అరెస్టయిన కొద్ది గంటలకే శ్వాస సమస్యలతో ఆసుపత్రిలో చేరిన టీఎంసీ నేతలు

ABN , First Publish Date - 2021-05-18T17:47:46+05:30 IST

నారద స్కామ్‌లో నలుగురు తృణమూల్ కాంగ్రెస్ నేతలను సీబీఐ అరెస్టు చేసిన కొద్ది గంటలకే పార్టీ ఎమ్మెల్యే మదన్ మిత్రా, మాజీ నేత సోవన్ ఛటర్జీలను..

అరెస్టయిన కొద్ది గంటలకే శ్వాస సమస్యలతో ఆసుపత్రిలో చేరిన టీఎంసీ నేతలు

కోల్‌కతా: నారద స్కామ్‌లో నలుగురు తృణమూల్ కాంగ్రెస్ నేతలను సీబీఐ అరెస్టు చేసిన కొద్ది గంటలకే పార్టీ ఎమ్మెల్యే మదన్ మిత్రా, మాజీ నేత సోవన్ ఛటర్జీలను శాశ్వ సంబంధిత సమస్యలతో మంగళవారం ఉదయం ఎస్ఎస్‌కేఎం ఆసుపత్రిలో చేర్చారు. ఉదయం 3 గంటల ప్రాంతంలో శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తడంతో వీరురువునికి ఆసుపత్రిలో చేర్చినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. నారద స్టింగ్ ఆపరేషన్‌లో టీఎంసీ మంత్రులు ఫర్హద్ హకీమ్, సుబ్రతా ముఖర్జీ, ఎమ్మెల్యే మదన్ మిత్రా, కోల్‌కతా మాజీ మేయర్ సోవన్ ఛటర్జీలను సీబీఐ సోమవారంనాడు అరెస్టు చేసింది. అనంతర సోమవారం రాత్రి   ప్రెసిడెన్సీ జైలుకు తరలించింది.


దీనికి ముందు, అరెస్టయిన నలుగురు నేతలకు వైద్య పరీక్ష కోసం వైద్యుల బృందం సీబీఐ కార్యాలయానికి వెళ్లింది. సీబీఐ కార్యాలయం వెలుపల టీఎంసీ కార్యకర్తలు నిరసనలు దిగడం, భద్రతా సిబ్బందిపై రాళ్లు రువ్వడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. పశ్చిమబెంగాల్‌లో 2014లో నారద న్యూస్ ఫౌండర్ మేథ్యూ శామ్యూల్... నారద స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. 2016 పశ్చిమబెంగాల్ ఎన్నికలకు ముందు ప్రైవేట్ న్యూస్ వెబ్‌సైట్‌ నారద న్యూస్‌లో వార్త ప్రసారమైంది. స్టింగ్ ఆపరేటర్ శామ్యూల్ నుంచి అక్రమంగా పబ్లిక్ సర్వెంట్లు ముడుపులు అందుకుంటూ కెమెరాకు చిక్కడం అప్పట్లో సంచలనమైంది. ఇది నారద స్టింగ్ ఆపరేషన్‌గా ప్రచారంలోకి వచ్చింది.

Updated Date - 2021-05-18T17:47:46+05:30 IST