21 నిమిషాల్లో 25 బిల్లులు.. 'పచారీ కొట్టు'గా మారిన బీఎసీ..!

ABN , First Publish Date - 2021-08-07T00:43:48+05:30 IST

పార్లమెంటులో చర్చ లేకుండానే బిల్లులు ఆమోదిస్తుండటంపై తృణమూల్ కాంగ్రెస్ ఘాటు..

21 నిమిషాల్లో 25 బిల్లులు.. 'పచారీ కొట్టు'గా మారిన బీఎసీ..!

న్యూఢిల్లీ: పార్లమెంటులో చర్చ లేకుండానే బిల్లులు ఆమోదిస్తుండటంపై కేంద్రంపై తృణమూల్ కాంగ్రెస్ ఘాటు విమర్శలు చేసింది. పార్లమెంటరీ బిజినెస్ అడ్వయిజరీ కమిటీ ''పచారీ కొట్టు'' (జనరల్ స్టోర్)గా మారిందంటూ ఎద్దేవా చేసింది. టీఎంసీ ఎంపీ కకోలి ఘోష్ దస్తిదార్ శుక్రవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ, నిరంకుశపాలన వైపు మనం ప్రయాణిస్తున్నామా? అనే సందేహం తమకు కలుగుతోందని అన్నారు.


''మనం నిరంకుశ పాలన వైపు వెళ్తున్నామా? రాజ్యాంగ వ్యవస్థను అణగ దొక్కుతున్నారు. ఇది చాలా విచారించదగిన విషయం. విపక్షాలను, ప్రజల విజ్ఞప్తులను ఏమాత్రం ఖాతరు చేయని రీతిలో వ్యవహరిస్తున్నారు. తద్వారా క్రమక్రమంగా మనం ప్రజాస్వామ్యాన్ని కోల్పోతున్నాం. చర్చలేకుండానే బిల్లులు ఆమోదిస్తున్నారు'' అని దస్తిదార్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ వైపు మళ్లుతుండగా, బిజినెస్ అడ్వయిజరీ కమిటీ జనరల్ స్టోర్‌గా మారుతోందని ఆమె విమర్శించారు. కేవలం 21 నిమిషాల్లోనే 25 బిల్లులు ఆమోదించారని, చర్చ లేకుండానే ఉభయసభల్లోనూ బిల్లులు ఆమోదిస్తున్నారని, ఇదే ధోరణి కొనసాగిస్తే ఇక ప్రజాస్వామ్యమనేదే మిగలదని అన్నారు. ధరల పెరుగుదల, కోవిడ్ అంశాలపై చర్చించాలని తాము అనుకున్నప్పటికీ చర్చించలేకున్నామని అన్నారు. రైతుల నిరసన, కోవిడ్, ద్రవ్యోల్బణం, పెగాసస్ స్పైవేర్ అంశాలపై తాము చర్చ కోరుతున్నామని చెప్పారు. పెగాసస్ వ్యవహారాన్ని ఉన్నత స్థాయి కమిటీతో విచారణ జరిపించాలని, పెగాసస్ సర్వీసులను భారత ప్రభుత్వం తెచ్చుకుందా లేదా తేల్చిచెప్పాలని అన్నారు. ''వీటిపై చర్చ జరిపేంత వరకూ మేము నిరసన తెలుపుతూనే ఉంటాం. నిఘా నీడలో మనం బతుకుతున్నాం'' అని టీఎంసీ ఎంపీ అన్నారు. మరో ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ కూడా మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

Updated Date - 2021-08-07T00:43:48+05:30 IST