సముద్రంలో అలజడి

ABN , First Publish Date - 2020-10-13T10:01:07+05:30 IST

జిల్లావ్యాప్తంగా ఆదివారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం..

సముద్రంలో అలజడి

నేటి ఉదయం నరసాపురం - విశాఖ మధ్య

కాకినాడ వద్ద తీరం దాటే అవకాశం

 సముద్రం అల్లకల్లోలం.. ఎగసిపడుతున్న అలలు

 తీరం వెంబడి బలమైన గాలులు

 జిల్లావ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు

 తీరగ్రామాల్లో బిక్కుబిక్కుమంటున్న జనం

 అప్రమత్తమైన అధికార యంత్రాంగం

 ఏజెన్సీలో పొంగుతున్న వాగులు, చెరువులు

 మునుగుతున్న పంట పొలాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం 


ఏలూరు సిటీ/నరసాపురం: తీవ్ర రూపం దాల్చింది. మంగళవారం తెల్లవారు జామున నరసాపురం - విశాఖపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటనుంది. ఫలితంగా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. తీరం వెంబడి గంటకు 50 నుంచి 60, అప్పుడప్పుడు 70 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నాయి. తీవ్ర వాయుగుండం తీరానికి చేరువైన కొద్దీ గాలుల తీవ్రత మరింత పెరగనున్నది. ఈ కారణంగా పూరిళ్లు, విద్యుత్‌, కమ్యూనికేషన్స్‌ వ్యవస్థకు నష్టం వాటిల్లనున్నది. చెట్లు నేలకొరగనున్నాయి. 


జిల్లావ్యాప్తంగా ఆదివారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఏజెన్సీలో కొండ వాగులు పొంగుతున్నాయి. ఎర్రకాలువలోకి నీరు వచ్చి చేరుతోంది. గ్రామీణ ప్రాంతాల్లోని చెరువులు పొంగి పొర్లుతున్నాయి. కాలువలు ఉధృతంగా ప్రవహిస్తు న్నాయి. వర్షాలతో జన జీవనం స్తంభించింది. రహదారులన్నీ చిత్తడి చిత్తడిగా తయారయ్యాయి. పట్ణణాల్లో అస్తవ్యస్తంగా వున్న డ్రైనేజీలు మరింత అధ్వానంగా మారాయి. జంగారెడ్డి గూడెం, పాలకొల్లు, నరసాపురం, కొవ్వూరు, తాడేపల్లిగూడెం, భీమవరం, ఏలూరు, తణుకు, నిడదవోలు తదితర పట్టణా ల్లో జనజీవనం స్తంభించింది.   


రైతుల్లో ఆందోళన

సార్వా సాగు ముమ్మరంగా సాగుతుండటం, మరో పక్క వరి మాసూళ్ళు ప్రారంభం కావటంతో పండిన పంట చేతికొచ్చేనా అని రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. చాలా ప్రాంతాల్లో పంటలు నీటి ముంపునకు గురవుతున్నాయి.  ఇప్పటికే సార్వా సాగులో రెండుసార్లు ప్రకృతి వైపరీత్యాల ద్వారా రైతులు పంట నష్టపోయారు. 


అధికార యంత్రాంగం అప్రమత్తం

వాతావరణ శాఖ హెచ్చరికతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సోమవారం సబ్‌ కలెక్టర్‌ విశ్వనాథన్‌ అధి కారులతో వీడియో సమావేశం నిర్వహించారు. సముద్ర తీరంలో నివసిస్తున్న ప్రజలు ఇళ్లలోనే ఉండే విధంగా చూడాలన్నారు. భారీ వర్షాలకు పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. గాలులకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.


ట్రాన్స్‌కో అధికారులు అప్రమత్తం అయ్యారు. తూర్పుతాళ్లు సబ్‌ స్టేషన్‌లో విద్యుత్‌ స్తంభాలు, క్రేన్‌ను సిద్ధంగా ఉంచారు. గాలు లకు విద్యుత్‌ స్తంభాలు నేల కొరిగినా వెంటనే పునరుద్ధరించేం దుకు అవసరమైన సిబ్బందిని అ ప్రమత్తం చేసినట్లు విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ జనార్దనరావు తెలిపారు. డీఈ మధుకుమార్‌ తీరగ్రామాల సబ్‌ స్టేషన్‌లను సందర్శించారు. 


తీరంలో అలజడి

గతంలో తుపాన్లు తీరాన్ని తాకిన సమయంలో సృష్టిం చిన కల్లోలాలను గుర్తు చేసుకుని సముద్రతీర గ్రామాల ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. వాయుగుండం తీరానికి సమీపిస్తున్న కొద్దీ వాతావరణంలో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. సోమవారం రాత్రి నుంచి సము ద్రంలో కెరటాల హోరు ఎక్కువైంది. చిన్నలంక, పీఎం లంక, పేరుపాలెం ప్రాంతాల్లో సముద్రం ముందుకు చొచ్చుకొస్తోం ది. అలల తీవ్రతకు పీఎం లంక వద్ద గట్టు కోత ఎక్కువైంది. కెరటాలకు ఒడ్డున వున్న పడవలు, వలలు కొట్టుకుపోయే అవకాశం ఉండటంతో మత్స్యకారులు వాటిని సురక్షిత ప్రదే శాలకు తరలించుకునే పనిలో పడ్డారు. 


Updated Date - 2020-10-13T10:01:07+05:30 IST