మోదీ.. మీ నేరం ఒప్పుకుంటున్నారు: కొవిడ్ మరణాలపై టీఎంసీ విమర్శలు

ABN , First Publish Date - 2022-04-20T00:52:35+05:30 IST

వాస్తవానికి కొవిడ్ నియంత్రణపై కేంద్ర ప్రభుత్వం సహా దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలపై అనేక విమర్శలు ఉన్నాయి. అయితే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లో నియంత్రణ అసలే బాలేదనే విమర్శలు పెద్దఎత్తున వినిపించాయి..

మోదీ.. మీ నేరం ఒప్పుకుంటున్నారు: కొవిడ్ మరణాలపై టీఎంసీ విమర్శలు

కోల్‌కతా: దేశంలో కొవిడ్ మరణాల లెక్కలు ప్రభుత్వం దాచిపెట్టిందని, అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన వివరాల్లో అసలు లెక్కలు బయటపడుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. కొవిడ్ మృతుల సామూహిక దహణానికి సంబంధించిన చిత్రాలను మోదీ చూస్తున్నట్లు ఉన్న ఇమేజ్‌లను టీఎంసీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన పార్టీ.. ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడిస్తున్న లెక్కలను అడ్డుకుంటూ మీ నేరాన్ని రుజువు చేసుకుంటున్నారు’ అంటూ మోదీపై విమర్శలు గుప్పించింది.


వాస్తవానికి కొవిడ్ నియంత్రణపై కేంద్ర ప్రభుత్వం సహా దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలపై అనేక విమర్శలు ఉన్నాయి. అయితే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లో నియంత్రణ అసలే బాలేదనే విమర్శలు పెద్దఎత్తున వినిపించాయి. గంగా నది ఒడ్డున కుప్పలు తెప్పలుగా, గంగానదిలో సైతం నీటిలో తేలియాడుతూ కొవిడ్ మృతుల శరీరాలు కనిపించడం బీజేపీని మరింత ఇరుకున పెట్టాయి. ఈ విషయమై ముఖ్యమంత్రి యోగి సహా ప్రధానమంత్రి మోదీపై అనేక విమర్శలు వచ్చాయి.


ఇక తాజాగా, కొవిడ్ నాలుగో వేవ్ వార్తల నేపథ్యంలో ప్రధాని లక్ష్యంగా టీఎంసీ బాణాలు ఎక్కుపెట్టింది. ‘‘ప్రధానమంత్రి, కొవిడ్ సమయంలో మీ అసమర్ధ నిర్వహణను ప్రపంచం గ్రహించింది. కొవిడ్ అసలు లెక్కలు వెల్లడించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ చేస్తున్న ప్రయాత్నాలను అడ్డుకుంటూ మీ నేరాన్ని రుజువు చేసుకుంటున్నారు. వాస్తవం బయటికి వచ్చింది’’ అని టీఎంసీ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌లో ‘మోదీజీ ఫెయిల్‌డ్ ఇండియా’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేసింది. ఇందులో మోదీతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థను ట్యాగ్ చేసింది.

Updated Date - 2022-04-20T00:52:35+05:30 IST