TPT : అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగివ్వడానికి ఇష్టంలేక.. మిత్రుడినే చంపేసి.. చివరికి..!

ABN , First Publish Date - 2022-02-12T12:06:54+05:30 IST

అప్పు ఇచ్చి చాలాకాలం కావడంతో తిరిగి చెల్పించాలని పదేపదే అడగసాగాడు...

TPT : అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగివ్వడానికి ఇష్టంలేక.. మిత్రుడినే  చంపేసి.. చివరికి..!

  • తప్పించుకు తిరుగుతున్న నిందితుడి అరెస్ట్‌

 

తిరుపతి : తిరుపతిలో ఈనెల 5వ తేది రాత్రి జరిగిన హత్య కేసులో నిందితుడు అతడి స్నేహితుడేనని పోలీసులు గుర్తించారు. అప్పు ఎగ్గొట్టేందుకు చంపి.. బంగారు ఆభరణాలు కాజేసిన నిందితుడు రామకృష్ణను ఈస్ట్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఆ వివరాలను శుక్రవారం ఈస్ట్‌ డీఎస్పీ మురళీకృష్ణ మీడియాకు వివరించారు. ఆ ప్రకారం.. చిత్తూరు మురకంబట్టు అంబేడ్కర్‌ కాలనీకి చెందిన అన్నాదొరై (61), తన స్నేహితుడు, ఐరాల మండలం ఎర్రపల్లి గ్రామానికి చెందిన శ్రీరాముడు రామకృష్ణ అలియాస్‌ కాణిపాకం రామకృష్ణకు రూ.లక్ష అప్పుగా ఇచ్చాడు. 


అప్పు ఇచ్చి చాలాకాలం కావడంతో తిరిగి చెల్పించాలని పదేపదే అడగసాగాడు. ఈ అప్పు చెల్లించడం ఇష్టంలేని రామకృష్ణ.. స్నేహితుడిని హతమార్చాలని భావించాడు. దీంతో అప్పు సమస్య తీరడంతోపాటు అన్నాదొరై వద్దనున్న నగలూ నొక్కేయొచ్చని వ్యసనపరుడైన రామకృష్ణ ఆలోచించాడు. పథకం ప్రకారం.. అప్పు ఇస్తానంటూ నమ్మించి అన్నాదొరైను తిరుపతికి తీసుకొచ్చాడు. పెద్దకాపు వీధిలోని ఓ రెస్ట్‌హౌ‌స్‌లో గత శనివారం గది తీసుకున్నారు. గది కోసం అన్నాదొరై ఐడీ ప్రూఫ్‌నే ఇప్పించాడు. గదిలో అన్నాదొరై గొంతుకోసి, అతడు వేసుకుని ఉన్న బంగారు నగలను తీసుకుని పరారయ్యాడు. 


లాడ్జి సిబ్బంది ద్వారా సమాచారం తెలుసుకున్న ఈస్ట్‌ సీఐ శివప్రసాద్‌రెడ్డి, ఎస్‌ఐ ప్రకాష్‌కుమార్‌ గుర్తుతెలియని వ్యక్తి హత్యకు పాల్పడినట్టు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం నిందితుడు కాణిపాకం రామకృష్ణగా గుర్తించారు. గాంధీరోడ్డులో గురువారం రాత్రి తచ్చాడుతున్న రామకృష్ణను అరెస్ట్‌ చేసినట్టు ఈస్ట్‌ డీఎస్పీ మురళీకృష్ణ వెల్లడించారు. హత్యకు ఉపయోగించిన కత్తిని, హతుడినుంచి తస్కరించిన ఓ బంగారు గొలుసు, రెండు ఉంగరాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. 

Updated Date - 2022-02-12T12:06:54+05:30 IST