తిరుపతి పోలింగ్‌ నేడే

ABN , First Publish Date - 2021-04-17T09:29:03+05:30 IST

తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. శనివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది.

తిరుపతి పోలింగ్‌ నేడే

ఉ.7 నుంచి సా.7 గంటల వరకు

ఉప పోరుకు పకడ్బందీ ఏర్పాట్లు

వైసీపీ నుంచి గురుమూర్తి, టీడీపీ తరఫున పనబాక 

బీజేపీ అభ్యర్థిగా రత్నప్రభ.. కాంగ్రెస్‌ నుంచి మోహన్‌

పోలింగ్‌ కేంద్రాలు 2,470.. ఓటర్లు 17,11,195

సమస్యాత్మక బూత్‌లు 877.. పోలీసులు 13,827 

కొవిడ్‌ నిబంధనలు పక్కాగా అమలు


నెల్లూరు/అమరావతి, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. శనివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. ఈ నియోజకవర్గం పరిధిలో నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట అసెంబ్లీ సెగ్మెంట్లు, చిత్తూరు జిల్లాలోని తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ ఏడు నియోజకవర్గాల పరిధిలో 2,470 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం ఓటర్ల సంఖ్య 17,11,195 మంది కాగా.. వీరిలో మహిళలు 8,38,540 మంది.


పురుష ఓటర్లు 8,71,942 మంది, 216 మంది థర్డ్‌ జెండర్స్‌, 497మంది సర్వీస్‌ ఓటర్లు ఉన్నారు. 466 సమస్యాత్మక ప్రాంతాల్లో 877 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించారు. 1,241 వెబ్‌ కాస్టింగ్‌ సెంటర్లు, 475మంది వీడియోగ్రాఫర్లు, 816 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు.  10,796 మంది పోలింగ్‌ సిబ్బంది, 13,827 పోలీసు సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. 80 ఏళ్లు పైబడిన 22,743 మందికి పోస్టల్‌ బ్యాలెట్‌ అవకాశం కల్పించారు. వీరి నుంచి పోస్టల్‌ బ్యాలెట్లను ఇప్పటికే ప్రత్యేక బృందాలతో సేకరించారు. 24,698 మంది ఉన్న దివ్యాంగ ఓటర్లు ఓటు వేసేందుకు మొబైల్‌ పోలింగ్‌ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేశారు. పోలింగ్‌ ప్రశాంతంగా జరిగేందుకు 43 ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌, 6 సీఆర్‌పీఎఫ్‌, సీఐఎ్‌సఎఫ్‌, 2 తెలంగాణ పోలీసు బృందాలు, 6 ఏపీఎస్పీ బలగాలను రప్పించారు.


పోలీసులకు బాడీ కెమెరాలిచ్చారు. మండల కేంద్రాల్లో ఈవీఎం యంత్రాలు, ఇతర ఎన్నికల సామగ్రి తీసుకుని..  సిబ్బంది శుక్రవారం సాయంత్రానికల్లా తమకు కేటాయించిన పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. పోలింగ్‌ ముగిసిన అనంతరం ఈవీఎం యంత్రాలు, వీవీ ప్యాట్‌లను నెల్లూరులోని డీకేడబ్ల్యూ కళాశాలలో భద్రపరచనున్నారు. ఇక్కడే మే 2వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. కాగా.. గూడూరులో ఎన్నికల విధులకు హాజరైన తమకు భోజనం సరిగా పెట్టలేదంటూ పోలింగ్‌ సిబ్బంది కలెక్టర్‌ చక్రధర్‌బాబుకు ఫిర్యాదు చేశారు. కనీసం మంచినీటి సదుపాయం కూడా సమకూర్చలేదని వాపోయారు. స్పందించిన కలెక్టర్‌ వెంటనే సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. 


బరిలో వీరే..

సీఎం జగన్మోహన్‌రెడ్డికి వ్యక్తిగత ఫిజియోథెరపిస్టు డాక్టర్‌ గురుమూర్తి వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉండగా.. టీడీపీ తరఫున కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా కర్ణాటక మాజీ సీఎస్‌ రత్నప్రభ, కాంగ్రెస్‌ నుంచి చింతా మోహన్‌, సీపీఎం తరఫున నెల్లూరు యాదగిరి సహా మొత్తం 28 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పోలింగ్‌ బూత్‌ ఏ ప్రదేశంలో ఉందో ఓటర్లు తెలుసుకోవటానికి కొత్తగా బూత్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. గూగుల్‌ ప్లే స్టోర్‌లో ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కరోనా నేపథ్యంలో పోలింగ్‌ సిబ్బంది అందరికీ వ్యాక్సిన్‌ అందించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. పోలింగ్‌ కేంద్రాల్లోనూ కోవిడ్‌ నిబంధనలు ఠంచనుగా అమలు చేయనున్నారు.


పోలింగ్‌ ముగిసే వరకు తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది. ఎలాంటి హింసాత్మక ఘటనలకు తావు లేకుండా, 23 కంపెనీల కేంద్ర బలగాలను కూడా వినియోగించనున్నారు. సాధారణ, వ్యయ, పోలీసు పరిశీలకులు ఉంటారు. 816 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని.. నగదు, మద్యం పంపిణీని అడ్డుకునేందుకు సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు పెట్టామని.. తనిఖీలు ముమ్మరం చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) కె.విజయానంద్‌ తెలిపారు. ఓటర్లు స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపిచ్చారు.

Updated Date - 2021-04-17T09:29:03+05:30 IST