కూచ్‌బెహర్ ఘటన ఓ కుట్ర.. 'షా' రాజీనామా చేయాలి: టీఎంసీ

ABN , First Publish Date - 2021-04-10T21:51:07+05:30 IST

నాలుగో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో భాగంగా కూచ్‌బెహర్‌లో సీఆర్‌పీఎఫ్ జరిపిన..

కూచ్‌బెహర్ ఘటన ఓ కుట్ర.. 'షా' రాజీనామా చేయాలి: టీఎంసీ

కోల్‌కతా: నాలుగో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో భాగంగా కూచ్‌బెహర్‌లో సీఆర్‌పీఎఫ్ జరిపిన కాల్పుల్లో నలుగురు టీఎంసీ కార్యకర్తలు మరణించడాన్ని టీఎంసీ ఖండించింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పన్నిన కుట్రలో భాగమే ఈ ఘటనని టీఎంసీ ఆరోపించింది. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ అమిత్‌షా రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.


టీఎంసీ ప్రధాన కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ పార్టీ ఎంపీ సౌగత రాయ్ మాట్లాడుతూ, ఓటింగ్‌కు అంతరాయం కలిగించేందుకు బీజేపీ గూండాలు చేసిన ప్రయత్నాలను సాధారణ ప్రజానీకం అడ్డుకోవడంతోనే ఈ కాల్పులు చోటుచేసుకున్నాయని చెప్పారు. బీజేపీ గూండాలకు కేంద్ర బలగాల ప్రోద్బలం ఉందని, హోం మంత్రి సారథ్యంలోనే ఈ కుట్ర జరిగిందని తాము భావిస్తున్నామని చెప్పారు. అమిత్‌షా రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.


'కేంద్ర సాయుధ పోలీసులు బలగాలు కాల్పులు ఎందుకు జరిపాయి? సాధారణ ఓటర్లపై కాల్పులు జరిపే అధికారం వాళ్లకు ఎవరు ఇచ్చారు? ఇదే ప్రధాన ప్రశ్న. ఇది కుట్రలో భాగమే. ప్రధానికి ఈ కుట్రలో ప్రమేయం ఉందని అనుకోవడం లేదు. ఇది ఓటర్లను భయభ్రాంతులను చేసే ప్రయత్నమే' అని రాయ్ అన్నారు. కూచ్ బెహర్ కాల్పులకు నిరసనగా పశ్చిమబెంగాల్‌లోని ప్రతి బ్లాక్‌లోనూ, వార్డుల్లోనూ టీఎంసీ కార్యకర్తలు నిరసనలు చేస్తారని చెప్పారు. కాగా, కూచ్ బెహర్‌లోని పోలింగ్ స్టేషన్లలో ఓటింగ్ జరుగుతుండగా కేంద్ర బలగాలు రెండుసార్లు కాల్పులు జరిపారని, ఈ కాల్పుల్లో నలుగురు పార్టీ కార్యకర్తలు మరణించారని టీఎంసీ ఆరోపించింది. జిల్లాలో నలుగురు వ్యక్తుల మరణాన్ని అధికార వర్గాలు కూడా ధ్రువీకరించాయి.


పోలింగ్ వాయిదాకు ఈసీ ఆదేశాలు...

కాగా, కాల్పుల ఘటన నేపథ్యంలో సీతల్‌కుర్చి (కూచ్‌బెహర్)లోని 126వ నెంబర్ పోలింగ్ బూత్‌లో ఎన్నికలను వాయిదా వేస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. శనివారం సాయంత్రం 5 గంటల కల్లా ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని కూడా రాష్ట్ర ఎన్నికల అధికారిని ఈసీ ఆదేశించింది. మరోవైపు, కాల్పుల ఘటనకు నిరసనగా కూచ్‌బెహర్‌లో ఆదివారంనాడు నిరసన ర్యాలీని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేపట్టనున్నారు. కాల్పుల్లో మృతి చెందిన ఓటర్లు, కార్యకర్తల కుటుంబాలను పరామర్శిస్తారు.

Updated Date - 2021-04-10T21:51:07+05:30 IST