ఏజెన్సీలో పోలీసులు అప్రమత్తం

ABN , First Publish Date - 2020-09-26T07:53:02+05:30 IST

ఏజెన్సీలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో దాదాపు ఏడాది కాలంగా మావోయిస్టుల కదలికలు లేక ప్రశాంతంగా ఉన్నది.

ఏజెన్సీలో పోలీసులు అప్రమత్తం

ఆదివాసీ గ్రామాలపై ప్రత్యేక నిఘా

కుక్కునూరు, సెప్టెంబరు 25 : ఏజెన్సీలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో దాదాపు ఏడాది కాలంగా మావోయిస్టుల కదలికలు లేక ప్రశాంతంగా ఉన్నది. కానీ బుధవారం తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల పోలీస్టేషన్‌ పరిధిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో  కుక్కునూరు మండలానికి చెందిన ఆదివాసీ యువతి మృతి చెందడంతో అటు పోలీసు వర్గాల్లోను, ఇటు ప్రజల్లోను కలకలం రేగింది.


జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టుల ఉనికి కుక్కునూరు మండలంలో బయట పడడంతో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. మృతిచెందిన మడెం మంగి అలియాస్‌ లలిత కుటుంబం దాదాపు 15 ఏళ్ల క్రితమే చత్తీస్‌ఘడ్‌ ప్రాంతం నుంచి వలస వచ్చిన ఆదివాసీ కుటుంబంగా గుర్తించారు.


దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. లలిత మృతదేహాన్ని మండలంలోని భువనగిరితోగులో నివాసం ఉంటున్న తండ్రి కన్నయ్యకు అందజేశారు. దీంతో అంత్యక్రియలు బంధువులు జరిపించారు. ఈ విషయాన్ని స్థానిక పోలీసులు ధ్రువీకరించారు.

 

 18 ఆదివాసీ గ్రామాలపై పోలీసుల దృష్టి...

చత్తీస్‌ఘడ్‌, ఒరిస్సా ప్రాంతాల నుంచి దాదాపు 10 నుంచి 15 ఏళ్ల క్రితం కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు వేలాది మంది ఆదివాసీలు వలస వచ్చి స్థిరపడ్డారు. బాహ్య ప్రపంచానికి సంబంధం లేకుండా ఆదివాసీ గ్రామాలన్నీ అటవీ ప్రాంతంలోని వాగులు, వంకల్లో ఉన్నాయి. అక్కడ ఏమి జరుగుతుందో బాహ్యప్రపంచానికి తెలిసే అవకాశం లేదు.


అయితే వలస వచ్చిన ఆదివాసీ గ్రామంలోని కొందరు మావోయిస్టు సానుభూతి పరులుగా ఉండే అవకాశం  ఉందని, దండకారణ్యం నుంచి ఇక్కడకు తరలివచ్చే మావోయిస్టులకు షెల్టర్‌ ఇచ్చే అవకాశం ఉందని పోలీసులు నాలుగు ఏళ్లగా నిఘా పెట్టారు. రెండు మండలాల్లో దాదాపు 30కుపైగా ఆదివాసీ గ్రామాలు ఉన్నాయి. ఇప్పటికే ఆదివాసీ వివరాలను పోలీసులు పూర్తిస్థాయిలో సేకరించారు. అయితే ఇక నుంచి గ్రామాలకు ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు వెళ్తున్నారన్న విషయంపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టనున్నట్టు సమాచారం. ఒక ప్రత్యేక బృందాన్ని ప్రతీ ఆదివాసీ  గ్రామానికి వెళ్లి వారిపైన నిఘా ఉంచనున్నట్టు సమాచారం.


 మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా గుర్తింపు...

కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు పశ్చిమ గోదావరి జిల్లాలో మావోయిస్టు ప్రభావిత ప్రాంత ంగా కేంద్ర ఇంటెలిజెన్స్‌ శాఖ గతంలోనే గుర్తిం చింది. ప్రధానంగా ఈరెండు మండలాలకు గోదా వరి తీరం సరిహద్దుగా ఉండడంతో పాటు అవతల వైపు తెలంగాణ, తూర్పుగోదావరి జిల్లాల్లోని కొన్ని గ్రామాలతో పాటు చత్తీస్‌ఘడ్‌ ఒరిస్సా ప్రాంతాలు సరిహద్ధుగా ఉన్నాయి.


దీనిని జిల్లా యంత్రాంగం దృష్టిలో ఉంచుకుంది. అలాగే మావోయిస్టుల ఉనికి చాటుతూ ఎన్‌కౌంటర్‌లు, ఒక కాంగ్రెసు నాయకు డిని పట్టపగలే కాల్చి చంపడం, కుక్కునూరు పోలీస్టేషన్‌ను పేల్చివేయడం, పలు మార్లు పోలవరంకు వ్యతిరేకంగా కరపత్రాలు పలు చోట్ల అంటించడం జరిగింది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేక దళాలు కూంబింగ్‌ జరుపుతూనే ఉన్నాయి. జరిగిన సంఘటనల దృష్ట్యా పోలీసు యంత్రాంగం పూర్తిస్థాయిలో మావోల ఉనికిపై దృష్టి పెట్టనున్నట్టు సమాచారం.

Updated Date - 2020-09-26T07:53:02+05:30 IST