నమ్మకం కలిగించాలి

ABN , First Publish Date - 2020-04-16T09:39:13+05:30 IST

నిజమే, ప్రజలు ఒక పట్టాన దారికి రారు. ప్రాణానికి ముప్పు వస్తుందన్నా, ప్రళయమే ముంచుకు వస్తోందన్నా, నిమ్మకు నీరెత్తినట్టు ఉండగలిగినవారు కనిపిస్తూనే ఉన్నారు. మళ్లీ వీళ్లే, తమకు...

నమ్మకం కలిగించాలి

నిజమే, ప్రజలు ఒక పట్టాన దారికి రారు. ప్రాణానికి ముప్పు వస్తుందన్నా, ప్రళయమే ముంచుకు వస్తోందన్నా, నిమ్మకు నీరెత్తినట్టు ఉండగలిగినవారు కనిపిస్తూనే ఉన్నారు. మళ్లీ వీళ్లే, తమకు నాలుగు మైళ్ల అవతల ఎవరికో కరోనా వచ్చిందన్నా బెదిరిపోయి, అటునుంచి వీచే గాలిని కూడా పీల్చరు. ముందు జాగ్రత్తగా క్వారంటైన్‌లో ఉన్నవారిని కూడా బహిష్కృతులుగా చూస్తారు. వ్యాధి సోకినవారికి చికిత్సలు, సపర్యలు చేసేవారిని కూడా వెలివేయాలని చూస్తారు. ఎందుకు, వీళ్లు ఇట్లా ప్రవర్తిస్తున్నారు? లాక్‌డౌన్‌ అమలులో ఉన్నా, కూరగాయల మార్కెట్లలోను, మాంసం దుకాణాల దగ్గర, సూపర్‌మార్కెట్ల ముందు ఎందుకు భౌతికదూరం పాటించకుండా అలక్ష్యం చూపుతున్నారు? కొన్ని ప్రాంతాల్లో వీధుల్లో ట్రాఫిక్‌ కూడా ఏమీ తగ్గడం లేదు. మంగళవారం నాడు ముంబై బాంద్రా రైల్వే స్టేషన్‌ దగ్గర జనసమ్మర్దం చూశాము. బుధవారం నాడు, ప్రభుత్వం తమ ఖాతాల్లో వేసిన 1500 రూపాయలను విత్‌డ్రా చేసుకోవడానికి తెలంగాణలో బ్యాంకుల ముందు గుంపులు గుంపులుగా జనం. ఇక రాజకీయనాయకుల పరివారం యథావిధిగా సాగుతూనే ఉన్నది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అధికారపార్టీ శాసనసభ్యులను కూడా పోలీసు అధికారులు పిలిచి మందలించవలసి వస్తున్నది. వీరందరికీ కరోనా ప్రమాదం తెలియదా? మన దేశంలోని వ్యాధి వ్యాప్తి నెమ్మదిగా ఉండవచ్చు, కానీ అందరూ అమెరికా, ఇటలీ, స్పెయిన్‌, బ్రిటన్‌లలో హృదయవిదారక గాథలను తెలుసుకుంటూనే ఉన్నారు కదా? నెల్లూరులో ఒక జనాభిమానం పొందిన ఒక వైద్యుడు కరోనా సోకి మరణిస్తే, ఆయన అంత్యక్రియలకు ఎవరూ సహకరించకపోవడం, దయనీయమైన పరిస్థితులలో కుటుంబసభ్యులెవరూ లేకుండా, అధికారుల ద్వారా కార్యక్రమం పూర్తి కావడం– అందరినీ కదిలించిన ఉదంతం. కరోనా కేవలం ఒక శారీరక వ్యాధి మాత్రమే కాదు. దానికి అనేక సామాజిక పార్శ్వాలు ఉన్నాయి. 


ప్రజలలో గణనీయమైన భాగం సామూహిక విధి విధానాలను ఖాతరు చేయడం లేదంటే, ఆ విధానాలు వారికి అర్థం అయ్యేట్టు చేర్చడంలో, వాటిని పాటించడానికి వారిని ఒప్పించడంలో వైఫల్యం ఉన్నదన్నమాట. దాన్ని అంగీకరిస్తే తప్ప, సమస్యకు పరిష్కారాన్ని కనుగొనలేము. భారతీయ సమాజం విస్తృతమైనది, బహుముఖమైనది, వైవిధ్యపూరితమైనది. అనేక మత, సాంస్కృతిక, సామాజిక విశ్వాసాలు కూడినది. ఆధునిక అభివృద్ధి, ఆధునికత ప్రభావం దేశమంతా ఏకరూపతతో లేదు, అన్ని సామాజిక వర్గాలలోనూ ఏకస్థాయిలో లేదు. ఒకే సందేశాన్ని 130 కోట్ల మందికి ఒకే రకంగా అర్థమయ్యేట్టు చేయడం సాధ్యమయ్యే పని కాదు. మొదటి సారి లాక్‌డౌన్‌ ప్రకటించినప్పుడు ప్రధాని ఆ ప్రకటనను హఠాత్తుగా చేయాలనుకోవడంలో ఒక అర్థం ఉన్నది. కొన్ని రోజుల ముందుగానే రాబోయే లాక్‌డౌన్‌ గురించిన సూచన చేసి ఉంటే, ఉన్న తక్కువ వ్యవధిలో జనం ప్రయాణాలకు, కొనుగోళ్లకు, ఇతర అత్యవసర పనులకు హడావుడి పడేవారు, పెద్ద ఎత్తున గుంపులు, సమ్మర్థం, సందడి జరిగి ఉండేవి. అట్లా కాక, ఆకస్మాత్తుగా చేయడం వల్ల ఎక్కడివారు అక్కడే ఉండిపోవలసివచ్చింది. అందువల్ల వలసకార్మికులు ఎక్కువ ఇబ్బంది పడవలసివచ్చింది. ఇతరులు కూడా వ్యక్తిగతంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనవలసి వచ్చింది. మరి లాక్‌డౌన్‌ పొడిగింపు విషయాన్ని కూడా చివరినిమిషంలో మాత్రమే ప్రకటించడంలో ఉద్దేశ్యమేమిటి? ఏప్రిల్‌ 14తో లాక్‌డౌన్‌ ముగిస్తే, తామిక స్వస్థలాలకు వెళ్లవచ్చునని ముంబైలో జనం రైల్వేస్టేషన్లకు పోటెత్తారు. తాను టీవీల ద్వారా, డిజిటల్‌ మాధ్యమాల ద్వారా ఇచ్చే సందేశం ఈ దేశంలోని ప్రతి ఒక్కరికీ చేరుతుందని ప్రధాని భావిస్తున్నారా? గంటలు కొట్టమని, దీపాలు వెలిగించమని తాను ఇచ్చే పిలుపులు అందరికీ చేరగలవని అనుకుంటున్నారా? అటువంటి అభిప్రాయమే ఢిల్లీ పాలకులకు ఉంటే, వారికి భారతదేశం గురించి సంపూర్ణంగా తెలియదని భావించవలసి వస్తుంది. లక్షలాది మంది వలసకార్మికులు దేశంలో తమది కాని ప్రాంతాల నుంచి స్వస్థలాలకు వెళ్లాలనుకుని, సహాయశిబిరాలలోనో, రహదారుల పక్కనో బసచేసి ఉన్నారు. వారికి వాగ్దానం చేసిన సహాయాలే పూర్తిగా అందడం లేదు. అసలు ఉన్నట్టుండి వెనక్కి ఎందుకు వెళ్లాలనుకుంటున్నారో వారిని కనుక్కున్న వారున్నారా? వారు కరోనా వ్యాధి వ్యాప్తి గురించిన స్పృహలేకుండా ఎందుకు అట్లా గుంపులుగా ఉన్నారో కూడా వారినే అడిగి తెలుసుకోవాలి. ఈ దేశంలో కార్మికులతో, అసంఘటిత కార్మికులతో కలసి పనిచేస్తున్న ట్రేడ్‌యూనియన్‌లను, స్వచ్ఛంద సంస్థలను ప్రభుత్వం విశ్వాసంలోకి తీసుకోవాలి. 


అట్లాగే, మర్కజ్‌ సమావేశాల నుంచి వెనక్కి వచ్చిన యాత్రికులు, వారి బంధువులు బాధ్యతగా వ్యవహరించడం లేదని అదేపనిగా విమర్శించడం సబబైన పని కాదు. గుర్తుంచుకోవలసింది, అది ప్రాణాంతక వ్యాధి. ఎవరూ దానిని కోరుకోరు. ఇతరులకు, ముఖ్యంగా కుటుంబసభ్యులకు, బంధుమిత్రులకు అది వ్యాపించాలని కోరుకోరు. కరోనా వ్యాధి ప్రభావిత ప్రాంతాలలో నివాసప్రాంతాలను ఒకసారి పరిగణనలోకి తీసుకోవాలి. భౌతికదూరం పాటించడానికే వీలులేనంత చిన్నచిన్న సందులు, నివాసాలు, కిక్కిరిసిన జనం. వ్యాధి కలిగించే భయం కంటె, అది వేస్తున్న సామాజికమైన మరక, వివక్ష ప్రమాదకరంగా కనిపిస్తున్నది. అటువంటి ప్రాంతాలలో, ప్రజలను విశ్వాసంలోకి తీసుకుని, వారికి విశ్వాసం ఉన్న మధ్యవర్తులను రంగంలోకి దింపి, అనుమానితులను పరీక్షించడానికి, వ్యాధిసోకినవారికి చికిత్స చేయడానికి విశ్వసనీయమైన వాతావరణాన్ని కల్పించాలి. రేషన్‌కు కూరగాయలకు, బ్యాంకు విత్‌డ్రాయల్స్‌కు మనుషులు ఎగబడవలసిరావడం ఒక విషాదం. అందరికీ చివరిదాకా అందుతాయన్న నమ్మకం, సకాలంలో డబ్బు చేతిలో పడుతుందన్న విశ్వాసం కలిగితే, స్వచ్ఛందంగా దూరాన్ని పాటిస్తారు. జబ్బు వల్ల కలిగే నష్టం, డబ్బు అందకపోవడం వల్ల కలుగుతున్న నష్టం– ఈ రెంటినీ బేరీజు వేసుకుని ప్రాణాలకు తెగించి వ్యాధికి ఎదురువెళ్లడం దురదృష్టకరం.

Updated Date - 2020-04-16T09:39:13+05:30 IST