మోదీ బంగ్లాదేశ్ పర్యటనపై ఈసీకి టీఎంసీ ఫిర్యాదు

ABN , First Publish Date - 2021-03-30T22:15:34+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని

మోదీ బంగ్లాదేశ్ పర్యటనపై ఈసీకి టీఎంసీ ఫిర్యాదు

కోల్‌కతా : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని టీఎంసీ ఆరోపించింది. ఆయనపై చర్య తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. మార్చి 27న బంగ్లాదేశ్‌లో ఆయన పాల్గొన్న కార్యక్రమాలు పశ్చిమ బెంగాల్ ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని పేర్కొంది. ఆయన విదేశీ గడ్డపై నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించారని ఆరోపించింది. 


ప్రధాని మోదీ బంగ్లాదేశ్ 50వ స్వాతంత్ర్య దినోత్సవాల్లోనూ, ‘బంగబంధు’ షేక్ ముజిబుర్ రహమాన్ శత జయంత్యుత్సవాల్లోనూ ఇటీవల పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆయన మార్చి 27న బంగ్లాదేశ్‌లోని మతువా సామాజిక వర్గానికి చెందిన ప్రజలతో సమావేశమయ్యారు. అక్కడి ప్రాచీన దేవాలయంలో పూజలు నిర్వహించారు. ఓ మత పెద్దను సందర్శించారు. 


మోదీని అభిశంసించాలి

ఈ నేపథ్యంలో టీఎంసీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. బంగ్లాదేశ్ విముక్తి కోసం భారత దేశం కీలక పాత్ర పోషించిందని పేర్కొంది. ఈ అధికారిక కార్యక్రమంలో మోదీ పాల్గొనడం తమకు అభ్యంతరకరం కాదని తెలిపింది. మార్చి 27న ఆయన పాల్గొన్న కార్యక్రమాలపైనే తమకు అభ్యంతరం ఉందని తెలిపింది. బంగ్లాదేశ్ స్వాతంత్ర్య దినోత్సవాలతో కానీ, ‘బంగబంధు’ రహమాన్ శతజయంత్యుత్సవాలతో కానీ ఈ కార్యక్రమాలకు సంబంధం లేదని పేర్కొంది. ఈ కార్యక్రమాలను కేవలం పశ్చిమ బెంగాల్‌ శాసన సభ ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో ఓటింగ్ విధానాన్ని ప్రభావితం చేయడానికే నిర్వహించారని ఆరోపించింది. ఇటువంటి అప్రజాస్వామిక, అనైతిక చర్యలకు గతంలో పని చేసిన భారత దేశ ప్రధాన మంత్రులెవరూ పాల్పడలేదని పేర్కొంది. మోదీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఆరోపించింది. విదేశీ గడ్డపై నుంచి పరోక్షంగా తన పార్టీ కోసం ప్రచారం చేశారని తెలిపింది. బంగ్లాదేశ్‌లోని ఒరకండిని మోదీ సందర్శించారని, దీని వెనుక ఆయన రాజకీయ దురుద్దేశం ఉందని పేర్కొంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన బీజేపీ ఎంపీ శాంతను ఠాకూర్‌ను మోదీ తనతో పాటు బంగ్లాదేశ్ తీసుకెళ్ళారని పేర్కొంది. శాంతనుకు భారత ప్రభుత్వంలో ఎటువంటి అధికారిక పదవి లేదని గుర్తు చేసింది.  ఆయనను అభిశంసించి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరింది. 


హిందూ దేవాలయంలో పూజలు, మతువా ప్రజలతో భేటీ

ప్రధాని మోదీ మార్చి 26, 27 తేదీల్లో బంగ్లాదేశ్‌లో పర్యటించారు. అధికారిక కార్యక్రమాలతోపాటు ఆయన బంగ్లాదేశ్‌లోని గోపాల్ గంజ్‌, ఒరకండిలో ఉన్న ప్రముఖ హిందూ దేవాలయంలో పూజలు నిర్వహించారు. మతువా కమ్యూనిటీవారిని ఉద్దేశించి మాట్లాడారు. భారత దేశంలోని మతువా కమ్యూనిటీ ప్రజల భావాలే తనకు కూడా ఒరకండి వచ్చిన తర్వాత కలిగాయని చెప్పారు. ఒరకండిలో ఓ ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేస్తామని, బాలికల మాధ్యమికోన్నత పాఠశాల స్థాయిని పెంచుతామని ప్రకటించారు. కోవిడ్ వ్యాక్సిన్ల గురించి మాట్లాడుతూ, భారత దేశంలో తయారైన వ్యాక్సిన్లు బంగ్లాదేశీయులకు చేరేలా చేయడం భారత దేశపు కర్తవ్యమని చెప్పారు. ఈశ్వరీపూర్‌లోని జెషోరేశ్వరీ కాళి దేవాలయాన్ని కూడా సందర్శించి, పూజలు చేశారు. 


Updated Date - 2021-03-30T22:15:34+05:30 IST