May 11 2021 @ 04:46AM

టీఎన్‌ఆర్‌ మృతి

కొవిడ్‌-19 సంబంధిత సమస్యలతో నటుడు, యూట్యూబ్‌లో సినీ ప్రముఖులను ఇంటర్వ్యూ చేయడం ద్వారా గుర్తింపు తెచ్చుకున్న టీఎన్‌ఆర్‌ (50) సోమవారం ఉదయం కన్నుమూశారు. కాచిగూడలోని ఎస్‌.వి.ఎస్‌. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన అసలు పేరు తుమ్మల నరసింహారెడ్డి. స్వస్థలం మంచిర్యాలలోని పౌనూర్‌. చిరంజీవికి వీరాభిమాని. డిగ్రీ పూర్తయిన తర్వాత దర్శకుడు కావాలని చిత్ర పరిశ్రమకు వచ్చారు. తొలుత దేవదాస్‌ కనకాల దగ్గర దర్శకత్వంలో శిక్షణ పొందారు. ఆ తర్వాత రచయిత, నటుడు ఎల్బీ శ్రీరామ్‌ దగ్గర అసిస్టెంట్‌గా పని చేశారు. పలు చిత్రాలకు స్ర్కిప్ట్‌ వర్క్‌లో పాలు పంచుకున్నారు. ఈటీవీలో ప్రసారమైన ‘నేరాలు - ఘోరాలు’ ధారావాహికకు నాలుగేళ్ల పాటు దర్శకత్వం చేశారు. సినిమాకు దర్శకత్వం వహించనప్పటికీ... నటుడిగా పలు చిత్రాలు చేశారు. సుమంత్‌ ‘బోణి’లో చిన్న పాత్ర పోషించారు. తర్వాత జర్నలి్‌స్టగా పని చేశారు. అయితే, యూట్యూబ్‌ ఇంటర్వ్యూలు ఆయనకు ఎక్కువ గుర్తింపు తెచ్చాయి. ఆ తర్వాత ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘ఫలక్‌నుమా దాస్‌’, ‘ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య’, ‘హిట్‌’, ‘ప్లేబ్యాక్‌’, ‘జార్జిరెడ్డి’ తదితర చిత్రాల్లో నటించారు. సోమవారం హైదరాబాద్‌లోని అంబర్‌ పేట శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. టీఎన్‌ఆర్‌కు భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.