Modi Photo with Camera: వైరల్ అవుతున్న ప్రధాన మోదీ ఫొటో.. ఈ ఫొటో వెనుక ఇంతుందా..!

ABN , First Publish Date - 2022-09-19T01:02:04+05:30 IST

ప్రధాని మోదీకి ప్రచార వ్యామోహం ఎక్కువని ప్రతిపక్షాలు అవకాశం వచ్చినప్పుడల్లా ఆరోపిస్తుంటాయి. ఆయన ఎక్కడికైనా వెళ్లిన సమయంలో తన ఫొటో తీస్తున్న ఫొటోగ్రాఫర్లకు..

Modi Photo with Camera: వైరల్ అవుతున్న ప్రధాన మోదీ ఫొటో.. ఈ ఫొటో వెనుక ఇంతుందా..!

ప్రధాని మోదీకి ప్రచార వ్యామోహం ఎక్కువని ప్రతిపక్షాలు అవకాశం వచ్చినప్పుడల్లా ఆరోపిస్తుంటాయి. ఆయన ఎక్కడికైనా వెళ్లిన సమయంలో తన ఫొటో తీస్తున్న ఫొటోగ్రాఫర్లకు ఎవరైనా పొరపాటున అడ్డు నిల్చున్నా తట్టుకోలేరని.. పక్కకు నెట్టి మరీ పోజులిస్తుంటారని ఆయనపై గతంలో విపక్షాలు కొన్ని వీడియోలు పోస్ట్ చేసి మరీ ప్రచారం చేశాయి. ఆ వీడియోలు ఫేక్ అని బీజేపీ తిప్పికొట్టడం కూడా జరిగింది. ఏ వీడియో ఫేక్, ఏ వీడియో రియల్ అనే సంగతి పక్కన పెడితే.. తాజాగా మరోసారి ప్రధాని మోదీకి సంబంధించిన ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫొటోను విపక్షాలు అస్త్రంగా చేసుకుని మోదీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ 72వ పుట్టిన రోజును పురస్కరించుకుని శనివారం ఆయన కునో నేషనల్‌ పార్కులో మూడు చీతాలను కన్జరేషన్‌ బాక్సుల నుంచి విడిచిపెట్టారు. మిగిలిన వాటిని ఇతర నేతలు వదిలిపెట్టారు. అనంతరం ప్రధాని స్వయంగా వాటిని ఫొటోలు తీశారు. అయితే.. కునో నేషనల్ పార్క్‌ను సందర్శించిన సమయంలో మోదీ సఫారీ టోపీ, సన్ గ్లాసెస్ పెట్టుకుని చీతాలను ఫొటోలు తీశారు. అయితే.. ఆ ఫొటోలు తీసిన సందర్భంలో మోదీ కెమెరాను లెన్స్ కవర్ తీయకుండానే వాడారని, ఆయనకు ఫొటోలు తీయడం కంటే ఫొటోలకు పోజులివ్వడంపై వ్యామోహం ఎక్కువగా ఉండటం వల్ల జరిగిన పొరపాటు అయి ఉండొచ్చని ప్రతిపక్ష పార్టీలు సోషల్ మీడియా సాక్షిగా వెటకారం చేశాయి.



తృణముల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ జవహర్ సిర్కార్ ఫొటోను పోస్ట్ చేసి మరీ వ్యంగ్యాస్త్రం సంధించారు. గణాంకాలన్నింటినీ కప్పెటడం ఒక విషయం అయితే, కెమెరా లెన్స్‌పై కవర్‌ను ఉంచి వాడటం ప్రధాన మోదీ దూరదృష్టికి నిదర్శనం అని ట్వీట్ చేసి ఈ తృణముల్ ఎంపీ వ్యంగ్యాస్త్రం సంధించారు. ఈ ఫొటో ఆదివారం ఉదయం నుంచి వైరల్ కావడంతో బీజేపీ సోషల్ మీడియా వింగ్ ఈ ఫొటోపై ఫోకస్ పెట్టి విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. అసలు ఆ ఫొటో నిజమైందేనా లేదా మార్ఫింగ్ చేసి మోదీని అప్రతిష్టపాలు చేయాలని ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయా అనే విషయంపై Fact Check చేసింది. మొత్తానికి ఆ ఫొటో మార్ఫింగ్‌దేనని తేల్చింది. పైగా ప్రధాని మోదీ చేతిలో ఉంది Nikon కెమెరా అయితే వైరల్ అయిన మార్ఫింగ్ ఫొటోలో Canon Lens Cover ఉండటం గమనార్హం. దీంతో.. మార్ఫింగ్ ఫొటోను సృష్టించి విపక్షాలు మోదీని కించపరిచేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటని బీజేపీ ఎదురుదాడికి దిగింది.



ఫేక్ ఫొటో, ఒరిజినల్ ఫొటో అని రెండు ఫొటోలను పోస్ట్ చేసి స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసింది. ఆ ఫొటో మార్ఫింగ్ చేసిందని ఆలస్యంగా గ్రహించిన సదరు టీఎంసీ ఎంపీ ట్విట్టర్‌లో తన పోస్ట్‌ను, ఫొటోను డిలీట్ చేయడం గమనార్హం. కొందరు అత్యుత్సాహంతో సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫేక్ ఫొటోలను ఒరిజినలో, కాదో నిర్ధారించుకోకుండా నేతలు వాటిని వారి సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసి బురద చల్లాలని చూస్తే చివరికి వాళ్లే అభాసుపాలవుతారని ఈ పరిణామం మరోసారి నిరూపించింది. ఇలా గతంలో కొందరు బీజేపీ నేతలు కూడా రాహుల్ గాంధీకి సంబంధించిన ఫేక్ ఫొటోలను, వీడియోలను రాజకీయంగా బురద చల్లడం కోసం వాడుకున్న సందర్భాలూ ఉన్నాయి.

Updated Date - 2022-09-19T01:02:04+05:30 IST