చలో చలో రిజిస్ర్టేషన్‌కు

ABN , First Publish Date - 2022-01-29T06:09:21+05:30 IST

భూముల రిజిస్ట్రేషన్ల ధరలు ఫిబ్రవరి నెల మొదటి వారంలో పెరుగుతాయన్న సమాచారంతో రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు జనం పరుగులు పెడుతున్నారు.

చలో చలో రిజిస్ర్టేషన్‌కు
నల్లగొండ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సందడి

ఫిబ్రవరిలో పెరగనున్న భూమి మార్కెట్‌ విలువ

ధరలు అప్‌లోడ్‌ చేసేందుకు సర్వర్‌ నిలిపివేస్తారనే ప్రచారం

రిజిస్ట్రార్‌, తహసీల్దార్‌ కార్యాలయాల వద్ద బారులు తీరుతున్న ప్రజలు

కానరాని కొవిడ్‌ నిబంధనలు

మౌలిక సదుపాయాలు సైతం కరువు

ఉమ్మడి జిల్లాలో వారంలో రూ.115కోట్ల ఆదాయం



(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, నల్లగొండ) /యాదాద్రి, చౌటుప్పల్‌టౌన్‌: భూముల రిజిస్ట్రేషన్ల ధరలు ఫిబ్రవరి నెల మొదటి వారంలో పెరుగుతాయన్న సమాచారంతో రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు జనం పరుగులు పెడుతున్నారు. ఓపెన్‌ ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ ధరలు వంద శాతం పెరుగుతాయన్న ప్రచారంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. మంచిరోజు, ముహూర్తంతో సంబంధం లేకుండా ధరలు పెరగకముందే రిజిస్ట్రేషన్‌ చేయించాలని కార్యాలయాల బాటపడుతున్నా రు. సాధారణ రోజుల్లో రోజుకు 100 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు కొనసాగే కార్యాలయాల్లో తాజాగా ఆ సంఖ్య 500కు పెరిగింది. ప్రజలు రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు పోటెత్తుతుండటంతో కొవిడ్‌ నిబంధనలు, భౌతికదూరం కన్పించడం లేదు. కార్యాలయాల్లో అవసరానికి తగ్గట్టు కంప్యూటర్లు, సిబ్బంది లేకపోవడంతో అర్ధరాత్రి వరకు రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. ఉదయం 10 గంటల నుంచే జయం క్యూలైన్‌లో నిల్చుంటుండగా, సాయంత్రం వరకు కూడా క్యూ తగ్గడం లేదు. కార్యాలయాల వద్ద కనీస సౌకర్యాలైన తాగునీరు, కుర్చీలు లేకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



భూముల ధరలను సవరించిన ప్రభుత్వం, ఫిబ్రవరి మొదటి వారం లో అమలులోకి తేనుంది. దీనికి సంబంధించిన కసరత్తు తుది దశకు చేరింది. దీనికి తోడు జనవరి మాసం చివరి రెండు రోజుల్లో సర్వర్‌ను డౌన్‌ చేసి కొత్త ధరలను అప్‌లోడ్‌ చేస్తారని, పాత రేట్లు కొన్ని గంటల వరకే అందుబాటులో ఉంటాయనే ప్రచారం జోరుగా సాగడంతో కార్యాలయాల కు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. ధరల అదనపు భారాన్ని తగ్గించుకునేందుకు కొనుగోలుదారులకు ఎన్ని ఇబ్బందులున్నా రిజిస్ట్రార్‌ ఆఫీసులకు భారీగా తరలివస్తున్నారు. ప్రస్తుతం కొవిడ్‌ వ్యాప్తి విస్తృతం కాగా, మరోవైపు నగదు చేతిమార్పిడి తగ్గింది. అయినా అందినచోట డబ్బులు సంపాదించి ప్రజలు రిజిస్ట్రేషన్లకు మొగ్గుచూపుతున్నా రు. ఫిబ్రవరి మొదటి తేదీ నుంచి కమర్షియల్‌, ఓపెన్‌ ప్లాట్ల రిజిస్ట్రేషన్ల ధరలు 100శాతం పెరుగుతాయని ప్రచారం కొనసాగుతుండటంతో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు జనం తో కిటకిటలాడుతున్నాయి. రిజిస్ట్రేషన్ల క్రమంలో అమ్మకందారులు, కొనుగోలు దారుల మధ్య నగదు లావాదేవీలు భారీగా ఉంటున్నాయి. దీంతో బ్యాంకులు సైతం ప్రజలతో కిక్కిరిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తం 15 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉండగా,ఇళ్లు,ఇళ్ల స్థలాలు, అపార్ట్‌మెంట్లు, కమర్షియల్‌ కాంప్లెక్స్‌లు, ఇతర చరాస్తుల రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నా యి. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలోని 71 తహసీల్దార్‌ కార్యాలయాల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. వారం రోజుల క్రితం వరకు ఉమ్మడి జిల్లాలో నిత్యం 1000కి పైగా డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్‌ ఉండేవి. కాగా, ప్రస్తుతం రోజుకు 1950పైగా డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. ఆరు రోజుల్లో ఉమ్మడి జిల్లాలో రూ.115కోట్లకు పైగా ఆదాయం రిజిస్ట్రేషన్ల శాఖకు సమకూరింది. ధరల పెంపుదల తేదీపూ అఽధికారికంగా ప్రభుత్వం నుంచి ప్రకటన లేకున్నా ప్రజలు ఆందోళనతో స్లాట్‌ బుకింగ్‌ చేసుకుంటున్నారు. గతంలో భువనగిరిలో రోజుకు 40రిజిస్ట్రేషన్లు కొనసాగగా, తాజా వాటి సంఖ్య 85కు పెరిగింది. చౌటుప్పల్‌లో సాధారణ రోజుల్లో 30 కిగాను ప్రస్తుతం 150, యాదగిరిగుట్టలో 60కి గాను 85, బీబీనగర్‌లో 30కు గాను ప్రస్తుతం రిజిస్ట్రేషన్ల సంఖ్య 80కి పెరిగింది. సూర్యాపేట, హుజూర్‌నగర్‌,మిర్యాలగూడ, నిడమనూరు రిజిస్ట్రార్‌కార్యాలయాలతోపా టు, తహసీల్దార్‌ కార్యాలయాల వద్ద సైతం ఇదే పరిస్థితి ఉంది.


కనీస సౌకర్యాలు కరువు

భూమి కొనుగోలు చేసే ప్రతీవ్యక్తి రిజిస్ట్రేషన్‌ చార్జీల రూపంలో లక్షల రూపాయలు ప్రభుత్వానికి చెల్లిస్తున్నారు. అయితే కొనుగోలుదారులు కార్యాలయానికి వస్తే ఎలాంటి సౌకర్యాలు లేవు. కొవిడ్‌ విస్తృతంగా వ్యాపిస్తుండగా కొనుగోలుదారులు భౌతికదూరం పాటించేలా కార్యాలయ సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవడం మరిచారు. పెద్ద సంఖ్యలో ప్రజలు కార్యాలయానికి వస్తున్నప్పుడు కనీసం తాగునీటిని సైతం ఏర్పాటు చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు మహిళలు, పిల్లలు నిలబడి వేచి చూడట మే తప్ప కూర్చునేందుకు కుర్చీలు కూడా లేవు. కోట్లల్లో ఆదాయం ఉన్నా సౌకర్యాలతో కూడిన సొంత భవనాలు లేవు. అద్దె భవనాల్లో వేల కొద్ది కిరాయిలు చెల్లిస్తూ అరకొర వసతులతోనే రిజిస్ట్రార్‌ కార్యాలయాలు నెట్టుకొస్తున్నాయి. రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరిగినా ఆ మేరకు కంప్యూటర్లు, స్కాన ర్లు లేకపోవడంతో అర్ధరాత్రి వరకు పడిగాపులు తప్పడం లేదు. ఉమ్మడి జిల్లాలో 230 మంది రిజిస్ట్రేషన్‌ సిబ్బంది అవసరం కాగా, ప్రస్తుతం 130 మందే విధుల్లో ఉన్నారు. మిగతా పోస్టులు ఖాళీగా ఉండగా, ప్రభుత్వ ప్రధాన ఆదాయమార్గమైన ఈ శాఖలో వాటి భర్తీకి చర్యలు చేపట్టకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.



ధరలు పెరుగుతున్నాయనే : వి.కోటేశ్వర్‌రావు, నల్లగొండ 

ధరలు పెరుగుతున్నాయనే సమాచారంతో రిజిస్ట్రేషన్‌ చేయించుకునేందుకు వచ్చా. కార్యాలయంలో రోజు 50మం ది వచ్చేది ఇవాళ 200 మంది వరకు ఉన్నారు. ఆరునెలల క్రితమే ధరలు పెంచిన ప్రభుత్వం మళ్లీ పెంచడం సరైంది కాదు. ఇక్కడ సబ్‌ రిజిస్ట్రార్‌ ఉన్నారు. దీంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అన్ని డాక్యుమెంట్లు చెక్‌ చేసి నెంబరువేసే వరకు వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు వేచి ఉండలేక ఇబ్బందిపడుతున్నారు. తాగేందుకు నీరు, కూ ర్చునేందుకు బెంచీలు కూడా లేవు. కరోనా నేపథ్యంలో సామాజికదూరం పా టించే ఏర్పాట్లు లేవు. అసలు కొవిడ్‌ భయం ఎవ్వరిలోనూ కనిపించడం లేదు.


రెండు రోజులుగా తిరుగుతున్నా : తోలుకొప్పుల రమేష్‌, నల్లగొండ

రిజిస్ట్రేషన్‌ చార్జీలు పెరగనుండటంతో ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఉదయం 11గంటలకు కావాల్సిన రిజిస్ట్రేషన్‌ రాత్రి 7గంటలవుతోంది. మంచిరోజుతో సంబంధం లేకుండా అంతా రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటున్నారు. రెండు రోజుల నుంచి తిరుగుతుంటే గురువారం సాయంత్రం నా రిజిస్ట్రేషన్‌ పూర్తయింది. రిజిస్ట్రేషన్ల కోసం ఉదయం నుంచి 300 మంది సాయంత్రం వరకు ఎదురుచూడాల్సి వచ్చింది.


Updated Date - 2022-01-29T06:09:21+05:30 IST