TNCC: కొత్త నేత ఎంపిక కోసం.. 19న టీఎన్‌సీసీ సర్వసభ్య సమావేశం

ABN , First Publish Date - 2022-09-17T13:04:03+05:30 IST

రాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీ సర్వసభ్య మండలి సమావేశం ఈ నెల 19న జరుగనుంది. రాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిని నియమించే అధికారాన్ని పార్టీ

TNCC: కొత్త నేత ఎంపిక కోసం.. 19న టీఎన్‌సీసీ సర్వసభ్య సమావేశం

చెన్నై, సెప్టెంబర్‌ 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీ సర్వసభ్య మండలి సమావేశం ఈ నెల 19న జరుగనుంది. రాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిని నియమించే అధికారాన్ని పార్టీ అధిష్టానానికి అప్పగిస్తూ తీర్మానం చేసేందుకు ఈ సమావేశం నిర్వహించనున్నారు. అంతేగాక పార్టీ జాతీయ కమిటీ సభ్యుల నియామకంపై కూడా అధిష్టానమే నిర్ణయం తీసుకునేలా మరో తీర్మానం ప్రతిపాదించనున్నారు. ఏఐసీసీ(AICC) అధ్యక్షపదవికి అక్టోబర్‌ 17న ఎన్నికలు జరుగనున్నాయి. ఆ పదవికి ఎక్కువ మంది పోటీపడితే ఆయా రాష్ట్రాల కాంగ్రెస్‌ కమిటీ కార్యాలయాల్లో బ్యాలెట్‌ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ఈ నెల 24న ప్రారంభమై 30న ముగియనుంది. ప్రస్తుతం రాష్ట్రాలవారీగా ఓటర్ల జాబితా తయారీ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో ఓటుహక్కున్నవారందరికీ తొలిసారి క్యూఆర్‌ కోడ్‌తో కూడిన గుర్తి కార్డు అందజేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీల సర్వసభ్యమండలి సమావేశాలను ఈ నెల 20లోగా నిర్వహించి ఆయా రాష్ట్రాలకు సంబంధించిన కాంగ్రెస్‌ కమిటీ(Congress Committee) అధ్యక్షులను నియమించే అధికారాన్ని అధిష్టానవర్గానికి కల్పించేలా తీర్మానం చేయాలంటూ ఎన్నికల నిర్వహణాధికారిగా నియమితులైన మధుసూదన్‌ సర్క్యులర్‌ జారీ చేశారు. ఆ మేరకు ఈ నెల 19న రాయపేటలోని టీఎన్‌సీసీ ప్రధాన కార్యాలయం సత్యమూర్తి భవన్‌లో కేఎస్‌ అళగిరి అధ్యక్షతన పార్టీ సర్వసభ్యమండలి సమావేశం నిర్వహించనున్నారు.

 

రాష్ట్రంలో 850 మందికి ఓటు హక్కు

  ఏఐసీసీ అధ్యక్షపదవికి జరిగే ఎన్నికల్లో రాష్ట్రానికి చెందిన 850 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.  అధ్యక్షపదవికి ఆ పార్టీ ఎంపీ రాహుల్‌గాంధీ మళ్ళీ పోటీ చేయాలని పార్టీ సీనియర్‌ నేతలంతా ఆయనపై ఒత్తిడి చేస్తున్నారు. ప్రస్తుతం భారత్‌జోడో యాత్ర  నిర్వహిస్తున్న రాహుల్‌ ఈ విషయమై తాను ఎన్నడో ఓ నిర్ణయానికి వచ్చానని ప్రకటించి సంచలనం సృష్టించారు. అయితే ఆయన పోటీ చేస్తారా లేదా అనే విషయంపై ఇంకా సస్పెన్స్‌ కొనసాగుతోంది.  రాష్ట్రంలో 690 మంది సర్వసభ్యమండలి సభ్యులు, 76 జిల్లా కాంగ్రెస్‌ నాయకులు, తొమ్మిది ఎంపీలు, 18 మంది శాసనసభ్యులు, మాజీ సీఎల్పీ నేతలు, పార్టీ అధ్యక్షుడు సహా మొత్తం 850 మంది ఏఐసీసీ అధ్యక్షపదవికి జరిగే ఎన్నికల్లో ఓటు వేయనున్నారు. ఏఐసీసీ అధ్యక్షపదవికి పోటీ ఏర్పడితే ఆయా రాష్ట్రాల రాజధాని నగరాల్లోని పార్టీ కార్యాలయాల్లో పోలింగ్‌ ఏర్పాట్లు చేపట్టనున్నారు.

Updated Date - 2022-09-17T13:04:03+05:30 IST