ఎవరెన్ని వృథా ప్రయత్నాలు చేసినా అమరావతి రాజధానిగా ఉంటుంది. 


బీజేపీ పెద్దలకూ అదే అభిప్రాయం ఉందా?

ఉంది. గతం సంగతి నాకు తెలియదు. అమరావతే రాజధానిగా ఉండాలని వాళ్లకు ఉంది. మా ముఖ్యమంత్రి కూడా కాలం సాగదీయడం కోసం మళ్లీ బిల్లు తేవడం వంటి చేస్తారు. లక్ష కోట్ల పరిహారం ఇచ్చే పరిస్థితి లేదు. ప్రాంతీయ ద్వేషాలు రెచ్చగొట్టడం.. చిచ్చు పెట్టడం నాకు ఇష్టం లేదు అన్నాడు.. ఆ మేరకు అక్కడేదో పురుషోత్తంరెడ్డి... ఆ రెడ్డి, ఈ రెడ్డి కులాలకతీతంగా ఐదుగురు రెడ్లు అక్కడ మీటింగ్‌ పెట్టి ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొడుతూ శ్రీశైలానికి భూమి ఇచ్చింది మన రాయలసీమ అంటారు. శ్రీశైలానికి 70 శాతం భూమి ఇచ్చింది తెలంగాణలోని మహబూబ్‌నగర్‌. త్యాగం అంటే మాది.. అమరావతి వాళ్లది ఏం త్యాగం అంటారు వాళ్లు. 


పురుషోత్తంరెడ్డి తన వెనుక జగన్‌ ఉన్నాడని చెప్పారు కదా!

అంటే ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టడం. ఇక మా సీఎం ఉద్దేశం ఏమిటంటే వచ్చే ఎన్నికల వరకూ దీనిని ఇలాగే ఉంచి ప్రాంతీయ విద్వేషాలతో ముందుకు పోదామని అనుకుంటున్నారు. మీకు రాజధాని ఇస్తామంటే చంద్రబాబు అడ్డుకుంటున్నాడని విశాఖ ప్రజలకు చెప్పి నమ్మించవచ్చని అనుకుంటే బూమరాంగ్‌ అవుతుంది. అలాగే మళ్లీ కొత్త ప్రభుత్వం వచ్చే వరకూ మనకు రాజధాని ఉండదు. ఇక వలంటీర్‌ వ్యవస్థ లేని, అమరావతి రాజధానిగా ఉండే రాష్ట్రం త్వరలో వస్తుందనేది నా విశ్వాసం. మా ముఖ్యమంత్రి ఉండగా ఏ రాజధానీ ఉండదు. ఈయన కలలుగన్న విశాఖలో కుప్పకూల్చిన రుషికొండ గుహల్లో ఏదైనా గృహం నిర్మించుకుని ఉండొచ్చేమో!


అప్పుడు అధికారంలోకి వచ్చే పార్టీలోకి వెళ్తారా? ఢిల్లీలో జాతీయ పార్టీని నమ్ముకుంటారా?

ఢిల్లీలో జాతీయ పార్టీ నాయకులను నేను నమ్ముతా. ఇక్కడ మా పార్టీ మళ్లీ గెలవదని నమ్ముతున్నా.


మీరు ఆ పార్టీలో ఉండరు కదా!

ఇప్పుడు ఉన్నాం కదా! వీళ్లు బహిష్కరిస్తే ఉండననుకోండి. 


కొట్టినప్పుడు బాగా ఏడ్చారా?

బాగా కేకలు వేశాను. పాదాల మీద కొడుతుంటే బుర్రలో వెయ్యి ఓల్టుల షాక్‌ కొట్టినట్లు అయింది. తర్వాత రోజు డాక్టర్‌ వచ్చారు. నా కాళ్లు వాచిపోయి ఉన్నాయి. బీపీ చూసి 165/110 అన్నారు. అయితే 120/80 అని రాశారు. అదేంటి.. ఇలా రాశారని అడిగితే... అలాగే రాయమన్నారని చెప్పాడు. సరే.. నా కాళ్లు వాచిపోయాయి దాన్ని రిపోర్ట్‌ చేయమని అడిగాను. అది నేను రాయకూడదని చెప్పిన వైద్యుడు.. మీకు ఒక సలహా.. కాళ్లలో ఉన్న బ్లడ్‌ క్లాట్స్‌ చాలా డేంజర్‌.. అవి పైకి వెళ్తాయి.. దానివల్ల హార్ట్‌ అటాక్‌ రావొచ్చని చెప్పారు. అంతా బావుందని రిపోర్టు ఇవ్వమని వార్నింగ్‌ ఇచ్చి పంపారని వైద్యుడు చెప్పారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండని సలహా ఇచ్చారు. 

ఇంట్లో వాళ్లు భయపడటం లాంటివి వున్నాయా?

చాలా భయం. నన్ను ఇప్పుడు హైదరాబాద్‌ కూడా రావొద్దన్నారు.

జగన్‌తో మనకెందుకు అని చెప్పలేదా?

మనుషులతో అయితే డీల్‌ చేయొ టచ్చు. మనుషులు కానివారితో ఎందుకని అందరూ చెప్పారు.


మీ అంచనా ప్రకారం ఆంధ్రలో రాజకీయ పరిస్థితులు మారుతున్నాయా?

రోజు రోజుకూ ప్రజల్లో ప్రభుత్వ పనితీరుపై వ్యతిరేకత పెరుగుతోంది. ఓటీఎస్‌ అనే నిర్బంధ గృహ హక్కు పథకంతో ప్రజలు ప్రాణాలు తీసుకునే పరిస్థితి వచ్చింది. చంద్రబాబు, పవన్‌లలో ఎవరైనా ముందుగా.. తాము అధికారంలోకి వస్తే ఈ వలంటీర్‌ వ్యవస్థను తీసేస్తా అంటే వారు గెలిచి కూర్చుంటారు. వలంటీర్లు రాబందుల్లా మారి పీక్కుతింటున్నారు. తక్కువకు పని చేయడానికి వాళ్లేమైనా రూపాయి జీతానికి పనిచేసే జగన్మోహన్‌రెడ్డి కాదు కదా! ఆయన జీతం రూపాయి తీసుకుంటున్నా.. 200 కోట్ల రూపాయల యాడ్స్‌ తన సొంత పత్రిక సాక్షికి ఇచ్చుకున్నారు కదా! రాష్ట్రంలో టైంకి అవుతున్న బిల్లులు ఏవైనా ఉన్నాయంటే సాక్షికి ఇచ్చే ప్రకటనల బిల్లులు మాత్రమే. ఆ ఒక్క పత్రికకు యాడ్స్‌ బిల్లులు ఠంచన్‌గా పడిపోతున్నాయి. ఇక రంగుల పిచ్చి ఉన్మాదం! ఒక మంత్రి స్కూల్‌లో కార్యక్రమానికి వెళ్తే పిల్లలకు రంగులు వేశారు. రేపు కేబినెట్‌కు మంత్రులంతా రంగులు వేసుకుని రావాలంటే అలాగే వస్తారు. త్వరలో బూతులు తిట్టే నేతలకు బూతురత్న, బూతుశ్రీ వంటి అవార్డులు కూడా ఇచ్చేస్తారు. ఏదోక తెల్లవారుజామున ఆయనకు ఒక ఐడియా వస్తుంది.. అమలు చేసేస్తారు. 


ఓటీఎస్‌ ముంచేస్తుందంటారు?

ఇది ఆత్మహత్యాసదృశం. డబ్బుకు ఆశపడి వలంటీర్లు.. అద్దెకు ఉండే వాడిపేరుతో డబ్బులు కట్టించుకుని వారికి రిజిస్ట్రేషన్లు చేస్తామని చెబుతున్నారు. రేపు ఇంటి యజమాని తెలుసుకునే నాటికి అద్దెకున్న వాడి పేరుతో రిజిస్ట్రేషన్‌ అయిపోతుంది. రాష్ట్రంలో దొంగల మాదిరి ప్రజలను దోచేస్తున్నారు. ఈ సీఎం పరిపాలనా విధానం వల్ల సర్వనాశనం కాబోతోంది నేను ప్రేమించే పార్టీ. ఈ ఓటీఎస్‌ వల్ల దాదాపు కోటి ఓట్లు పోయినట్లే! పోయిన ఎన్నికల్లో మాకు వచ్చిన మెజారిటీ 30 లక్షల ఓట్లే. ఇక ఉద్యోగులకు గతంలో అడిగిన వెంటనే సీఎం సమయం ఇచ్చేవారు. ఈ ప్రభుత్వంలో అరచి మొత్తుకున్నా పలికేవాడు లేడు. ఉద్యోగుల విషయంలో వీరికి తగిన శాస్తి జరిగిందని ప్రజల్లో కొంత ఉంది. ఉద్యోగుల్లో కూడా అసంతృప్తి ఉంది. వీరి ఓట్లు దాదాపు 13 లక్షలు. ఇవన్నీ కలిపి ప్రజల్లో  తిరుగుబాటు రావడం ఖాయం.

Updated Date - 2021-12-27T07:55:15+05:30 IST