Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

అప్పుల నుంచి బయటపడేందుకు!

twitter-iconwatsapp-iconfb-icon

వైద్యుడి కిడ్నాప్‌నకు యత్నం

జిమ్‌ లీజుకు తీసుకున్న వ్యక్తే సూత్రధారి

మరో ముగ్గురితో ప్రణాళిక

రూ.50 లక్షలు డిమాండ్‌ చేయాలని ప్లాన్‌

లేదంటే హత్య చేయాలని నిర్ణయం

బెడిసి కొట్టిన వ్యూహం

ఇద్దరి అరెస్టు.. మరొకరి పరారీ

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, ఆగస్టు 17: వారిద్దరూ వ్యాపారంలో నష్టపోయారు. అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఎలాగైనా బయటపడాలనుకున్నారు. సులువుగా ధనవంతులు అయిపోవాలని ప్లాన్‌ వేశారు. తెలిసిన వైద్యుడ్ని కిడ్నాప్‌ చేసి డబ్బులను డిమాండ్‌ చేయాలని ప్రణాళిక రచించారు. దీనికోసం మరో ఇద్దరి సాయం తీసుకున్నారు. ఇందుకు రూ.5 లక్షల డీల్‌ కుదుర్చుకున్నారు. అనుకున్నట్లు ప్లాన్‌ అమలు చేశారు. అయితే ఇది బెడిసి కొట్టి కటకటాల పాలయ్యారు. శ్రీకాకుళం నగరంలో ఈ నెల 10న జరిగిన ఓ ప్రైవేట్‌ వైద్యుడి కిడ్నాప్‌ యత్నం మిస్టరీ వీడింది. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను శ్రీకాకుళం డీఎస్పీ మహేంద్ర మంగళవారం విలేఖర్లకు వెల్లడించారు. శ్రీకాకుళం కిమ్స్‌ ఆసుపత్రిలో డాక్టర్‌గా గూడేన సోమేశ్వరరావు 11 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. అతను ఆస్పత్రికి ఎదురుగానే ఇల్లు కట్టుకున్నాడు. కింది అంతస్తులో బ్లిస్‌ పేరిట జిమ్‌ను ఏర్పాటు చేశాడు. దీన్ని శ్రీకాకుళం నగరానికి చెందిన ఉర్జాన చంద్రరావు (చందు) అనే వ్యక్తికి లీజుకు ఇచ్చాడు. చంద్రరావు జిమ్‌తో పాటు ట్రావెల్స్‌ వ్యాపారం నిర్వహించి నష్టపోయాడు. ఈ నేపథ్యంలో గోలి రవితేజ అనే వ్యక్తి జిమ్‌కు వచ్చేవాడు. ఆయన కూడా ఇసుక, లాజిస్టిక్స్‌, షిప్పింగ్‌, మైనింగ్‌ వ్యాపారాల్లో నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. చంద్రరావు, రవితేజ విలాసవంతమైన జీవితాలకు అలవాటుపడినవారే. వారి ఆలోచనలను ఒకరికొకరు పంచుకునేవారు. ఇద్దరూ వ్యాపారాలు చేసి నష్టాల్లో కూరుకుపోవడంతో కిడ్నాప్‌నకు వ్యూహరచన చేశారు. డాక్డర్‌ సోమేశ్వరరావును ఎంచుకొని కిడ్నాప్‌ చేయాలని నిర్ణయించుకున్నారు. విశాఖకు చెందిన రాజా, పెందుర్తికి చెందిన పరమేష్‌ల సహకారం తీసుకున్నారు. వారితో రూ. 5లక్షలకు డీల్‌ కుదుర్చుకున్నారు. ఈనెల 7, 8, 9 తేదీల్లో రెక్కీ నిర్వహించి సోమేశ్వరరావు కదలికలను పసిగట్టారు. శ్రీలక్ష్మీ శ్రీనివాస్‌ ఫంక్షన్‌ హాల్‌ వద్ద ఉదయం గంటపాటు షటిల్‌ ఆడేందుకు సోమేశ్వరరావు వెళ్తారని తెలియడంతో ప్రణాళికను అమలు చేశారు. సోమేశ్వరరావును కిడ్నాప్‌ చేసి రూ.50 లక్షలు డిమాండ్‌ చేద్దామని, డబ్బులు ఇవ్వకుంటే హత్య చేసేయాలని నిర్ణయానికి వచ్చారు. ఇందుకోసం మారుతీ ఎర్టిగా వీడీఐ సుపీరియర్‌ తెల్లటి కారు (ఏపీ30ఏక్యూ 3768)ను తీసుకుని... ఆ వాహనాన్ని ఎవరూ గుర్తించకుండా నంబర్‌ ప్లేటును (ఓఆర్‌02 బీఈ 4616)గా మార్చేశారు.  ఈ నెల 10వ తేదీ ఉదయం షటిల్‌ ఆట ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు సోమేశ్వరరావు ఇంటి మెట్లు దిగుతున్నాడని తెసుకున్న చంద్రరావు ఫోన్‌లో రవితేజకు సమాచారం ఇచ్చాడు. అక్కడే మాటువేసి ఉన్న రవితేజ, రాజు, పరమేష్‌లు సోమేశ్వరరావు తలపై టీషర్టుతో ముసుగు వేసేసి కారులో ఎక్కించి కిడ్నాప్‌ చేసేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో పెనుగులాట జరిగింది. సోమేశ్వరరావు బిగ్గరగా అరవడంతో చుట్టుపక్కల వారు గుమికూడారు. దీంతో భయపడి అక్కడనుంచి రవితేజ, రాజు కారు ఎక్కి తప్పించుకున్నారు. పరమేష్‌ను  స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సోమేశ్వరరావు  ఫిర్యాదు మేరకు రెండోపట్టణ పోలీసులు కేసు నమోదు చేసి తమదైన శైలిలో పరమేష్‌ను విచారణ చేపట్టారు. దీంతో కిడ్నాప్‌ వ్యవహారం బట్టబయలైంది. రవితేజ,  చంద్రరావు  విజయాదిత్య పార్క్‌ వద్ద ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు వెళ్లి వారిని అరెస్టు చేశారు. రాజు పరారీలో ఉన్నాడు.  కిడ్నాప్‌ కోసం ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. వారం రోజుల వ్యవధిలో నిందితులను పట్టుకున్నామని, ఈ కేసులో చొరవ చూపిన పోలీసులను డీఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో టూటౌన్‌ సీఐ ఈశ్వర్‌ప్రసాద్‌ పాల్గొన్నారు. 

 Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.