ఆ లోటు పూడ్చేందుకే...

ABN , First Publish Date - 2022-08-04T05:50:32+05:30 IST

కొన్నిటికి మినహా చాలా రకాల జన్యు వ్యాధులకు ఇప్పటి వరకు సరైన చికిత్సా విధానం లేదు. ఆ లోటును భర్తీ చేసి... సమస్యకు పరిష్కారం దిశగా మరో అడుగు...

ఆ లోటు పూడ్చేందుకే...

కొన్నిటికి మినహా చాలా రకాల జన్యు వ్యాధులకు ఇప్పటి వరకు సరైన చికిత్సా విధానం లేదు. ఆ లోటును భర్తీ చేసి... సమస్యకు పరిష్కారం దిశగా మరో అడుగు ముందుకు వేశారు డాక్టర్‌ ప్రతిమా చౌదరి మావిళ్లపల్లి. సరికొత్త ‘జీన్‌ థెరపీ’ విధానాన్ని అభివృద్ధి చేసి... వైద్య శాస్త్రంలో మరో అధ్యాయానికి నాంది పలికారు. ‘యూనివర్సిటీ కాలేజీ ఆఫ్‌ లండన్‌’లో ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఈ తెలుగు డాక్టర్‌... ‘నవ్య’తో తన పరిశోధన, నేపథ్యం గురించి వివరించారు... 


‘‘నేను ఉస్మానియా మెడికల్‌ కాలేజీ విద్యార్థిని. అక్కడే ఎంబీబీఎస్‌, ఎండీ పూర్తి చేశాను. రెండేళ్లు హైదరాబాద్‌లో పనిచేశాను. 1998లో యూకే వెళ్లాను. ప్రస్తుతం యూకేలోని ‘యూనివర్సిటీ కాలేజీ ఆఫ్‌ లండన్‌’ (యూసీఎల్‌)లో ప్రొఫెసర్‌గా చేస్తున్నాను. అలాగే ‘ది యునైటెడ్‌ కింగ్‌డమ్‌ హిమోఫిలియా సెంటర్‌ డాక్టర్స్‌ ఆర్గనైజేషన్‌’కు చైర్‌పర్సన్‌ని కూడా! ఈ పదవి అలంకరించిన తొలి తెలుగు వ్యక్తిని నేనే. అన్నిటికంటే యూకేలో శిక్షణ పూర్తి అయ్యాక కన్సల్టెంట్‌ అయిన సందర్భం నా కెరీర్‌లోనే గుర్తిండిపోయే మధుర జ్ఞాపకం. 


ఎంతో వ్యత్యాసం... 

నేను హైదరాబాద్‌లో పనిచేసిన రోజుల్లో ఎక్కువగా ఫ్యామిలీ డాక్టర్ల కాన్సెప్ట్‌ ఉండేది. జనరల్‌ ఫిజీషియన్‌ అనేవారు. ఆయన చెబితేనే స్పెషలిస్ట్‌ దగ్గరకు వెళ్లేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. జనరల్‌ ఫిజీషియన్లు తగ్గిపోయారు. మన దగ్గర ఆరోగ్య రంగం అమెరికా తరహాలో ఉంటుంది. వినియోగదారుడే రారాజు అనే విధానం అన్నమాట. యూకేలో ప్రభుత్వం ఖర్చులు భరిస్తుంది కాబట్టి జనరల్‌ ఫిజీషియన్‌ దగ్గరకు వెళతారు. అక్కడ జనరల్‌ ప్రాక్టీషనర్‌ అంటాం. తను చేయాల్సింది చేశాక ఫలితం లేకపోతే అప్పుడు స్పెషలిస్ట్‌ దగ్గరకు వెళ్లమని సిఫారసు చేస్తారు. హీమోఫీలియా లాంటి అరుదైన వ్యాధుల్లో మాత్రం జనరల్‌ ఫిజీషియన్‌వల్ల కాదు. అప్పుడు స్పెషలిస్ట్‌ దగ్గరకు పంపుతారు. అలాంటి వాటికి హాస్పిటల్‌లోనే చికిత్స అందించాల్సి ఉంటుంది. యూకే ఆరోగ్య వ్యవస్థలో మాది ఒక ముఖ్యమైన విభాగం. అమెరికాలో కూడా ఇలాగే ఉంటుంది. వాళ్లకి ఇన్‌స్యూరర్‌ అని ఉంటారు. ప్రాథమిక ఆరోగ్య అంశాలపైన వారు జాగ్రత్తలు తీసుకుంటారు. ధూమపానం, మధుమేహం లాంటి  వ్యాధులపై పేషంట్లకు చికిత్స అందిస్తారు. ఈ విధానంలో ఐడెంటిఫికేషన్‌ అనేది చాలా మెరుగ్గా ఉంటుంది. అక్కడ ప్రభుత్వం దీన్ని తమ బాధ్యతగా భావిస్తుంది. యూకేలోని మొత్తం హెల్త్‌కేర్‌ రంగంలో ప్రైవేట్‌ వాటా ఐదు శాతం మాత్రమే. 


పరీక్షలు చౌక... 

భారత్‌లో రోగ నిర్ధారరణ పరీక్షలు చాలా చౌక. ఉదాహరణకు ఇండియాలో ఎంఆర్‌ఐ స్కాన్‌కు మహా అయితే రూ.5వేలు తీసుకుంటారు. అదే యూకేలో అయితే దానికి 20 రెట్లు, అమెరికాలో 50 రెట్లు ఎక్కువ. అయితే మన ఆర్థిక పరిస్థితులకు తగినట్లు భారత్‌లో ఏ మోడల్‌ సరైందనే విషయంలో స్పష్టత లేదు. ప్రజారోగ్యంపై ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలు మన దగ్గర చాలా తక్కువ.


కష్టపడతారు కానీ... 

భారతీయుల్లో ప్రజల్లో కష్టపడే తత్వం ఎక్కువ. కానీ ఏదైనా రూల్‌ పెడితే మాత్రం దాన్ని ఎలా ఉల్లంఘించాలా అని ఆలోచిస్తారు. భారత్‌తో పోలిస్తే యూకేలో టీమ్‌ వర్క్‌కు ప్రాధాన్యం ఇస్తారు. బృందంలోని సభ్యులకు మర్యాద ఇస్తారు. ప్రభుత్వం ఏదైనా కొత్త చట్టం తెస్తే ప్రజలు దాన్ని కచ్చితంగా పాటిస్తారు. తప్పించుకోవడానికి అడ్డదారులు వెతకరు. 


ముందడుగు...  

కెరీర్‌లో నేను సాధించిన అతిపెద్ద విజయం... తాజాగా కనిపెట్టిన ‘జీన్‌ థెరపీ’ విధానం. ఇప్పటికీ మనం హీమోఫోలియా (రక్తస్రావ వ్యాధి) లాంటి కొన్నిటికి మాత్రమే జీన్‌ థెరపీలో చికిత్స అందించగలుగుతున్నాం. ఇంకా చాలా జన్యు వ్యాధులకు ఈ విధానంలో సరైన చికిత్స అందుబాటులోకి రాకపోవడం పెద్ద లోటు. మేం అభివృద్ధి చేసిన జీన్‌ థెరపీ విధానం ఆ లోటును పూరిస్తుంది. ఈ పరిశోధనలో ప్రొఫెసర్‌ అమిత్‌ నట్వాని మందు తయారు చేశారు. క్లినికల్‌ ట్రయల్స్‌ విభాగంలో నేను వర్క్‌ చేస్తున్నాను. ల్యాబ్‌లో చేసిన మెడిసిన్‌ ప్రయోగించాక పేషంట్లను పర్యవేక్షించడం, ఎలాంటి ఫలితాలు వస్తున్నాయనే దాన్ని మేం అధ్యయనం చేస్తాం.’’

సివిఎల్‌ఎన్‌ ప్రసాద్‌


జీన్‌ థెరపీ.. ఇలా... 

మొదట పరిశోధనాలయంలో కృత్రిమంగా ఒక వైర్‌సను సృష్టిస్తాం. దాని బాహ్యరూపం అసలైన వైర్‌సను పోలి ఉండేలా తయారు చేస్తాం. దానిలోపల మిస్సింగ్‌ జీన్‌ను పెడతాం. దాన్ని ఇంజెక్షన్‌లాగా ఇస్తే కాలేయంలోని మాతృ కణంలోకి చేరుతుంది. అక్కడ మేం రూపొందించిన ‘ట్రాన్స్‌ జీన్‌’ డిపాజిట్‌ అవుతుంది. మన శరీరంలోనే ఒక ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం లాంటిది ఇది. ఇతర జన్యు వ్యాధులను బట్టి ఈ మిస్సింగ్‌ జీన్‌ను గుండెలో, కండరాల్లో, లివర్‌ లాంటి ఏ అవయవంలో ఉంచాలో నిర్ణయిస్తారు. ఉదాహరణకు హీమోఫోలియా పేషంట్లనే తీసుకోండి. ఏదైనా గాయం అయినప్పుడు కొంత రక్తం బయటకు పోయి గడ్డకట్టదు. వెంటనే చికిత్స అందకపోతే చనిపోయే ప్రమాదం ఉంటుంది. రక్తాన్ని గడ్డకట్టించే జన్యువు లోపించడమే దీనికి కారణం. అదే జీన్‌ థెరపీలో సంబంధిత జన్యువు కాపీని లివర్‌లో ప్రవేశపెడతాం. ఇది పదేళ్ల వరకూ పనిచేస్తుంది. మానవ శరీరంలో తమ విధులను నిర్వర్తించని జన్యువులను వాటి విధ్యుక్త ధర్మాన్ని నిర్వర్తించేలా చేయడమే జీన్‌ థెరపీ. మేం కనిపెట్టిన విధానం ముఖ్యంగా హీమోఫోలియా చికిత్సకు సమర్థవంతంగా పని చేస్తుంది. 


వెనకబడి ఉన్నాం...

భారత్‌లోనూ కొన్ని జీన్‌ థెరపీ ప్రొగ్రామ్స్‌ను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. అయితే పాశ్చాత్య దేశాలతో పోలిస్తే మనం కొంచెం వెనుకబడి ఉన్నాం. జీన్‌ థెరపీలో పలు రకాలు ఉన్నాయి. అవసరమైన జన్యువును కాలేయంలో ప్రవేశపెట్టడం ఒక పద్ధతి. లెంగ్తీ వైరస్‌ అనే మరో విధానంలో అబ్‌నార్మల్‌ జీన్‌ను క్రోమోజోముల్లో ప్రవేశపెడతాం. అలా చేసినప్పుడు కేన్సర్‌ రిస్క్‌ ఎక్కువ. రీప్లే్‌సమెంట్‌ థెరపీతో పోల్చితే భారత్‌లో జనాభాకు జీన్‌ థెరపీ చాలా చౌక, సులభంగా అందుబాటులో ఉంటుంది. రీప్లే్‌సమెంట్‌ థెరపీ బాగా ఖర్చుతో కూడుకున్నది. జీన్‌ థెరపీ చికిత్స విధానం ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. చాలా జన్యు వ్యాధుల చికిత్సకు సంబంధించి ఇదొక ఆరంభం మాత్రమే. భారత్‌లో కొన్ని జన్యువ్యాధులు చిన్న వయసులోనే వస్తున్నాయి. చిన్న వయసులోనే మధుమేహం బారిన ఎందుకు పడుతున్నారనేది జన్యు చికిత్సలో పరిశోధన చేసేదాకా మనం ఇంకా రాలేదు. ఇలాంటి చిన్న చిన్న వ్యాధులకు జీన్‌ థెరపీలో చికిత్స అందించగలిగితే భవిష్యత్తులో పెద్ద వ్యాధులకు కూడా చేసే అవకాశం కలుగుతుంది.  


Updated Date - 2022-08-04T05:50:32+05:30 IST