పని లేకుండా జీతాలెందుకు?

ABN , First Publish Date - 2022-01-19T07:49:27+05:30 IST

పనిలేకుండా ఖాళీగా ఉన్న ప్రభుత్వ అధికారులకు జీతాలు ఎందుకని హైకోర్టు మంగళవారం ప్రశ్నించింది.

పని లేకుండా జీతాలెందుకు?

రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన  హైకోర్టు 


హైదరాబాద్‌, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): పనిలేకుండా ఖాళీగా ఉన్న ప్రభుత్వ అధికారులకు జీతాలు ఎందుకని హైకోర్టు మంగళవారం ప్రశ్నించింది. ప్రభుత్వ అధికారులను ఖాళీగా ఉంచడం వల్ల ప్రజాధనానికి తీవ్రనష్టం వాటిల్లుతోందని ఆగ్రహం వ్యక్తంచేసింది. పని చేయించకుండా అధికారులకు పూర్తిస్థాయి జీతాలు ఎలా ఇస్తారని ప్రశ్నించింది. పోస్టింగ్‌లు లేకుండా ఎంతమంది అధికారులు ఖాళీగా ఉన్నారో జాబితా సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాంటి పోస్టింగ్‌లు ఇవ్వకుండా జీతాలు చెల్లిస్తూ ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగిస్తున్నారని పేర్కొంటూ సికింద్రాబాద్‌ తిరుమలగిరికి చెందిన విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి బొందిలి నాగధర్‌ సింగ్‌ (73) సెప్టెంబర్‌ 2020లో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై చీఫ్‌ జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్‌ అభినందన్‌కుమార్‌ షావిలి నేతృత్వంలోని ధర్మాసనం తాజాగా మరోసారి విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఎం.వెంకన్న వాదనలు వినిపిస్తూ.... ప్రజాధనం వృథాను అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని పేర్కొన్నారు.


రెవెన్యూ శాఖలోని భూపరిపాలన కమిషనర్‌ పరిధిలో, అలాగే ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖలో ఎంతమంది ఉద్యోగులు ఖాళీగా ఉన్నారో వివరిస్తూ జాబితాను హైకోర్టుకు సమర్పించారు. ఎలాంటి పని చేయించుకోకుండా పూర్తిస్థాయి జీతాలు చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా ప్రభుత్వం వెయిటింగ్‌ జాబితాలో ఉంచుతుందని, తద్వారా తన ఉత్తర్వులను తానే ఉల్లంఘిస్తోందని పేర్కొన్నారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. ఎంతమంది అధికారులు పోస్టింగ్‌లు లేకుండా వెయింటింగ్‌ జాబితాలో ఉన్నారో జాబితా సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వారి సేవలను వినియోగించుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో కౌంటర్‌లో వివరించాలని పేర్కొంది.


ఈ పిటిషన్‌లో ఎన్నిసార్లు అవకాశం ఇచ్చినా కౌంటర్‌ దాఖలు చేయనందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) తమ ఎదుట వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. వచ్చే విచారణ నాటికి కౌంటర్‌ దాఖలు చేస్తే వ్యక్తిగత హాజరు నుంచి సీఎస్‌ మినహాయింపు పొందవచ్చని తెలిపింది. ఈ ఆదేశాలను సీఎ్‌సకు స్వయంగా తెలియజేయాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది హరేందర్‌ పర్షద్‌ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 14కు వాయిదా వేసింది.

Updated Date - 2022-01-19T07:49:27+05:30 IST