అటకెక్కిన అదనపు పరిహారం

ABN , First Publish Date - 2021-01-19T05:34:20+05:30 IST

తితలీ తుఫాన్‌ బాధిత రైతులకు అదనపు పరిహారం చెల్లిస్తామన్న వైసీపీ ప్రభుత్వ హామీ అటకెక్కుతోంది. నష్టపోయిన రైతులకు అదనంగా పరిహారం చెల్లిస్తామని ఉత్తర్వులను వెలువరించింది. కానీ నిధులు సరిపడా విడుదల చేయకపోవడంతో పరిహారం ఎవరికి అందించాలో అర్థం కాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. పరిహారం చెల్లింపుపై అధికారులు రాసిన లేఖకు ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో నిధులు ఖజానాల్లోనే మూలుగుతున్నాయి.

అటకెక్కిన అదనపు పరిహారం
తితలీ తుఫాన్‌ వల్ల తిప్పనపుట్టుగ వద్ద నేలకొరిగిన కొబ్బరి చెట్లు (ఫైల్‌)

రూ.225 కోట్లతో ప్రతిపాదనలు పంపించిన అధికారులు

ప్రభుత్వం నుంచి ప్రకటన కరువు

(ఇచ్ఛాపురం రూరల్‌)

తితలీ తుఫాన్‌ బాధిత రైతులకు అదనపు పరిహారం చెల్లిస్తామన్న వైసీపీ ప్రభుత్వ హామీ అటకెక్కుతోంది. నష్టపోయిన రైతులకు అదనంగా పరిహారం చెల్లిస్తామని ఉత్తర్వులను వెలువరించింది. కానీ నిధులు సరిపడా విడుదల చేయకపోవడంతో పరిహారం ఎవరికి అందించాలో అర్థం కాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. పరిహారం చెల్లింపుపై అధికారులు రాసిన లేఖకు ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో నిధులు ఖజానాల్లోనే మూలుగుతున్నాయి. మరోవైపు గతంలో చోటుచేసుకున్న అవకతవకల నేపథ్యంలో అటువంటి వారిని గుర్తించాలని ప్రజాప్రతినిధులు ఆదేశించడంతో ఎవరికి పరిహారం అందుతుందో... ఎవరికి దక్కదోనన్న ఆందోళన రైతుల్లో నెలకొంది. సంక్రాంతిలోగా బాధిత రైతులకు అదనపు పరిహారం చెల్లించకపోతే ఆందోళన బాట పడతామని టీడీపీ స్పష్టం చేసింది. ప్రభుత్వంలో మాత్రం చలనం లేకుండా పోయింది. సంక్రాంతికి కూడా ఎటువంటి ప్రకటన రాకపోవడంతో బాధితుల్లో నిరాశ అలుముకుంది. 


రూ.98 కోట్లు మాత్రమే విడుదల..


2018 అక్టోబరులో తితలీ తుఫాన్‌ సృష్టించిన బీభత్సంతో వ్యవసాయ పంటలతో పాటు వేలాది ఎకరాల్లో కొబ్బరి, జీడి, మామిడి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అప్పటి టీడీపీ ప్రభుత్వం కొబ్బరి చెట్టుకు రూ.1500 చొప్పున, జీడి, మామిడి పంటలకు హెక్టారుకు రూ.30 వేలు వంతున పరిహారం ప్రకటించింది. తుఫాన్‌ ప్రభావంతో 1,06,592 మంది రైతులు నష్టపోయినట్లు అధికారులు గుర్తించగా.. మొత్తం రూ.257.83 కోట్లు చెల్లించింది.  జీడి, మామిడి పంటలకు సంబంధించి 59,830 ఎకరాల్లో నష్టం వాటిల్లగా 71,175 మంది రూ.68 కోట్లు అందజేసింది. 12,56,229 కొబ్బరి చెట్లు నేలకొరిగినట్టు గుర్తించి.. 35,416 మంది కొబ్బరి రైతులకు రూ. 189.66 కోట్లు చెల్లించింది. టీడీపీ ప్రభుత్వ సాయం చాలదని.. తాము అధికారంలోకి వస్తే తితలీ బాధితులకు అదనపు పరిహారం చెల్లిస్తామని అప్పట్లో ప్రతిపక్ష నేతగా వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. ఈ మేరకు అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆయన ముఖ్యమంత్రిగా కొబ్బరి చెట్టుకు అదనంగా రూ.1500, జీడి, మామిడికి పంటలకు అదనంగా మరో రూ.20 వేలు పరిహారం ప్రకటించారు. ఇందుకు సంబంధించిన 2019 సెప్టెంబరు 3న జీవో నెంబరు 11ను జారీ చేశారు. గతంలో కొంతమంది అనర్హులకు కూడా పరిహారం అందిందనే విమర్శల నేపథ్యంలో అర్హుల జాబితా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఉద్యానశాఖ అధికారులు నివేదిక సిద్ధం చేశారు. 45.311 ఎకరాల జీడి, మామిడి పంటలకు సంబంధించి  58,330 మంది రైతులకు, 8,16,413 కొబ్బరి చెట్లకు సంబంధించి 22,649 మంది రైతులకు మొత్తం అదనపు పరిహారం కింద రూ.225 కోట్లు అవసరమని ప్రతిపాదనలు పంపించారు. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకూ రూ.98 కోట్లు మాత్రమే విడుదల చేసింది. వాటి చెల్లింపుపై స్పష్టత లేక పోవడంతో ఈ నిధులు ఎవరికి పంపిణీ చేయాలో అర్ధంకాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. బాధిత రైతులు పరిహారం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభు త్వం ఇప్పటికైనా స్పందించి పరిహారం చెల్లించాలని వేడుకుంటున్నారు.


ఎదురుచూస్తున్నాం

మాకు ఉన్న రెండెకరాల కొబ్బరి తోటలో 30 చెట్లు నేలకూలాయి. అప్పటి నుంచి జీవనాధారం కోల్పోయి అప్పుచేసి జీవనం సాగిస్తున్నాం. సీఎం జగన్‌ అదనపు పరిహారం ప్రకటించడంతో సంతోషించాం. కానీ ఇప్పటివరకు చెల్లించలేదు. దీనిపై ప్రభుత్వం స్పందించి అర్హులను ఆదుకోవాలి.

-డి.సీతారామ్‌, రైతు, బూర్జపాడు


చెల్లింపుపై స్పష్టత లేదు 

 కొబ్బరి, ఉద్యాన పంటలకు అదనపు సాయం చెల్లింపునకు రూ.225 కోట్లతో నివేదిక పంపించాం. ప్రభుత్వం కేవలం రూ.98 కోట్లు మాత్రమే విడుదల చేసింది. దీంతో ఎవరికి అందించాలో స్పష్టతలేదు. మొత్తం పరిహారం వచ్చిన తర్వాతే పంపిణీ చేయాలని కలెక్టర్‌ ఆదేశించడంతో పంపిణీ నిలిపివేశాం. మొత్తం పరిహారం వచ్చిన తర్వాతే పంపిణీ చేస్తాం.

- రత్నాల వరప్రసాద్‌, ఏడీ, హార్టికల్చర్‌, టెక్కలి

Updated Date - 2021-01-19T05:34:20+05:30 IST