వైఫల్యం నుంచి దృష్టి మళ్లించేందుకే...

ABN , First Publish Date - 2021-05-04T09:31:24+05:30 IST

తెలంగాణ రాష్ట్రంలో రోజుకు 10వేల వరకూ కేసులు బైటపడుతున్నాయి. ప్రజలు భయాందోళనలలో కూరుకుపోయి ఉన్నారు...

వైఫల్యం నుంచి దృష్టి మళ్లించేందుకే...

తెలంగాణ రాష్ట్రంలో రోజుకు 10వేల వరకూ కేసులు బైటపడుతున్నాయి. ప్రజలు భయాందోళనలలో కూరుకుపోయి ఉన్నారు. ఆసుపత్రులు, బెడ్స్, ఆక్సిజన్ సిలెండర్లు, మందులు, ఇంజక్షన్లు, టీకాల కొరత తీవ్రంగా ఉంది. పేద, మధ్యతరగతి కుటుంబాల ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీకి బలైపోతున్నారు. మందుల బ్లాక్ మార్కెట్ విస్తరిస్తున్నది. ఇటువంటి విపత్కర పరిస్థితిలో ఏ ప్రభుత్వమైనా ఏమి చేయాలి? ముఖ్యమంత్రితో సహా మొత్తం ప్రభుత్వం, అధికార యంత్రాంగాన్ని అన్ని స్థాయిల్లో సమాయత్తం చేసి కరోనా నుంచి ప్రజలను కాపాడడానికి యుద్ధం ప్రకటించాలి. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నది. ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వంలో మరో కీలక మంత్రిగా ఉన్న ఆయన కుమారుడికి కరోనా సోకి పదిహేను రోజుల పాటు ఐసోలేషన్‍లో ఉన్నారు. గత ఏడేళ్ళుగా మొత్తం నిర్ణయాలన్నీ ప్రగతి భవన్ కేంద్రంగా సాగడం వల్ల, మిగిలిన కాబినెట్ కూడా ప్రజలకు బాధ్యత పడ్డానికి సిద్ధంగా లేదు. ఈటల రాజేందర్ ఆరోగ్యమంత్రిగా ఎంతో కొంత ప్రజలకు అందుబాటులో ఉన్నప్పుడు కూడా స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోలేని ఆయన పరిస్థితిని ప్రజలు గమనించారు. ఇప్పుడు ఆయన బర్తరఫ్ అయ్యారు. 


ఎన్నికల విజయాలు అహంభావాన్ని పెంచితే, ప్రజల బాధలు కనపడవు. స్వంత రాజకీయ ప్రయోజనాలు, అందుకు అవసరమైన ఎత్తుగడలు, ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడం, ప్రజల హక్కులను హరించడం, ప్రజా సంఘాలను నిషేధించడం, మీడియాను మేనేజ్ చేయడం, ప్రజాస్వామిక పాలనా స్వభావాన్ని కోల్పోయి రాచరిక పద్ధతుల్ని అనుసరించడం... ఒక్క మాటలో రాష్ట్రంలో శ్మశాన నిశ్శబ్దాన్ని సృష్టించడం, స్వంత స్వర్గంలో సేద దీరడం అన్నది తెలంగాణ పాలకులను చూస్తే కనిపిస్తుంది. 


ఇటీవల 16 ప్రజా సంఘాలను నిషేధించడానికి వీలుగా జీవో జారీ చేయడం, తాజాగా ఆరోగ్య శాఖా మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ భూకబ్జాలకు పాల్పడ్డాడనే ఆరోపణలు వస్తే, ఎప్పుడూ లేనంత వేగంగా ఉన్నత స్థాయి విచారణ ఒక్క రోజులోనే పూర్తి చేసి, ఆయనను ఆ బాధ్యతల నుండి తప్పించడం, మొత్తం మీడియా సంస్థలను ఇందుకు పురమాయించి ప్రజల దృష్టిని మళ్ళించడం ఈ రాజకీయ ప్రక్రియలో భాగమే. 


తెరాస అధినేతల్లో ఈ అహంభావానికి కారణం వివిధ ఎన్నికలలో ప్రజలు ఓట్లు వేసి గెలిపించడం. అయితే తెరాసకు లభిస్తున్న విజయాలను చూసి, ప్రజలు కే‌సీఆర్ పాలనా సరళిని ఆమోదిస్తున్నారని అనుకోవడం భ్రమ మాత్రమే. ఎం‌ఎల్‌సి ఎన్నికలు, నాగార్జున సాగర్ ఉప ఎన్నికలలో విజయాలు ఎన్నికల పోల్ మెనేజ్మెంటుకు సంబంధించిన విజయాలే తప్ప, కేసీఆర్‌ పాలనా తీరుకు లభించిన మద్దతు కాదు. కానీ సాధారణగా ఎన్నికలలో పొందే ప్రతి విజయమూ పాలకులలో ప్రజల పట్ల బాధ్యతను పెంచకపోగా, వారిని మరింత నిరంకుశంగా మారుస్తుందని అనేక సార్లు ఋజువు అయింది. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్‌ విషయంలోనూ అదే జరుగుతున్నది. 


సాధారణంగా పాలకులు ప్రజా పక్షపాతులను, రాజకీయ ప్రతిపక్షాన్ని రకరకాలుగా బలహీన పరచాలని ప్రయత్నం చేస్తారు. వీలైనంత వరకూ ఎదుటి వారిని నయానో భయానో తమలో కలిపేసుకోవడం ఒక పద్ధతి. పదవులూ, ఆర్థిక ప్రలోభాలూ ఇందుకు ఉపయోగపడతాయి. గత ఏడు సంవత్సరాలుగా కేసీఆర్‌ ఈ విషయంలో పూర్తిగా విజయవంతమయ్యారనే చెప్పాలి. ఎదుటి పక్షంలో పోరాడే వాళ్ళు లేకుండా బలహీనపరిస్తే, అధికారాన్ని ప్రశ్నించే వాళ్ళు మిగలరు. నిబద్ధత లేని కళాకారులను, వెన్నుముక లేని మీడియా సంస్థలను, కొందరైనా ‘‘ప్రజాపక్ష’’ మేధావులను తమ శిబిరంలో ఉంచుకోవడం కూడా ఈ ధోరణిలో భాగమే. కానీ ప్రలోభాలకు లొంగకుండా, పాలకుల ప్రజా వ్యతిరేక స్వభావాన్ని ఎండగట్టేవారి పట్ల మరింత ద్వేషంతో వ్యవహరిస్తూ, వారిని కూడా బలహీన పరిచే వైఖరి రెండవది. ప్రజా సంఘాలపై నిషేధం, ప్రజల పౌర హక్కుల అణచివేత, ప్రజా సంఘాల కార్యక్రమాలపై ఆంక్షలు, చివరికి ప్రొఫెసర్ కోదండరామ్ లాంటి వాళ్ళతో అధికార పార్టీ వ్యవహరించిన తీరు - ఇవన్నీ ఇదే కోవలోకి వస్తాయి. ఇక మూడవ ధోరణి స్వపక్షంలోనే తమకు పక్కలో బల్లెంలా మారుతారు అనుకునే వారి పట్ల మరింత అనుమానం, అసహనం వ్యక్తం చేయడం. తాజాగా ఈటల రాజేందర్ పట్ల కేసీఆర్ వ్యవహరించిన తీరు దీనినే సూచిస్తుంది. చాలా కాలంగా కొంత మందిలో నివురు గప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి, పెరిగి తమ దహిస్తుందనే భయం కూడా ఇందులో కనిపిస్తోంది.


ఈటల రాజేందర్ విషయంలో వ్యక్తం అవుతున్న స్పందనలు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. పాలకులు మొదటిసారి ఇలా వ్యవహరించారన్నట్లుగా అతి స్పందనలు ఎంత తప్పో, ఏ సమస్య గురించి ఈ వివాదం మొదలైందో దాని గురించి ఏ మాత్రం స్పందించకుండా కేవలం కేసీఆర్‌ మీద ద్వేషంతో మాత్రమే ఈటలకు మద్దతుగా స్పందిస్తే అంతే తప్పు. దీనివల్ల సాధారణ ప్రజలకు ఉపయోగమేమిటి? 


గత ఏడేళ్ళుగా ఈటల తెరాస పాలనలో ముఖ్యమైన భాగస్వామి. ప్రభుత్వం తీసుకున్న అన్ని ముఖ్యమైన నిర్ణయాలలో భాగస్వామి. ప్రభుత్వ పెద్దలు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతుంటే వ్యతిరేకించకపోగా మౌనంగా చూసిన వ్యక్తి. మొత్తం రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతున్నా కారణాలను మాత్రం ప్రజలకు బయటకు చెప్పని ఆర్థిక మంత్రి. కేసీఆర్‌ ప్రభుత్వం ప్రజలపై హింస ప్రయోగిస్తూ ఎన్కౌంటర్లకు పాల్పడుతూ హక్కులను హరిస్తూ ఉంటే, ముఖ్యంగా నేరెళ్ళ దళితులపై, ఖమ్మం రైతులపై, ఆదిలాబాద్ ఆదివాసీలపై దాడులు చేస్తుంటే- ప్రజాస్వామిక విధ్యార్థి ఉద్యమాల నుంచి వచ్చినప్పటికీ వాటికి వ్యతిరేకంగా ఒక్క రోజు కూడా నిరసన వ్యక్తం చేయని మనిషి. మరీ ముఖ్యంగా రైతాంగ పోరాటాల గడ్డ నుండి ఎదిగి వచ్చి లక్షలాదిమంది కౌలు రైతులను గుర్తించి సహాయం చేయడానికి కేసీఆర్ నిరాకరిస్తుంటే ప్రశ్నించని వ్యక్తి. 


ఇప్పుడు కూడా హక్కులు కోల్పోతున్న ప్రజల గురించి మాట్లాడినందుకు ఈటలకూ, కే‌సీఆర్‌కూ తగాదా రాలేదు. తన ఆస్తులను, కోళ్ళ వ్యాపారాన్ని పెంచుకోవడానికి భూములను (కబ్జా చేసినా, కొనుక్కున్నా) సంపాదించుకుంటున్న క్రమంలో ఇబ్బందులలో ఇరుక్కున్న వ్యక్తి. సోషల్ మీడియా రాతల్లో కొంతమంది ఈటల రాజేందర్‌ను ప్రజల పక్షాన పోరాడిన వీరుడిగా, దొరలను ఎదిరించిన బలహీన వర్గాల ప్రతినిధిగా కీర్తించి, ఆయనకు జరిగిన అన్యాయానికి అండగా నిలబడాలని పిలుపునివ్వడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. నిజంగా ఎవరమైనా నిలబడి పోరాడవలసినది హక్కులు కోల్పోతున్న ప్రజల పక్షాన. దానికి ఓపిక, త్యాగాలు అవసరం అవుతాయి. అది వదిలి పెట్టి కేసీఆర్‌ను దించడానికి ఒక ఆయుధం దొరికినట్లుగా ఊహించుకుని, మార్క్స్, అంబేడ్కర్ నేర్పిన ప్రశ్నించే తత్వాన్ని, సైద్ధాంతిక స్పష్టతను కోల్పోయి ఊగిపోవడం చూస్తుంటే ఒక రకం నియంతృత్వానికి బదులు మరో రకాన్ని గద్దెనెక్కించేందుకు ఉవ్విళ్ళూరుతున్నట్లుగా భావించాలి. 


బలమైన ప్రజా శత్రువును గద్దె దించడానికి ప్రజా ఉద్యమాన్ని బలంగా ఎలా నిర్మిస్తామన్నది ప్రజా పక్షపాతుల ఎజెండాగా ఉండాలి. అంతే తప్ప, మనకు ఇష్టంలేని వాళ్ళను ఎవరైతే ఎన్నికలలో ఓడించగలుగుతారని భావిస్తామో వాళ్ళకు మద్దతివ్వడం అంటే, ప్రజా చైతన్యాన్ని కేవలం ఓట్లకూ ఎన్నికలకూ కుదించి వాడుకోవాలని చూడడమే. డెభై ఏళ్లుగా జరుగుతున్న తంతు ఇదే. దాని వల్ల ప్రజలకు ఏమైనా ఒరిగిందా నిజంగా?  


ఇప్పుడైనా ఈటల రాజేందర్ గత ఏడేళ్ళ పాలనలో వ్యక్తమైన ప్రజా వ్యతిరేక నిర్ణయాల పట్ల తన క్షమాపణను వ్యక్తం చేయడమో, ప్రగతి భవన్ కేంద్రంగా జరిగిన అవినీతిని బట్టబయలు చేయడమో, స్వంత వ్యవహారంలో ఏదైనా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడి ఉంటే అంగీకరించడమో జరగాలి. ప్రజా పక్షపాతులు ఎవరైనా అదే అడగాలి. లేకపోతే ఎప్పటికప్పుడు కొత్త పాలక వర్గ ప్రతినిధులు ముందుకు వచ్చి టేకెన్ ఫర్ గ్రాంటెడ్‌‍గా ప్రజలను మరోసారి మోసం చేయడానికి సిద్ధమవుతూనే ఉంటారు. 


ఈటల రాజేందర్ విషయంలో అన్నిటికంటే ముఖ్యంగా చేయాల్సింది- ఈ ఎపిసోడ్‌లో ముందుకు వచ్చిన భూమి సమస్యను ఎజండా మీదకు తెచ్చి లోతుగా చర్చించడం. అసైన్డ్ భూములను ఎవరు కబ్జా చేసినా వాటిపై సమగ్ర విచారణ చేసి, వాటిని నిజంగా భూమిలేని పేదలకు తిరిగి ఇప్పించడం. ప్రజా సంఘాల కార్యకర్తలు, దళిత బహుజన సమూహాల కార్యకర్తలం అందరం పెడ ధోరణులకు గురికాకుండా ప్రజలను చైతన్యవంతులుగా చేయడానికి ప్రయత్నం చేద్దాం. 

కన్నెగంటి రవి (రైతు స్వరాజ్య వేదిక)


Updated Date - 2021-05-04T09:31:24+05:30 IST