పీకే వ్యాఖ్యలతో టీఎంసీకి సంబంధం లేదు: డెరెక్ ఓబ్రెయిన్

ABN , First Publish Date - 2021-12-23T18:36:22+05:30 IST

ఐపాక్‌తో ఐదేళ్ల పాటు ఒప్పందం చేసుకున్న మొట్టమొదటి పార్టీ టీఎంసీ. మాతో ఐపాక్ ఐదేళ్ల పాటు పని చేస్తుంది. అలా అని వాళ్ల పనులు కూడా వాళ్లకు ఉంటాయి. రాజకీయంగా మరే ఇతర విషయాలపై ఐపాక్ నుంచి వచ్చే వ్యాఖ్యలతో మా పార్టీకి సంబంధం లేదు. టీఎంసీకి కట్టుబడి వాళ్ల విధానాల్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు..

పీకే వ్యాఖ్యలతో టీఎంసీకి సంబంధం లేదు: డెరెక్ ఓబ్రెయిన్

న్యూఢిల్లీ: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని పొలిటికల్ కన్సల్టెన్సీ ఎజెన్సీ ఐపాక్‌తో తాము ఐదేళ్ల పాటు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ నేత, ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ గురువారం రాజ్యసభలో ప్రకటించారు. అయితే ఐపాక్ చేసే రాజకీయ వ్యాఖ్యలతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, అది పూర్తిగా వారి వ్యక్తిగతమని ఆయన అన్నారు. ప్రశాంత్ కిశోర్ పేరు ఎత్తకుండానే ఐపాక్‌కు కొన్ని పనులు ఉన్నాయని, ఐపాక్ వ్యాఖ్యలు తమ పార్టీ విధివిధానాల్ని పాటించాల్సిన అవసరం లేదని డెరెక్ స్పష్టం చేశారు.


‘‘ఐపాక్‌తో ఐదేళ్ల పాటు ఒప్పందం చేసుకున్న మొట్టమొదటి పార్టీ టీఎంసీ. మాతో ఐపాక్ ఐదేళ్ల పాటు పని చేస్తుంది. అలా అని వాళ్ల పనులు కూడా వాళ్లకు ఉంటాయి. రాజకీయంగా మరే ఇతర విషయాలపై ఐపాక్ నుంచి వచ్చే వ్యాఖ్యలతో మా పార్టీకి సంబంధం లేదు. టీఎంసీకి కట్టుబడి వాళ్ల విధానాల్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఐపాక్‌కు మంచి గ్రౌండ్ ఉంది. సోషల్ మీడియాపై గట్టి పట్టు ఉంది. ఐపాక్‌తో సంబంధాలపై పూర్తి నిర్ణయం మమతా బెనర్జీదే’’ అని డెరెక్ ఓబ్రెయిన్ అన్నారు.


ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘మేం ప్రతిపక్షాలు ఎక్కడ ఉంటే అక్కడ పని చేయాలని అనుకుంటున్నాం. దేశంలో కాంగ్రెస్ తన ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించట్లేదు. బీజేపీ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పని చేస్తాం. అయితే అన్ని ప్రాంతాలకు మేం వెళ్లకపోవచ్చు. తమిళనాడులో డీఎంకే బలంగా ఉంది. అక్కడ టీఎంసీ పోటీ చేయదు. అలాగే మహారాష్ట్రలో కూడా టీఎంసీ పోటీలో ఉండదు’’ అని అన్నారు.

Updated Date - 2021-12-23T18:36:22+05:30 IST