New Parliament Building: జాతీయ చిహ్నానికి అవమానం : టీఎంసీ ఎంపీలు

ABN , First Publish Date - 2022-07-12T21:47:28+05:30 IST

నూతన పార్లమెంటు భవనంపై ఏర్పాటు చేసిన నాలుగు సింహాల జాతీయ

New Parliament Building: జాతీయ చిహ్నానికి అవమానం : టీఎంసీ ఎంపీలు

కోల్‌కతా : నూతన పార్లమెంటు భవనంపై ఏర్పాటు చేసిన నాలుగు సింహాల జాతీయ చిహ్నం అవమానకరంగా ఉందని టీఎంసీ ఎంపీలు జవహర్ సర్కార్, మహువా మొయిత్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సారనాథ్‌లోని అశోకుని నాలుగు సింహాలతో పొంతన లేకుండా, దూకుడు స్వభావాన్ని ప్రదర్శించే సింహాలను ఏర్పాటు చేశారని మండిపడ్డారు. 


నూతన పార్లమెంటు భవనంపైన నాలుగు సింహాల జాతీయ చిహ్నాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఆవిష్కరించారు. సారనాథ్‌లోని అశోకుని లయన్ కేపిటల్‌ను ఆదర్శంగా తీసుకుని జాతీయ చిహ్నాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే. వృత్తాకార పీఠంపైన దీనిని నిర్మించారు. దీని దిగువ భాగంలో ధర్మ చక్రం, ఎద్దు, గుఱ్ఱం కూడా ఉన్నాయి. 


మట్టితో ఓ నమూనాను తయారు చేసి, ఆ తర్వాత కంప్యూటర్ గ్రాఫిక్స్‌ను రూపొందించారు. దీనిని కంచుతో తయారు చేశారు. దీని బరువు 9,500 కిలోగ్రాములు, ఎత్తు 6.5 మీటర్లు. 6,500 కిలోగ్రాముల బరువైన ఉక్కు నిర్మాణంపై దీనిని ఏర్పాటు చేశారు. వేద పండితుల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించిన తర్వాత ప్రధాని మోదీ దీనిని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో  లోక్‌సభ సభాపతి ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీ పాల్గొన్నారు. 


సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా 13 ఎకరాల విస్తీర్ణంలో, నాలుగు అంతస్థుల పార్లమెంటు భవనాన్ని నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణం అక్టోబరునాటికి పూర్తవుతుందని తెలుస్తోంది. వచ్చే శీతాకాల సమావేశాలను నూతన భవనంలోనే జరుపుకునే అవకాశం ఉంది. 


టీఎంసీ ఎంపీ జవహర్ సర్కార్ ఇచ్చిన ట్వీట్‌లో, అద్భుతమైన హుందాతనం నిండిన అశోకుని సింహాలతో కూడిన మన జాతీయ చిహ్నానికి అవమానం జరిగిందన్నారు. అసలు చిహ్నంలోని సింహాలు ఎంతో నాజూకుగా, రాజసంతో కూడిన ఆత్మవిశ్వాసంతో ఉంటాయన్నారు. నూతన పార్లమెంటు భవనంపై ఆవిష్కరించిన జాతీయ చిహ్నంలోని సింహాలు మోదీ తరహాలో ఉన్నాయన్నారు. ఇవి కోపంతో గుర్రు పెడుతున్నట్లు, అనవసరమైన దూకుడును ప్రదర్శిస్తూ,  పొంతన లేకుండా ఉన్నాయని మండిపడ్డారు. ఇది సిగ్గుచేటు అని, తక్షణమే వీటిని మార్చాలని డిమాండ్ చేశారు. 


టీఎంసీ ఎంపీ మహువా మొయిత్ర ఇచ్చిన ట్వీట్‌లో, పాత, కొత్త జాతీయ చిహ్నాలను పోస్ట్ చేశారు. తన వ్యాఖ్యను జోడించలేదు. 








Updated Date - 2022-07-12T21:47:28+05:30 IST