Abn logo
Mar 3 2021 @ 00:42AM

‘ఆత్మనిర్భర భారత్‌’ కోవెలగా తిరుపతి

కొవిడ్‌ దెబ్బకు కుదేలైన దేశ ఆర్థికవ్యవస్థను తిరిగి గాడిన పడేలా చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంచుకున్న పద్ధతి ‘ఆత్మనిర్భర్ భారత్’. ప్రపంచ ఆర్థికవ్యవస్థలో భారత్‌ను కీలక, అగ్రగామి శక్తిగా చేయాలన్నది ఆ పథకం లక్ష్యం. పోటీని తట్టుకుని నిలబడగలిగిన వ్యవస్థలను తయారుచేయాలన్న ఆలోచన దానిలో అంతర్భూతంగా ఉంది. ఆర్థికంగా కోలుకునేందుకు, అభివృద్ధి దిశలో పరుగులు తీసేందుకు అవసరమైన పునాదులు, ప్రాతిపదికలు అన్ని రంగాలలో నిర్మించాలని ప్రధాని మోదీ సంకల్పించారు. ఈ సంకల్ప సాధనకు విద్య, పరిశోధన రంగాల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ వాస్తవాన్ని మోదీ ప్రభుత్వం గుర్తించినట్టుగా కనిపిస్తున్నది. కనుకనే ఇటీవలి కాలంలో వివిధ జాతీయ వేదికల మీద ప్రధానమంత్రి చేస్తున్న ప్రసంగాలన్నింటిలో ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణం వైపు తాము వేస్తున్న అడుగుల గురించిన ప్రస్తావన ఉంది.


విశ్వభారతి విశ్వవిద్యాలయ స్నాతకోత్సవ సభలో తాము రూపొందించిన నూతన విద్యావిధానం, దేశాన్ని ఆత్మనిర్భర్ భారత్‌గా తీర్చిదిద్దే దిశగా వేసిన తొలి అడుగు అని మోదీ అన్నారు. ఐటి ఇతర రంగాల ప్రముఖులతో నిర్వహించిన సదస్సుల్లో ప్రసంగిస్తూ ఐటి పరిశ్రమ మీద మిగిలిన కొన్ని నియంత్రణలను కూడా ఎత్తివేయనున్నట్లు ఆయన ప్రకటించారు. కొత్త విద్యాపరిశోధక సంస్థల నిర్మాణం జరగాలని, నూతన ఆవిష్కరణలు భారత్‌ నుంచి ఆశిస్తున్నామని చెప్పారు. మనదేశం ముందంజలో ఉన్న రంగాలలో నాయకత్వాన్ని మరింత బలపరచుకోవాల్సిన అవసరం గురించి కూడా ప్రస్తావించారు. ప్రధాని గుర్తించిన ప్రధాన సమస్యలు- నీటి వినియోగం, వ్యవసాయరంగంలో ఎరువుల అవసరం, ఆరోగ్యం, టెలిమెడిసిన్‌, నైపుణ్యాల పెంపుదల మొదలైనవి. ప్రభుత్వం ఏర్పాటుచేసిన అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్స్‌, అటల్‌ ఇన్‌క్యుబేషన్‌ సెంటర్స్‌ ద్వారా నైపుణ్యాల పెరుగుదల అవకాశాలను సృష్టిస్తున్నారు. ఈ అవకాశాలు అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు పారిశ్రామిక, వ్యాపారసంస్థలు తమ సామాజిక బాధ్యత నిధులను వీటికి కేటాయిస్తే బాగుంటుందని కూడా ఆయన సూచించారు. అదే సమయంలో అభివృద్ధి చెందిన ప్రధాన నగరాలలోనే కాక, రెండవ, మూడవ స్థాయి నగరాల మీద దృష్టి పెట్టాలని, ఆ నగర ప్రాంతాలలో అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా వినియోగించుకోవాలని ప్రధాని కోరారు. నూతన ఆవిష్కరణలు మహానగరాలలో మాత్రమే సాధ్యం అనే ఆలోచన సరైనది కాదన్నారు. ఇటీవల ప్రకటించిన పద్మశ్రీ అవార్డుల జాబితాలో స్థానం సంపాదించిన శ్రీధర్‌ వెంబు, తమిళనాడులోని గ్రామీణ ప్రాంతంలోకి ఐటి పరిశ్రమను తీసుకువెళ్ళిన విషయాన్ని ప్రస్తావించారు. గ్రామీణ విద్యార్థులలోని టాలెంట్‌ను ఉపయోగించి, దేశాన్ని ముందుకు నడిపించటం సాధ్యమేనని వెంబు టెంకాసిలో స్థాపించిన జోహా కార్పొరేషన్‌ నిరూపించిన విషయం ప్రధాని గుర్తుచేసుకున్నారు.


కేంద్రప్రభుత్వం త్వరలో ఆవిష్కరించబోయే ఒక నూతన విధానాన్ని కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి చూచాయగా ప్రస్తావించారు. ఖరగ్‌పూర్ ఐఐటి విద్యార్థులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో దేశంలో విద్య, పరిశోధనల మీద ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించేందుకు ప్రభుత్వం దగ్గర ఒక ఆలోచన ఉందన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో పది నుంచి పన్నెండు ఎంపిక చేసిన కేంద్రాలలో విద్య, పరిశోధనలను ప్రోత్సాహించి, నూతన అవకాశాలు కల్పించనున్నట్టు ఆయన సూచనాత్మకంగా చెప్పారు. ఈ విషయం తెలుసుకున్నాను. అందరికన్నా ముందుగా ఒక వినూత్న ప్రతిపాదనతో ముందుకు వెళ్ళాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై ఉంది. ఎంపిక చేయనున్న ముఖ్య కేంద్రాలలో ఒక దానిని తమ రాష్ట్రానికి కేటాయించమని కోరటమే కాక, అటువంటి కేంద్రానికి తగిన ప్రదేశాన్ని సూచించటం అవసరం. మన రాష్ట్రానికి సంబంధించినంతవరకు కేంద్రానికి ప్రతిపాదించదగిన నగరం తిరుపతి.


తిరుపతిలో 60 ఏళ్ళకు పైబడిన శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉంది. విద్యకు, పరిశోధనలకు ఆ విశ్వవిద్యాలయం జాతీయస్థాయిలోనే గుర్తింపు పొందింది. ఆ విశ్వవిద్యాలయంతో పాటు తిరుపతిలో పశువైద్య కళాశాల, వైద్య కళాశాల, ఇంజనీరింగ్‌ కళాశాలలు పలు దశాబ్దాలుగా ఉన్నాయి. వ్యవసాయం, హోంసైన్స్‌ రంగాలకు తిరుపతి ఒక ముఖ్య కేంద్రమే.


సంస్కృత విశ్వవిద్యాలయం కలిగిన అతికొద్ది కేంద్రాలలో తిరుపతి ఒకటి. సంస్కృత భాష మీద అంతర్జాతీయంగా ఆసక్తి పెరుగుతున్న కాలమిది. కంప్యూటర్‌ భాషకు అత్యంత అనువైన భాష సంస్కృతం. సంస్కృత భాషలోని విజ్ఞానశాస్త్రాలన్నీ, నేటి సైంటిస్టులకు అర్థమయ్యే రీతిలో వివరించగలిగిన ఒక వ్యవస్థను తిరుపతిలోని సంస్కృత విశ్వవిద్యాలయం నిర్మించగలదు. నవీన పరిశోధనలకు, సంస్కృత గ్రంథాలలో ప్రస్తావించిన అంశాలకు మధ్య శాస్త్రపరమైన చర్చ, అవగాహన, పరిశోధనలను ప్రోత్సహించటం ద్వారా తిరుపతి ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణ కేంద్రం కాగలదు.


తిరుపతికి 2014 తర్వాత వచ్చిన ఐఐటి, ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ రీసెర్చి (ఐఐఎస్‌ఇఆర్‌) విద్య, పరిశోధనలకు పెద్దపీట వేస్తున్న జాతీయ సంస్థలు. నేషనల్‌ అట్మాస్ఫియరిక్‌ రీసెర్చ్‌ లాబరేటరీ (ఎన్‌ఎఆర్‌ఎల్‌) తిరుపతిలో ఉంది. ఇవన్నీ పరిశోధనలను ముందుకు నడిపించగలిగిన కేంద్రాలు. ఇక ప్రైవేట్‌ రంగంలో పలు ఇంజనీరింగ్‌ కాలేజీలు తిరుపతి చుట్టుపక్కల నడుస్తున్నాయి. రేణిగుంట సమీపంలోని పారిశ్రామికవాడలో అమర్‌రాజా బ్యాటరీస్‌ వంటి మేలు పరిశ్రమలున్నాయి. దేశంలో విజయవంతమైన ప్రత్యేక పారిశ్రామికవాడల్లో ఒకటి అయిన శ్రీసిటీ కూడా తిరుపతికి మరీ దూరంలో లేదు. అక్కడ కేంద్రప్రభుత్వ ట్రిపుల్‌ ఐటి ఉంది. దేశంలోని ఏకైక రాకెట్‌ లాంచింగ్‌ సెంటర్‌ శ్రీహరికోటలో ఉంది. పరిశోధకులకు ప్రోత్సాహం లభించే కేంద్రం అది. తిరుపతికి అన్ని హంగులూ ఉన్నాయి. వాతావరణపరంగా, ఆధ్యాత్మికపరంగా దేశంలో ప్రముఖులు ఎవరికైనా ఆహ్వానం పంపగానే రప్పించగలిగిన నగరం తిరుపతి. ఇటువంటి నగరానికి కావాల్సింది అక్కడి సంస్థలన్నింటినీ సంయుక్తపరచగలిగిన ఒక అథారిటీ. ఏ సంస్థకా సంస్థ గిరిగీసుకుని పనిచేయటం కాక, పరిశోధనాపరంగా నైపుణ్యాలను పంచటంలోనూ కలిసికట్టుగా పనిచేయించగలిగిన అథారిటీ ఒకటి అవసరం. నిరంతరం సమాచారం ఇచ్చిపుచ్చుకోవటం, పరిశోధనా సంస్థలకు, స్థానిక పరిశ్రమలకు మధ్య వారథిగా పనిచేయగలిగిన అధికారవ్యవస్థ నొకదాన్ని ఏర్పాటు చేయాలి. తిరుపతి పరిసరాలలోని పరిశ్రమలే కాక, రాష్ట్రంలోని ఇతర పరిశ్రమలు, సంస్థలు, తమ కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ (సిఎస్‌ఆర్‌) నిధులను తిరుపతి కేంద్రంగా నడిచే సంస్థలకు కేటాయించడం ద్వారా కొత్త పరిశోధనలను ప్రోత్సహించిన వారవుతారు.


తిరుపతిలోని సంగీత కళాశాల సేవలను సైన్స్‌లో వినియోగించుకోవడం అవసరం. సైంటిస్ట్‌ల ఆలోచనలను మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళగలిగిన శక్తి సంగీతానికి ఉంది. ప్రపంచ ప్రఖ్యాత సైంటిస్ట్‌ల్లో అధికశాతం సంగీత అభిమానులే. పరిశోధనల్లో నోబెల్‌ బహుమతి గ్రహీతలతో నిర్వహించిన సర్వేలో ఆ విజేతలలో అత్యధికులు ఏదో ఒక కళలో ప్రవేశం కలవారని తేలింది. అందులో సంగీతానిది ప్రథమస్థానం. విద్యార్థులకు, పరిశోధనలకు సహాయపడగలిగిన సంగీత వాతావరణం కూడా తిరుపతి అందించగలదు. కేంద్రప్రభుత్వం తప్పకుండా తిరుపతిని పరిగణనలోకి తీసుకుని దానిని పరిశోధక, విద్యాకేంద్రంగా ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళాలి. అందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తగిన చొరవ తీసుకోవాలి.

డా. కె. లక్ష్మీనారాయణ

Advertisement
Advertisement
Advertisement