Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రియురాలిని మెప్పించాలని...

- ప్రియుడి చోరీల బాట

- వైన్‌షాప్‌లో దొంగతనం కేసులో ముగ్గురి అరెస్ట్‌ 

- 48 గంటల్లో కేసును ఛేదించిన రాజాం పోలీసులు

రాజాం రూరల్‌, డిసెంబరు 1: ఓవైపు వ్యసనాలు... మరోవైపు ప్రియురాలి మెప్పు పొందాలనే ప్రయత్నంతో అడ్డదారులు తొక్కాడు ఓ వ్యక్తి. గతంలో పనిచేసిన చోటనే చోరీకి ప్రణాళిక సిద్ధం చేశాడు. మరో ఇద్దరిని భాగస్వాములను చేసుకున్నాడు. పక్కా ప్రణాళికతో ముగ్గురూ కలిసి సుమారు రూ.7లక్షలు చోరీ చేశారు. ఈ నగదుతో ఊరు దాటి.. సరదాగా గడుపుదామనుకున్నారు. కానీ.. చివరకు పోలీసులకు చిక్కారు. రాజాంలోని వైన్‌షాప్‌లో చోరీ జరిగిన 48 గంటల్లోనే పోలీసులు కేసును ఛేదించారు. నిందితుల నుంచి సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి.. బుధవారం శ్రీకాకుళంలోని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ అమిత్‌ బర్దర్‌ వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం చినగుబడ గ్రామానికి చెందిన వాండ్రాసి వెంకటరమణ రాజాంలో నివసిస్తున్నాడు. స్థానిక వస్త్రపురి కాలనీలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో పని చేసేవాడు. అక్కడ మానేసిన తరువాత అప్పుడప్పుడు శ్రీకాకుళం రోడ్‌లోని ప్రభుత్వ మద్యం దుకాణంలో నైట్‌వాచ్‌మెన్‌గా పని చేసేవాడు. ఒకవైపు వ్యసనాలకు బానిసవడం... మరోవైపు ప్రియురాలి మెప్పు కోసం సులభంగా డబ్బు సంపాదించాలని భావించిన వెంకటరమణ శ్రీకాకుళం రోడ్‌లోని ప్రభుత్వ మద్యం దుకాణంలో చోరీకి ప్రణాళిక వేశాడు. గతనెల 26, 27, 28 తేదీల్లో మద్యం విక్రయించిన నగదు దుకాణంలో ఉందని తెలుసుకున్నాడు. డోలపేటలో నివాసం ఉంటున్న రేగిడి మండలం దేవుదళకు చెందిన కెంబూరి రాంబాబు, సంతకవిటి మండలం బొద్దూరు ఎస్సీ కాలనీకి చెందిన రేగిడి దామోదరరావులకు ఈ విషయం చెప్పాడు. వారిని ఈ చోరీలో భాగస్వాముల్ని చేశాడు. ముగ్గురూ కలిసి నవంబరు 28న వైన్‌షాప్‌ వద్ద నైట్‌డ్యూటీ చేస్తున్న నెట్టి సూర్యనారాయణతో మాటామాటా కలిపారు. సీసీ కెమెరాలు ఉన్నాయి, పడుకోమని అతనికి సలహా ఇచ్చారు. అర్ధరాత్రి దాటిన తరువాత దుకాణం పైభాగం నుంచి లోపలికి దిగి రూ.6,97,750 చోరీ చేశారు. వెంకటరమణ తన వద్ద రూ.5,77,750 ఉంచుకుని... రాంబాబుకు రూ.లక్ష, దామోదరరావుకు రూ.20వేలు అందజేశాడు. ఈ చోరీపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేస్తున్న విషయాన్ని తెలుసుకుని రాజాం నుంచి ఉడాయించాలని ప్రయత్నించారు. ఈ క్రమంలో బుధవారం డోలపేటలో పోలీసులకు చిక్కారు. వీరి వద్ద నుంచి నగదుతో పాటు మూడు సెల్‌ఫోన్లు, ఒక మోటార్‌ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. చోరీ కేసుకు 48 గంటల్లో ఛేదించిన పోలీసులను ఎస్పీ అమిత్‌ బర్దర్‌ అభినందించారు. ఇన్‌చార్జి డీఎస్పీ జి.శ్రీనివాసరావు, సీసీఎస్‌ డీఎస్పీ జి.వెంకటేశ్వరరావు, సీఐ ఎస్‌.ఆదాం, రాజాం సీఐ పప్పల శ్రీనివాసరావుకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. సమావేశంలో ఏఎస్పీ టీపీ విఠలేశ్వరరావు, పాలకొండ డీఎస్పీ ఎం.శ్రావణి  పాల్గొన్నారు. 

Advertisement
Advertisement